EditorialsPolitics

పంపకాల ఫలితం…తిరువూరులో భారీగా పోలింగ్-TNI ప్రత్యేకం

tiruvuru 2019 election settlement between ysrcp and tdp worked great

గత యాభై సంవత్సరాల నుండి షెడ్యుల్ కులాలకు రిజర్వు చేయబడ్డ కృష్ణాజిల్లా తిరువూరు నియోజకవర్గంలో పోలింగ్ భారీగా జరిగింది. గత ఎన్నికల్లో ఎన్నడూ లేని విధంగా వైకాపా, తెదేపా అభ్యర్ధులు ఈసారి విచ్చలవిడిగా డబ్బు, మద్యం పంపిణీ చేయడంతో పోలింగ్ శాతం గతం కంటే భారీగా పెరిగింది. రెండు పార్టీల వారు అమ్ముడుపోయే ఒక్కొక్క ఓటరుకు వెయ్యి రూపాయల లెక్కన బాహాటంగా పంపిణీ చేశారు. పంపకాల విషయంలో ఈ పర్యాయం వైకాపా చాలా ముందంజలో ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తెలుగుదేశం పార్టీ తరపున కొన్ని గ్రామాల్లో చివరి నిముషంలో గురువారం ఉదయం ఓటుకు ₹500 లెక్కన మాత్రమే పంచినట్లు సమాచారం. కొంత మంది తెలుగుదేశం చోటా నాయకులు ఓటర్లకు పంచకుండా సొమ్ములు దాచుకున్నట్లు ఆ పార్టీ వర్గాలే చెబుతున్నాయి. పోలింగ్ సరళిని బట్టి వైకాపా, తెదేపా నాయకులు తిరువూరులో తామే గెలుస్తామని ఎవరికివారే ధీమాతో ఉన్నారు. వైకాపా నేతలు మాత్రం ఆ పార్టీ అభ్యర్ధి రక్షణనిధితో సహా రెండో సారి తిరువూరులో తాము 10వేలకు పైగా మెజార్టీతో విజయం సాధిస్తున్నామని బహిరంగంగా సంబరాలు చేస్తుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసిన ఎక్సైజ్ శాఖా మంత్రి కే.ఎస్.జవహర్ కూడా ఈసారి గెలుపు తనదేనని ధీమాతో ఉన్నారు. తిరువూరు నియోజకవర్గంలో కొన్ని గ్రామాల్లో పోలింగ్ 90శాతం దాటింది. సగటున 80శాతం పోలింగ్ జరిగి ఉంటుందని భావిస్తున్నారు. శుక్రవారం ఉదయానికి కాని ఖచ్చితమైన పోలింగ్ శాతం వెల్లడవుతోంది. కొన్ని గ్రామాల్లో రాత్రి ఏడు గంటల అవ్రకు పోలింగ్ జరుగుతూనే ఉంది. ఈవీఎంలు మొరాయించిన చోట ఓటర్లు పెద్ద సంఖ్యలో క్యూలైన్లలో ఓటు వేయడానికి వేచి ఉన్నారు. వైకాపా, తెదేపా నాయకులు డబ్బుల పంపిణీలో ఒకరికి ఒకరు సామరస్య ధోరణితో వ్యవహరించడంతో తిరువూరు నియోజకవర్గంలో జరిగిన పోలింగ్ చాలా ప్రశాంతంగా ముగిసింది. స్వల్ప ఘర్షణలు తప్ప ఏవిధమైన వివాదాలు జరగలేదు. ఫలితం కోసం 42 రోజులు వేచి ఉండాల్సి వస్తోందని అప్పటి వరకు తమకు రక్తపోటు, షుగర్ వ్యాధులు అదుపులో ఉండేటట్లు కనిపించడం లేదని టెన్షన్‌తో చచ్చిపోతామని రాజకీయ పార్టీల నాయకులూ, కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. పందేలు కాసే వారు అంచనాల కోసం ఆరాలు తీస్తున్నారు. తిరువూరుకు సమీపంలో ఉన్న మునుకుళ్ళ గ్రామంలో వైకాపా తరపున కోటి రూపాయలకు పైగా పందేలు వేయడానికి సిండికేట్‌గా ఏర్పడినట్లు సమాచారం. ఏదీ ఏమైనప్పటికీ గ్రామాల వారిగా పడిన ఓటర్ల శాతం ఖచ్చితంగా తెలిస్తేనే గాని విజయం ఎవరిదనేది చెప్పగలమని పరిశీలకులు అంటున్నారు. —కిలారు ముద్దుకృష్ణ సీనియర్ జర్నలిస్ట్