Devotional

అదే అర్థనారీశ్వర రహస్యం

arthanareeswara secrets

1. అర్థనారీశ్వరంలోని అసలు రహస్యం – తదితర ఆద్యాత్మిక వార్తలు
సృష్టి ఆదిలో నారాయణుని నాభికమలం నుంచి అవతరించిన చతుర్ముఖ బ్రహ్మ పరమాత్మ ఆదేశానుసారం సృష్టి కార్యానికి పూనుకొని మహాత్ముల సహకారం అర్థించాడు. ‘ముందు స్త్రీ జాతిని సృష్టించు నీ కార్యం సఫలం అవుతుంది’ అన్న ఆకాశవాణి వాక్కు విని, బ్రహ్మ ఆ శక్తి తనకు కలగాలని తపస్సు చేయడం ప్రారంభించాడు. చాలాకాలం తర్వాత పరమేశ్వరుడు అర్థనారీశ్వరుడి రూపంలో బ్రహ్మముందు ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మ మనోగతం తెలుసుకొని, తన శరీరంలోని అర్థభాగంలో అమరిఉన్న పార్వతీదేవిని పరాశక్తిగా వేరుచేసి బ్రహ్మ సృష్టికి సహకరించమన్నాడు. ఆమె ‘అలాగే’ అని తన కనుబొమ్మల నుంచి తనతో సమానమైన కాంతిమతి అయిన ఒక నారీశక్తిని ప్రకాశింపజేసింది. ఆ పరాశక్తే బ్రహ్మదేవుని సృష్టి కార్యాన్ని అవిఘ్నంగా జరిగేలా చేసింది. సృష్టి తర్వాత, ఆమె తిరిగి పరమేశ్వరుని శరీరంలో ప్రవేశించి, అర్థనారీశ్వరి అయింది. ఆనాటి నుంచి శివుడు అర్థనారీశ్వరుడు అయ్యాడు. కాళిదాసు మహాకవి పార్వతీపరమేశ్వరులను ఇలా స్తుతించడానికి కారణం శివుడి అర్థనారీశ్వరతత్వమే!
2. జగన్మాతకు మందార, కలువలతో పుష్పార్చన
వికారి నామ సంవత్సర చైౖౖత్రమాస వసంత నవరాత్రోత్సవాల్లో భాగంగా మందార, కలువ పుష్పాలతో నేత్రపర్వంగా రుత్వికులు మంగళవారం అర్చన చేశారు. మహా మండపం ఏడో అంతస్తులో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన దుర్గమ్మ ఉత్సవమూర్తి వద్ద ఉభయదాతలు ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య రుత్వికులు రెండు గంటల పాటు అమ్మవారికి పుష్పాలతో అర్చన చేశారు. పుష్పార్చనకు ముందు పాలకమండలి ఛైర్మన్‌ గౌరంగబాబు, సభ్యులు సాంబసుశీల, దేవస్థానం ఉద్యోగులు పుష్పాలను బుట్టల్లో ఉంచి మంగళ వాయిద్యాల మధ్య ఊరేగింపుగా మల్లికార్జున మహామండపానికి తీసుకువచ్చి రుత్వికులకు అప్పగించారు. సంప్రదాయ దుస్తుల్లో ఉభయదాతలు స్వయంగా అమ్మవారి రూపునకు కుంకుమతో పూజ చేశారు. తరువాత పుష్పార్చన చేశారు. అనంతరం ఉభయ దాతలకు దేవస్థానం సిబ్బంది ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం చేయించి ప్రసాదాలను అందజేశారు.
3. శ్రీవారి సేవలో గవర్నర్‌ నరసింహన్‌
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారిని ఉభయ తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌ దంపతులు మంగళవారం దర్శించుకున్నారు. హుండీలో కానుకలు సమర్పించి రంగనాయకుల మండపానికి చేరుకోగా పండితులు వేదాశీర్వచనం చేశారు. గవర్నర్‌తో పాటు మాజీ గవర్నర్‌ నారాయణన్‌ శ్రీవారిని దర్శించుకున్నారు.
4. శ్రీవారి ట్రస్టులకు రూ.1.88 కోట్ల విరాళం
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి వివిధ ట్రస్టులకు రూ.1.88 కోట్ల విరాళం మంగళవారం వచ్చింది. నిత్య అన్నప్రసాదం ట్రస్టుకు రూ.1.77 కోట్లు, బాలాజీ ఆరోగ్య వరప్రసాదినికి రూ.లక్ష, ప్రాణదానం పథకానికి రూ.1.71 లక్షలు, సర్వశ్రేయకి రూ.1.71 లక్షలు, విద్యాదానం ట్రస్టుకి రూ.7 లక్షలు వంతున భక్తులు విరాళాలను సమర్పించారు.
5. నేటి నుంచి టైమ్‌స్లాట్‌ టోకెన్ల జారీ సమయం మార్పు
శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు తిరుపతిలో ఇస్తున్న సర్వదర్శనం టైమ్‌స్లాట్‌ టోకెన్ల జారీ సమయాన్ని మార్పు చేస్తున్నట్లు తితిదే తెలిపింది. ఇప్పటివరకు ప్రతిరోజూ అర్ధరాత్రి 12 గంటల నుంచి టోకెన్లు జారీ చేస్తున్నారు. భక్తుల సౌకర్యార్థం 10వ తేదీ బుధవారం నుంచి ప్రతిరోజు వేకువజామున 4 నుంచి ఉదయం 6గంటల వరకు తిరుపతిలోని ఆర్టీసీ బస్టాండు, శ్రీనివాసం, విష్ణునివాసం, మూడు సత్రాలు, భూదేవి కాంప్లెక్స్‌లో టోకెన్లు జారీ చేస్తారు. టోకెన్లు మిగిలితే 6గంటల తరువాత కూడా ఇస్తారు.
6. వేములవాడలో కనుల పండువగా నెమలివాహనం సేవ
రాజన్న ఆలయంలో ఏటా ఉగాది పర్వదినం నుంచి శ్రీరామనవమి వరకు నిర్వహించే నవరాత్రోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. అందులో భాగంగా రాత్రి నిర్వహించిన నెమలివాహన సేవ కనుల పండువగా సాగింది. ఉత్సవమూర్తులకు ఉదయం స్వామివారికి 11 మంది రుత్వికులు మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. రాత్రి 8 గంటలకు సీతారామచంద్రస్వామివారి ఆలయంలో స్థానాచార్యులు అప్పాల భీమాశంకర్ ఆధ్వర్యంలో అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సమూర్తులను అలంకరించి నెమలివాహనంపై పురవీధులగుండా ఊరేగించారు. పూజల్లో ఆలయ ఈవో దూస రాజేశ్వర్, ఆలయ అర్చకులు, పర్యవేక్షకులు తదితరులు పాల్గొన్నారు.
7. తిరుమల సమాచారం ఓం నమో వేంకటేశాయ
ఈరోజు బుధవారం 10-04-2019 ఉదయం 5 గంటల సమయానికి.తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ …… శ్రీ వారి దర్శనానికి 2 కంపార్ట్ మెంట్ లో వేచి ఉన్న భక్తులు… శ్రీ వారి సర్వ దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేష (300/-) దర్శనానికి, కాలినడక భక్తులకు, టైమ్ స్లాట్ సర్వ దర్శనానికి 03 గంటల సమయం పడుతోంది.. నిన్న ఏప్రిల్ 9 న 64,103 మంది భక్తులకు శ్రీవారి ధర్శనభాగ్యం కలిగినది. నిన్న స్వామి వారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు కానుకలు ₹:2.59 కోట్లు.
8. చరిత్రలో ఈ రోజు/ఏప్రిల్ 10 – మొరార్జీ దేశాయి
1755 : హోమియోపతి వైద్యవిధానాన్ని కనిపెట్టిన క్రిస్టియన్ ఫ్రెడెరిక్ శామ్యూల్ హానిమాన్ జననం (మ.1843).
1857 : భారత మొదటి స్వాతంత్ర్య యుద్ధం మీరట్‌లో మొదలయ్యింది.
1813 : సుప్రసిద్ధ గణిత శాస్త్రవేత్త మరియు ఖగోళ శాస్త్రజ్ఞుడు జోసెఫ్ లూయిస్ లెగ్రాంజ్ మరణం (జ.1736).
1894 : ఘన్ శ్యామ్ దాస్ బిర్లా జననం (మ.1983).
1898 : ప్రముఖ హేతువాది ఎ.టి.కోవూర్ జననం (మ.1978).1932 : ప్రముఖ భారతీయ హిందుస్తానీ సంగీత విద్వాంసురాలు కిషోరీ అమోంకర్ జననం.
1995 : భారత మాజీ ప్రధాన మంత్రి మొరార్జీ దేశాయి మరణం (జ.1896)
9. శుభమస్తు తేది : 10, ఏప్రిల్ 2019
సంవత్సరం : వికారినామ సంవత్సరం
ఆయనం :ఉత్తరాయణం
మాసం : చైత్రమాసం
ఋతువు : వసంత ఋతువు
కాలము : వేసవికాలం
వారము : బుధవారం
పక్షం : శుక్లపక్షం
తిథి : పంచమి
(నిన్న సాయంత్రం 4 గం॥ 5 ని॥ నుంచి
ఈరోజు సాయంత్రం 3 గం॥ 33 ని॥ వరకు)
నక్షత్రం : రోహిణి
(నిన్న ఉదయం 10 గం॥ 19 ని॥ నుంచి
ఈరోజు ఉదయం 10 గం॥ 32 ని॥ వరకు)
యోగము : సౌభాగ్యము
కరణం : బవ
వర్జ్యం : (ఈరోజు తెల్లవారుజాము 2 గం॥ 27 ని॥ నుంచి ఈరోజు తెల్లవారుజాము 4 గం॥ 3 ని॥ వరకు)(ఈరోజు సాయంత్రం 4 గం॥ 6 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 5 గం॥ 41 ని॥ వరకు)
అమ్రుతఘడియలు : (ఈరోజు ఉదయం 7 గం॥ 18 ని॥ నుంచి ఈరోజు ఉదయం 8 గం॥ 54 ని॥ వరకు)
దుర్ముహూర్తం : (ఈరోజు ఉదయం 11 గం॥ 52 ని॥ నుంచి ఈరోజు ఉదయం 12 గం॥ 41 ని॥ వరకు)
రాహుకాలం : (ఈరోజు ఉదయం 12 గం॥ 17 ని॥ నుంచి ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 50 ని॥ వరకు)
గుళికకాలం : (ఈరోజు ఉదయం 10 గం॥ 43 ని॥ నుంచి ఈరోజు ఉదయం 12 గం॥ 16 ని॥ వరకు)
యమగండం : (ఈరోజు ఉదయం 7 గం॥ 37 ని॥ నుంచి ఈరోజు ఉదయం 9 గం॥ 10 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 6 గం॥ 4 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6 గం॥ 30 ని॥ లకు
సూర్యరాశి : మీనము
చంద్రరాశి : వృషభము