Kids

కుక్కపిల్లలను దొంగతనం చేయకూడదు

telugu kids story on dogs and stealing

ఎనిమిదేళ్ల నందు మూడో తరగతి చదువుతున్నాడు. బడి ఇంటికి దగ్గరే. ఓ రోజు నడుచుకుంటూ వస్తుంటే ఓ చెట్టు కింద నాలుగు బుజ్జి కుక్కపిల్లలు కనిపించాయి. ముద్దు ముద్దుగా ఉన్న వాటిని చూసేసరికి ఓ కుక్క పిల్లని ఇంటికి తీసుకువెళ్లాలనుకున్నాడు నందు. అప్పుడు ఆ కుక్క పిల్లల తల్లి లేదు. ఇదే సమయమని ఓ కుక్క పిల్లను తీసుకుని ఇంటికి వచ్చాడు.
తన పుస్తకాల దగ్గరున్న ఖాళీ అరలో పడుకోబెట్టాడు. కుయ్‌ కుయ్‌మంటూ అక్కడక్కడే తిరుగుతున్న కుక్క పిల్లను చూస్తూ ఆనందపడ్డాడు. బడి నుంచి వచ్చి చాలాసేపయినా నందు నిశ్శబ్దంగా ఉండటం గమనించిన అమ్మ వాడేం చేస్తున్నాడో చూద్దామని గదిలోకి వచ్చింది. కుక్క పిల్లతో ఉన్న నందుని చూసి ‘దీన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చావు? అని అడిగింది.
‘వస్తుంటే దార్లో కనిపిస్తే తీసుకువచ్చానమ్మా’ చెప్పాడు నందు.
‘తప్పు కదా! తన పిల్ల కనిపించక ఆ తల్లి ఎంత బాధపడుతుందో కదా! ఎందుకు తీసుకువచ్చావు?’ అని కోప్పడింది అమ్మ.
‘ఏం కాదులే. వాళ్లమ్మకి ఇంకా మూడు పిల్లలు ఉన్నాయి’ తేలిగ్గా చెప్పాడు నందు. వాళ్లమ్మ ఏం మాట్లాడకుండా వెళ్లిపోయింది.
కాసేపటికి ‘అమ్మా! కుక్కపిల్లకి ఆకలేస్తున్నట్లుంది కొంచెం పాలు ఇవ్వవా?’ అని అడిగాడు నెమ్మదిగా.
వాళ్లమ్మ చిరాగ్గా… ‘నువ్వు దాన్ని తీసుకు రాకపోతే అది వాళ్లమ్మ దగ్గర తాగి ఉండేది కదా పాలు’ అంటూనే చిన్న పళ్లెంలో పాలు పోసి నందు చేతికి ఇచ్చింది. ఆ పళ్లెం పట్టుకుని కుక్కపిల్ల ముందు ఉంచాడు నందు.
కుక్కపిల్ల నెమ్మదిగా పాలు తాగేసింది. నిద్రపోయింది.
‘పాపం ఆ కుక్క పిల్ల వాళ్లమ్మ కనిపించక ఎంత బాధపడుతుందో! దాన్ని తీసుకువెళ్లి ఎక్కడ నుంచి తెచ్చావో అక్కడే ఉంచేసిరా’ అంది అమ్మ.
‘అబ్బ! ఇది నాది. దీన్ని నేను పెంచుకుంటున్నా.’ అన్నాడు నందు.
రెండు రోజుల తర్వాత అమ్మ ‘నందూ! నీ సరదా తీరింది కదా! ఇక దీన్ని విడిచి పెట్టేసిరా. ఇది కూడా వాళ్లమ్మ మీద బెంగ పెట్టుకున్నట్టుంది’ అంది.
కానీ ససేమిరా అన్నాడు.
మర్నాడు నందు బడి నుంచి ఇంటికి తిరిగి వచ్చేసరికి వాళ్లమ్మ ఇంట్లో లేదు. ఊర్నించి వాళ్ల అమ్మమ్మ వచ్చి ఉంది.
‘అమ్మేది?’ అడిగాడు నందు అమ్మమ్మని.
‘ఊరెళ్లింది. పది రోజుల్లో వచ్చేస్తుందిలే’ చెప్పింది అమ్మమ్మ.
‘పది రోజులా!? ఈ పది రోజులూ నన్నెవరు చూస్తారు’ అడిగాడు నందు కోపంగా. ‘నేనున్నాగా’ అంది అమ్మమ్మ నవ్వుతూ.
‘నాకు అమ్మే కావాలి’ ఏడుపు లంకించుకున్నాడు నందు.
అలాగే అమ్మ లేకుండా రెండు రోజులు గడిచాయి.
నందు సరిగ్గా అన్నం తినలేకపోతున్నాడు. బడికి శ్రద్ధగా వెళ్లలేకపోతున్నాడు. చదువు మీద దృష్టి పెట్టలేకపోతున్నాడు.
అమ్మ మీద బెంగ పెట్టుకుని దిగులుగా గడుపుతున్నాడు. కానీ కుక్కపిల్లను మాత్రం జాగ్రత్తగానే చూసుకుంటున్నాడు.
మరో రెండు రోజుల తర్వాత నందు బడి నుంచి ఇంటికి తిరిగి వచ్చే సరికి అమ్మ ఇంటికి వచ్చేసి ఉంది. అమ్మని చూడగానే ప్రాణం లేచి వచ్చినట్లయ్యింది నందుకి.
‘ఎందుకమ్మా నన్నొదిలి వెళ్లిపోయావు? నువ్వు లేకపోతే నేనెంత బెంగ పెట్టుకున్నానో తెలుసా?’ అన్నాడు నందు అమ్మని పట్టుకుని ఏడుస్తూ.
నందు తల మీద చెయ్యివేసి సముదాయిస్తూ ‘ఏ పిల్లలయినా తల్లి దగ్గర లేకుండా ఉండలేరని ఇప్పటికైనా గ్రహించావా? నీకు నోరుంది కాబట్టి నీ బాధ చెప్పుకోగలిగావు. పాపం ఆ కుక్క పిల్లకి నోరు లేదు కదా! ఎలా చెబుతుంది అది అమ్మ కావాలని?’ అంది అమ్మ అనునయంగా.
నందుకి ఇప్పుడు తెలిసి వచ్చింది. అమ్మ దగ్గర లేకుండా ఎవరూ ఉండలేరని. వెంటనే ఆ కుక్క పిల్లని జాగ్రత్తగా తీసుకువెళ్లి మిగతా కుక్క పిల్లల దగ్గర వదిలి వచ్చాడు. ఇప్పుడు వాడి మనసు ఎంతో శాంతంగా ఉంది.