Business

ముసద్దిలాల్ మాడు పగలగొట్టిన ఈడీ

ed attack on musaddilal jewellers

రద్దైన పెద్ద నోట్లను అక్రమంగా మార్పిడి చేశారన్న ఆరోపణలపై ముసద్దీలాల్‌ జ్యువెల్లరీ దుకాణాల్లో ఈడీ సోదాలు జరిపింది. హైదరాబాద్‌, విజయవాడలో ఏకకాలంలో జరిపిన ఈ సోదాల్లో సుమారు రూ. 82 కోట్ల విలువైన 145.89 కిలోల బంగారాన్ని జప్తు చేసింది. పెద్ద నోట్ల రద్దు సమయంలో దొడ్డిదారిన నోట్ల మార్పడికి పాల్పడ్డారనే అభియోగంపై ముసద్దీలాల్‌ దుకాణాలతో పాటు యజమాని కైలాస్‌ గుప్తా తదితరుల నివాసాల్లో అధికారులు సోదాలు జరిపారు. పెద్ద నోట్లు రద్దుకాగానే ఒక్కసారిగా భారీ విక్రయాలు జరిపినట్టు మసద్దీలాల్‌ యజమానులు రికార్డుల్లో చూపించారు. బ్యాంకు ఖాతాలతో పాటు వారికి సంబంధించిన మరికొన్ని ఖాతాల్లో కొన్ని గంటల వ్యవధిలోనే సుమారు రూ.100 కోట్లకు పైగా డిపాజిట్‌ అయ్యాయి. దీంతో అనుమానం వచ్చిన ఐటీ అధికారులు అప్పట్లోనే కార్యాలయాలపై సోదాలు జరిపి రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. రాత్రికి రాత్రే 5200 మంది నుంచి 110 కోట్ల రూపాయల విలువైన 2వేల నోట్లను స్వీకరించి.. తమ ఖాతాల్లోకి మళ్లించినట్లు ఐటీ శాఖ గుర్తించింది. సీసీ కెమెరాల దృశ్యాల ప్రకారం ఆ సమయంలో దుకాణాల్లో ఎలాంటి విక్రయాలు జరగలేదని తేల్చింది. వాటిలో 80 కోట్ల రూపాయలను అష్టలక్ష్మి గోల్డ్, శ్రీబాలాజీ గోల్డ్ తదితర బంగారం డీలర్లకు మళ్లించినట్లు దర్యాప్తులో బయటపడింది. దీంతో మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద దర్యాప్తు చేపట్టిన ఈడీ అధికారులు హైదరాబాద్, విజయవాడలోని ముసద్దీలాల్ జ్యువెల్లరీస్ దుకాణాలు, యజమాని కైలాష్ గుప్తా ఇళ్లు, శ్రీబాలాజీ గోల్డ్ భాగస్వామి పవన్ అగర్వాల్, అష్టలక్ష్మి గోల్డ్ యజమాని నీల్ సుందర్ థారడ్, చార్టెడ్ అకౌంటెంట్ సంజయ్ సర్దా కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు.