WorldWonders

ఇన్ఫెక్షన్ అనుకుని ఆసుపత్రికి వెళ్తే…కంట్లో నాలుగు కందిరీగలు

Doctors Find 4 Bees in Taiwan Woman's Eyes

కంట్లో నలుసు పడితేనే విలవిల్లాడిపోతుంటాం. అలాంటిది కంట్లో నాలుగు తేనెటీగలు ఏకంగా కాపురం పెడితే.. వినడానికే ఒళ్లు జలదరిస్తున్నది కదూ. తైవాన్‌కు చెందిన ఓ మహిళ కన్ను విపరీతంగా వాచిపోయి నీరుకారుతుండటంతో దవాఖానకు వెళ్లగా.. అక్కడ పరీక్షలు చేసిన వైద్యులు కంట్లో తేనెటీగల్ని చూసి అవాక్కయ్యారు. ఆమె కంట్లో నాలుగు తేనెటీగలు సజీవంగా ఉండటమే కాకుండా.. కన్నీరును ఆహారంగా తీసుకొని జీవిస్తున్నట్టు వైద్యులు గుర్తించారు. వెంటనే శస్త్రచికిత్స నిర్వహించి నాలుగు తేనెటీగలను విజయవంతం గా బయటకు తీశారు. నలుసు కంట్లో పడటం సహజమే కానీ, కంట్లోకి కీటకాలు వెళ్లడం, అవి సజీవంగా ఉండటం వైద్య చరిత్రలో తొలిసారి అని తైవాన్ ఫూయిన్ యూనివర్సిటీ ఆప్తల్మాలజీ విభాగం అధిపతి డాక్టర్ హంగ్ చీ టింగ్ పేర్కొన్నారు. బాధిత మహిళ తన బంధువుల సమాధి వద్ద కలుపుమొక్కలు ఏరివేస్తుండగా ఆమెకు తెలియకుండానే తేనెటీగలు ఎడమ కంటిలోకి వెళ్లాయి. కంట్లో ధూళి పడినట్టుగా భావించిన సదరు మహిళ నీటితో కంటిని శుభ్రం చేసుకొంది. అంతేగానీ కంటిలోకి తేనెటీగలు పోయినట్టుగా భావించలేదు. మరుసటిరోజు కన్ను వాచివుండి నీరు కారడాన్ని గమనించి వైద్యులను సంప్రదించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.