Movies

ఛీ…ఛీ

alia kangana feud

ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచే బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ మరోసారి తన కామెంట్లతో చర్చనీయాంశంగా మారారు. నటి ఆలియా భట్‌ నటనను ఉద్దేశిస్తూ ఆమె ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఓ మీడియా సంస్థ నిర్వహించిన పోల్‌లో ఉత్తమ నటిగా కంగనా రనౌత్‌ (మణికర్ణిక సినిమాలో నటించినందుకు గానూ..)కే నెటిజన్లు ఓటు వేశారు. ఆప్షన్‌లో కంగనతో పాటు ఆలియా పేరు కూడా చేర్చారు. కానీ నెటిజన్లకు కంగన నటనే నచ్చింది. దీని గురించి సదరు మీడియా సంస్థ కంగనను స్పందించాల్సిందిగా కోరగా.. ‘మీరు ఆలియాతో నన్ను పోలుస్తున్నందుకు నాకు ఇబ్బందికరంగా ఉంది. అయినా ‘గల్లీ బాయ్‌’ సినిమాలో ఏముందని ఆలియా నాతో పాటు ఉత్తమ నటిగా పోటీపడుతుంది? నోరు పడిపోయినట్లుగా నటించిన ఆమెను నెటిజన్లు ఎందుకు ఎన్నుకుంటారు? ఛీ.. దయచేసి ఆమెతో నన్ను పోల్చకండి ప్లీజ్‌. ఇప్పటికే మీడియా స్టార్‌ కిడ్స్‌ను ఎక్కడికో తీసుకెళ్లిపోయింది. సాదాసీదాగా నటించేవారిని పొగడటం ఆపండి. లేకపోతే ఇతరుల్లో ఉన్న టాలెంట్‌ ఎప్పటికీ బయటికి రాదు’ అని పేర్కొన్నారు. ఇప్పటివరకు కంగన.. ఆలియాపై ఇంతటి ఘాటు వ్యాఖ్యలు ఎప్పుడూ చేయలేదు. గతంలోనూ జాతీయ అంశాలపై స్పందించనందుకు గానూ ఆలియాపై కంగన ఫైర్‌ అయ్యారు. మరి ఇప్పుడు ఈ విషయం గురించి ఆలియా ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.