Politics

విజయనగరం కోటలో జయం ఎవరికో

vijayanagaram 2019 elections analysis

విజయనగరం జిల్లాలో 9 శాసనసభ నియోజకవర్గాలున్నాయి. ప్రభుత్వం అందిస్తున్న పింఛన్లు, పసుపు-కుంకుమ పథకాలు నేతల విజయావకాశాలను ప్రభావితం చేయనున్నాయనేది స్పష్టంగా తెలుస్తోంది. కొన్ని నియోజకవర్గాల్లో ప్రస్తుత ఎమ్మెల్యేల వైఖరిపై విమర్శలున్నాయి. టికెట్ల కేటాయింపులో కొందరికే ప్రాధాన్యం దక్కిందన్న విషయం పలుచోట్ల కీలకం కాబోతోంది. ఇప్పటికీ రాజ కుటుంబాలపై అభిమానమూ, వారి ప్రభావమూ అక్కడ కనిపిస్తోంది. ఈ ప్రత్యేకతలతో పోరు హోరాహోరీగా మారింది.
**‘కోట’లో గెలిచేదెవరు?
తెదేపా: కోళ్ల లలిత కుమారి
వైకాపా: కె. శ్రీనివాసరావు
రెండుసార్లు నియోజకవర్గం నుంచి గెలుపొందిన కోళ్ల లలితకుమారి మరోసారి తెదేపా నుంచి బరిలో నిలిచారు. నియోజకవర్గంలో తిరుగుతూ ప్రజలతో సత్సంబంధాలు పెంచుకున్నారు. నియోజకవర్గ అభివృద్ధి పనులు కలిసొస్తాయని నమ్ముతున్నారు. గ్రామాల్లో రోడ్లు నిర్మించారు. 312 గ్రామాలకు తాగునీరందించేందుకు తీసుకొచ్చిన పథకం కొంత పూర్తయింది. 100 గ్రామాలకు నీళ్లు ఇచ్చారు. ఇంటింటికి కుళాయి పేరుతో చేపట్టిన పథకం పనులు కొనసాగుతున్నాయి. వైకాపా నుంచి బరిలో నిలిచిన శ్రీనివాసరావు ఎన్‌ఆర్‌ఐ. స్థానికేతరుడైన ఈయనకు ప్రజలతో సంబంధాలు అంతంతమాత్రమే. గతంలో కాంగ్రెస్‌ రెబెల్‌గా బరిలో నిలిచి 30 వేలకు పైగా ఓట్లు సాధించిన ఇందుకూరు రఘురాజు వైకాపాలో చేరడం కలిసొస్తుందనే అభిప్రాయంతో ఉన్నారు.
**సాలూరు.. నిలిచేదెవరు?
తెదేపా: ఆర్‌.పి.భంజ్‌దేవ్‌
వైకాపా: పీడిక రాజన్నదొర
రెండుసార్లు గెలిచిన రాజన్నదొర మరోసారి వైకాపా అభ్యర్థిగా బరిలోకి దిగారు. భంజ్‌దేవ్‌ తెదేపా నుంచి పోటీ పడుతున్నారు. 2004లో తెదేపా అభ్యర్థి భంజ్‌దేవ్‌ గెలిచినా రాజన్నదొర న్యాయస్థానానికి వెళ్లి పోరాడారు. ఆయన గిరిజనుడు కాదని పోరాటం చేయడంతో కోర్టు భంజ్‌దేవ్‌ను అనర్హుడిగా ప్రకటించడంతో 2004-09 కాలానికి రాజన్నదొరనే ఎమ్మెల్యేగా పేర్కొన్నారు. ఆ తర్వాత మళ్లీ భంజ్‌ గిరిజనుడనే నిర్ధరణ చేసుకోడంతో తాజాగా మళ్లీ బరిలోకి దిగే అవకాశం దక్కింది. భంజ్‌దేవ్‌ తెదేపా అభ్యర్థిగా నియోజకవర్గంలో మూడు నెలలుగా పని చేసుకుంటున్నారు. ఎమ్మెల్సీ సంధ్యారాణి ఇక్కడి నుంచి తెదేపా టికెట్‌ ఆశించినా దక్కలేదు. ఇద్దరూ కలిసి పార్టీ విజయానికి పని చేస్తున్నారు.
**అనూహ్యంగా మారి.. బరిలో దిగి..
తెదేపా అభ్యర్థి: నరసింహ ప్రియ థాట్రాజ్‌
వైకాపా అభ్యర్థి: పాముల పుష్ప శ్రీవాణి
తెదేపా అభ్యర్థి జనార్దన్‌ థాట్రాజ్‌ నామినేషన్‌ తిరస్కరణకు గురవ్వడంతో డమ్మీ అభ్యర్థిగా నామినేషన్‌ వేసిన ఆయన తల్లి నరసింహప్రియ థాట్రాజ్‌ అనూహ్యంగా బరిలో నిలిచారు. ఈమె ఇంతకుముందు పార్వతీపురం మున్సిపల్‌ ఛైర్మన్‌గానూ పని చేశారు. కిషోర్‌ చంద్రదేవ్‌ తెదేపాలోకి రావడం ఇక్కడ తెదేపాకు కలిసొచ్చే అంశంగా మారింది. ప్రస్తుత ఎమ్మెల్యే, వైకాపా అభ్యర్థి శ్రీవాణికి ప్రజలతో మంచి పరిచయాలున్నాయి. గుమ్మలక్ష్మీపురం జడ్పీటీసీ సభ్యుడు, మండలాధ్యక్షులు వైకాపా నుంచి తెదేపాలోకి చేరడం బలాన్నిస్తోంది. మాజీ ఎమ్మెల్యే నిమ్మక జయరాజ్‌ భాజపా నుంచి బరిలో నిలిచారు. శత్రుచర్ల సోదరుడు చంద్రశేఖరరాజు తన కుమార్తె పల్లవి కోసం తెదేపా టికెట్‌ ఆశించగా.. సాధ్యం కాకపోవడంతో వైకాపాలో చేరారు.
**పార్వతీపురం.. ఎవరి పరం..?
తెదేపా అభ్యర్థి: బొబ్బిలి చిరంజీవులు
వైకాపా అభ్యర్థి: అలజంగి జోగారావు
ప్రస్తుత ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు తెదేపా నుంచి పోటీలో ఉన్నారు. సౌమ్యుడు, కలుపుగోలుగా ఉంటారన్న పేరుంది. వైకాపా అభ్యర్థి జోగారావు కొంత ఆవేశపరులు. పార్వతీపురంలో వ్యాపార వర్గాలు ఎక్కువ. ప్రస్తుతం తెదేపాలో చేరిన కిశోర్‌ చంద్రదేవ్‌కు ఈ వర్గంతో సన్నిహిత సంబంధాలున్నాయి. అరకు లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఆయన బరిలో నిలవడంతో ఇక్కడ ఆయన ద్వారా వచ్చే ఓట్లు తెదేపాకు కలిసొస్తాయనే అంచనా వేస్తోంది. వైకాపా అభ్యర్థిత్వం ఆశించిన ప్రసన్నకుమార్‌కు టికెట్‌ రాలేదు. కొంతకాలం స్తబ్దుగా ఉన్నా వైకాపా నుంచి హామీ లభించడంతో పార్టీ కార్యకలాపాల్లో పాల్గొంటున్నారు. ప్రస్తుతం భాజపా అభ్యర్థిగా బరిలో నిలిచిన సురగాల ఉమామహేశ్వరరావు ఎమ్మెల్సీ జగదీష్‌కు సన్నిహితుడు. తెదేపా అభ్యర్థిత్వం ఆశించి ఆనక భాజపా నుంచి పోటీలోకి దిగారు. దీంతో పోటీ ఆసక్తికరంగా ఉండనుంది.
**బొత్స పట్టు నిలుపుకొంటారా..! నాగార్జున హిట్టు కొడతారా!
తెదేపా అభ్యర్థి: కిమిడి నాగార్జున
వైకాపా: బొత్స సత్యనారాయణ
మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఈ నియోజకవర్గంలో సమరోత్సాహంతో ఉండగా తెదేపా తరఫున మాజీ మంత్రి కిమిడి మృణాళిని కుమారుడు నాగార్జున పోటీ చేస్తున్నారు. నియోజకవర్గంలో బొత్సకు పటిష్ఠమైన కార్యకర్తల బలం ఉంది. 2014లో రాష్ట్రమంతటా కాంగ్రెస్‌ వ్యతిరేకత ఉన్న సమయంలోనూ ఆ పార్టీ నుంచే పోటీచేసి దాదాపు 42,945 ఓట్లు సాధించి రెండో స్థానంలో నిలవడం విశేషం. ఆ తర్వాత ఆయన వైకాపాలో చేరి తాజాగా బరిలో నిలిచారు. తెదేపా నుంచి రంగంలోకి దిగిన నాగార్జున విద్యావంతుడు, యువకుడు. నాటి బొత్స హయాంలో జరిగిన అవినీతి అంశాలను సూటిగా ఓటర్లలోకి తీసుకువెళ్లగలుగుతున్నారు. వాక్పటిమతో చేస్తున్న ప్రసంగాలు తెదేపా క్యాడర్‌లో కొత్త ఉత్సాహం నింపుతున్నాయి.
**బొబ్బిలి కోట.. గెలుపు వేట
తెదేపా అభ్యర్థి: సుజయ్‌ కృష్ణ రంగారావు
వైకాపా అభ్యర్థి: వెంకట చిన అప్పలనాయుడు
వరుసగా మూడుసార్లు గెలిచి, తాజాగా మంత్రిగా ఉన్న సుజయ్‌ కృష్ణ రంగారావు ప్రస్తుతం గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. గతంలో మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన చిన అప్పలనాయుడు వైకాపా నుంచి బరిలో ఉన్నారు. సుజయ్‌ ఇక్కడ అభ్యర్థి అయినా ఆయన సోదరుడు బేబి నాయన ప్రచారం బాధ్యతలు పర్యవేక్షిస్తున్నారు. 2014 ఎన్నికల్లో వైకాపా నుంచి గెలిచిన సుజయ్‌ ఆ తర్వాత తెదేపాలో చేరినా క్యాడర్‌ పూర్తిగా వెంట రాలేదు. కొందరు వచ్చినా తిరిగి వైకాపా గూటికి చేరారు. వైకాపా అభ్యర్థికి ప్రజలతో సంబంధ బాంధవ్యాలు తక్కువనే విమర్శ ఉంది. పల్లెల్లో ఉన్న వైకాపా క్యాడర్‌ తాము జగన్‌ను చూసి ఓటు వేస్తాం తప్ప స్థానిక అభ్యర్థితో సంబంధం లేదంటున్నారు. ఇంతకుముందు సుజయ్‌పై తెదేపా నుంచి పోటీ పడ్డ తెంటు లక్ష్మీనాయుడు కూడా ఆయనవైపే ఉన్నారు.
**అనుభవం × బొత్స బంధుత్వం
తెదేపా: పతివాడ నారాయణస్వామి
వైకాపా: బి.అప్పలనాయుడు
ఇప్పటికే ఏడుసార్లు గెలుపొంది ఒకసారి ఓడిపోయిన పతివాడ నారాయణస్వామి మళ్లీ తెదేపా నుంచి బరిలో నిలిచారు. ఈయన వివాదరహితుడు, సౌమ్యుడనే పేరుంది. 85 ఏళ్ల వయసులోనూ ఓపిగ్గా కష్టపడతారని ఓటర్లు చెబుతున్నారు. ఆయన కుమారుల తీరుపై విమర్శలున్నాయి. వైకాపా నుంచి బరిలో నిలిచిన అప్పలనాయుడు బొత్స సత్యనారాయణ బంధువర్గమే. అప్పలనాయుడుకు వాక్చాతుర్యం ఎక్కువ.. ఆయన వ్యవహార తీరుపై కొంత విమర్శలున్నాయి. అప్పలనాయుడు వెంట ఉండే కొందరు ద్వితీయశ్రేణి నాయకుల తీరుపైనా విమర్శలున్నాయి. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసి పార్టీపై నాటి తీవ్ర వ్యతిరేకత ఉన్న సమయంలోను దాదాపు 26 వేల ఓట్లు సంపాదించారు. ఇక్కడా పోటీ హోరాహోరీగానే ఉంటుంది.
**రాజకుటుంబమా.. వీరభద్రమా..
తెదేపా అభ్యర్థి : అదితి గజపతిరాజు
వైకాపా అభ్యర్థి : కె. వీరభద్రస్వామి
అశోక్‌గజపతి రాజు కుమార్తె అదితి తొలిసారిగా పోటీ చేస్తున్నారు. 2004లో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన కె.వీరభద్రస్వామి వైకాపా నుంచి బరిలో ఉన్నారు. రాజవంశీయులపై కొందరికి ఉన్న గౌరవం, అభిమానం అదితికి కలిసొచ్చే అవకాశం ఉంది. తెదేపాకు క్యాడర్‌ ఎక్కువగా ఉంది. 1983 నుంచి ఏడుసార్లు తెదేపానే గెలిచింది. అయితే.. ద్వితీయశ్రేణి నాయకులపై ఆధారపడుతూ ప్రజలతో పూర్తిస్థాయి సంబంధ బాంధవ్యాలు లేకపోవడం ప్రతికూలంగా మారింది. ప్రత్యర్థి వీరభద్రస్వామి ప్రస్తుతం ఇదే అంశాన్ని ప్రచారంలో ప్రస్తావిస్తున్నారు. తనను ఎన్నుకుంటే ప్రజలకు అందుబాటులో ఉంటానని చెబుతున్నారు. ఆరుసార్లు పోటీ చేసి ఒకసారి గెలిచిన వీరభద్రస్వామి సానుభూతి అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు. రాజవంశంపై విజయనగరంలోని సామాన్యుల్లోని అభిమానమే కీలకమవుతుందనే చర్చ ఉంది. వీరభద్రస్వామి అనుచరుల వ్యవహారశైలి ఆయనకు ప్రతికూలంగా ఉండొచ్చు. వైకాపాలో ఉన్న మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, వీరభద్రస్వామి మధ్య వైరుధ్యాలున్నాయి. ప్రస్తుతం బొత్స వర్గం తటస్థంగా ఉన్నా చివరకు ఎంతవరకు సహకరిస్తుందనేది కీలకమే.
**గజపతిన‘గరం’.. గట్టి పోటీ
తెదేపా అభ్యర్థి: కె.ఎ.నాయుడు
వైకాపా అభ్యర్థి: బొత్స అప్పలనర్సయ్య
ప్రస్తుత ఎమ్మెల్యే కె.ఎ.నాయుడు.. బొత్స సోదరుడు అప్పలనర్సయ్య నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. ఇక్కడ తెదేపాకు ఉన్న క్యాడర్‌ ఎమ్మెల్యేకు బలంగా నిలుస్తోంది. వైకాపా అభ్యర్థి నియోజకవర్గ పరిస్థితులను తనకు అనుకూలంగా మలచుకుని గెలవాలనే ప్రయత్నం చేస్తున్నారు. వైకాపా కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ పల్లెల్లో ఉన్న పట్టును ఓట్లుగా మలుచుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. గంట్యాడ మాజీ మండలాధ్యక్షుడు కొండపల్లి కొండలరావు తదితరులు వైకాపాలో చేరారు. తెదేపా కార్యకర్తలు మొదట్లో కొంత స్తబ్దుగా ఉన్నా.. ఇప్పుడు ఉత్సాహంతో పని చేస్తున్నారు. మరోసారి గెలుపును సొంతం చేసుకోవాలని ప్రయత్నాలు సాగిస్తున్నారు.