Editorials

తిరువూరులో ఓటర్లకు ప్రజాస్వామ్యబద్దంగా డబ్బు-మద్యం పంపిణి

shameless politicians of tiruvuru

కృష్ణాజిల్లా తిరువూరు నియోజకవర్గంలో రాష్ట్రంలోని మిగిలిన నియోజకవర్గాల కన్నా పరిస్థితులు పూర్తీ భిన్నంగా ఉన్నాయి. అన్ని చోట్లా వైకాపా తెదేపా వర్గాలు కొట్టుకు చస్తూ ఉంటే తిరువూరులో మాత్రం ఇరు పార్టీల వారు ప్రజాస్వామ్యబద్దంగా ఓటర్లకు డబ్బు, మద్యం పంపకాలు చేశారు. ఇరు వర్గాల నాయకులు కూర్చొని ముందే మాట్లాడుకున్నారు. ఓటుకు వెయ్యి రూపాయల లెక్క మీవాళ్ళకు మీరు, మా వాళ్లకు మేము పంచుకుందామని అల్లర్లు, గొడవలు వద్దని ఇరు పార్టీల నాయకులూ ముందుగానే ఒక అవగాహనకు వచ్చారు. వెంటనే గంటల వ్యవధిలోనే నియోజకవర్గం అంతా బుధవారం సాయంత్రం 6.30గంటలకల్లా 80శాతం పైగా కొనదల్చుకున్న ఓటర్లకు డబ్బులు, మద్యం అందజేసినట్లు సమాచారం. ఎన్నికలకు ముందు రోజు తిరువూరు నియోజకవర్గంలో పరిస్థితులు చాలా ప్రశాంతంగా ఉన్నాయి. ఇటువంటి పరిస్థితులు గతంలో జరిగిన ఎన్నికల్లో ఎప్పుడూ కనిపించలేదు. మొత్తం మీద ఇరు పార్టీలు సమానంగానే పంపిణీ చేసినట్లు సమాచారం. తెలుగుదేశానికి అనుకూలంగా ఉన్న గ్రామాల్లో పంపకాలు కాస్త ఆలస్యం అవుతున్నట్లు సమాచారం. మొత్తం మీద తిరువూరు నియోజకవర్గంలో పరిస్థితులు గమనిస్తూ ఉంటె పోలింగ్ 80శాతం దాటే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అధికార యంత్రాంగం ఎన్నికల ఏర్పాట్లు పూర్తీ చేసింది. బుధవారం సాయంత్రం ఆరున్నర గంటల సమయానికి అన్ని గ్రామాలకు పోలింగ్ సిబ్బందిని, సామాగ్రీని స్థానిక గర్ల్స్ హై స్కూల్ నుంచి తరలించి వేశారు. తిరువూరు నియోజకావర్గంలో పురుష ఓటర్లు కన్నా మహిళా ఓటర్లే కొద్ది సంఖ్యలో అధికంగా ఉన్నారు. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు ప్రస్తుత ఎమ్మెల్యే వైకాపా అభ్యర్ధి రక్షణనిధికి ఉన్న మంచి పేరు మూలంగా తాము మళ్ళీ విజయం సాధిస్తామని వైకాపా వర్గాలు భావిస్తూ ఉండగా ముఖ్యమంత్రి చంద్రబాబు పధకాలకు ప్రజలు బాగా ఆకర్షితులు అయ్యారని తెదేపా అభ్యర్ధి జవహర్ విజయం సాధిస్తారని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. పోలింగ్ శాతాన్ని బట్టి కూడా ఫలితాలు ఉంటాయి. గడిచిన మూడు ఎన్నికల్లో తిరువూరులో తెలుగుదేశం పరాజయం పాలైంది. ఈసారి వచ్చే ఫలితం పై రాజకీయ పరిశీలకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. –కిలారు ముద్దుకృష్ణ సీనియర్ జర్నలిస్టు.