NRI-NRT

శ్రీలంకలో భారీ పేలుళ్లు. అనంతపురం వాసులకు గాయాలు.

srilankan bombings 2019 gallery ananthapuram telugu guy in victims

పవిత్ర ఈస్టర్‌ రోజున వరుస బాంబు దాడులతో శ్రీలంక దద్ధరిల్లింది. ఈస్టర్‌ ప్రార్థనలు జరుగుతున్న సమయంలో చర్చిలే లక్ష్యంగా ముష్కర మూకలు రెచ్చిపోయి మారణహోమం సృష్టించాయి. మూడు చర్చిలు, పలు హోటళ్లు సహా మొత్తం ఎనిమిది ప్రాంతాల్లో జరిగిన దాడుల్లో మృతుల క్రమంగా పెరుగుతోంది. ఇప్పటివరకు సుమారు 207 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్టు సమాచారం. ఈ పేలుళ్ల ధాటికి మృతదేహాలన్నీ చెల్లాచెదురుగా పడ్డాయి. దీంతో శ్రీలంకలో భయానక వాతావరణం ఏర్పడింది. బాంబు దాడుల్లో వందలాది మంది గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం హుటాహుటిన కొలంబోలోని ఆస్పత్రులకు తరలించారు. ఈ పేలుళ్లలో 35 మంది విదేశీయులు ఉన్నట్టు గుర్తించారు. శ్రీలంక కాలమానం ప్రకారం ఉదయం 8.45గంటల సమయంలో మూడు చర్చిలపై దాడులకు తెగబడ్డారు. అలాగే ఫైవ్‌స్టార్‌ హోటళ్లే లక్ష్యంగా బాంబు దాడులు చేశారు. తొలుత ఆరు ప్రాంతాల్లో బాంబు దాడులు జరగ్గా.. మధ్యాహ్నం తర్వాత కొలంబో దెహివెలాలోని హోటల్‌లో ఏడో బాంబు పేలగా.. హౌసింగ్‌ కాంప్లెక్స్‌లో ఎనిమిదో బాంబును పేల్చారు. కొలంబోలో జరిగిన ఎనిమిదో పేలుడు ఆత్మాహుతి దాడిగా అధికారులు నిర్థారించారు. ఎనిమిదో పేలుడులో ముగ్గురు పోలీసులు మృత్యువాతపడ్డారు. ఈ ప్రమాదం నుంచి తమిళ నటి రాధికా శరత్‌కుమార్‌ తృటిలో తప్పించుకున్నారు. తాను క్షేమంగానే ఉన్నట్టు ట్విటర్‌లో ఆమె వెల్లడించారు. ఈ ఘటనతో సంబంధం ఉందనే అనుమానంతో పోలీసులు ఇప్పటివరకు ఏడుగురిని అరెస్టు చేశారు. పేలుళ్ల కారణంగా శ్రీలంకలో కర్ఫ్యూ విధించడంతో పాటు తాత్కాలికంగా సామాజిక మాధ్యమాలను అక్కడి ప్రభుత్వం నిషేధించింది. ఎస్‌ఆర్‌ కనస్ట్రక్షన్‌ అధినేత అమిలినేని సురేంద్ర బాబు నలుగురు స్నేహితులతో కలిసి కొలంబోకు విహార యాత్రకు వెళ్లారు. కొలంబోలోని షంగ్రీలా హోటల్‌లో అల్పాహారం తీసుకుంటున్న సమయంలో అక్కడ బాంబు పేలుడు జరిగింది. పరిస్థితి వివరించి ఎవరూ ఆందోళన చెందవద్దని మైక్‌ద్వారా అక్కడి సిబ్బంది చెప్పడంతో అంతా భయాందోళనలతో బయటకు పరుగులు తీశారు. ఈ సందర్భంగా జరిగిన తోపులాటలో హోటల్‌ అద్దం తగిలి సురేంద్ర బాబు ముక్కుకు స్వల్ప గాయమైంది. ఈ బృందం మూడు రోజుల క్రితమే కొలంబోకు వెళ్లింది. ఈ ఘటనపై అనంతపురం జిల్లా ఎస్పీ అశోక్‌ కుమార్‌ స్పందించారు. ప్రస్తుతం శ్రీలంకలోని సెల్‌ టవర్లు పనిచేయకపోవడంతో వారిని సంప్రదించే వీలు కలగడంలేదని చెప్పారు. వీళ్లంతా ప్రస్తుతం సురక్షిత ప్రాంతంలోనే ఉన్నట్టు సమాచారం. అయితే, వారికి సంబంధించిన పాస్‌పోర్టులు, ఇతర పత్రాలన్నీ హోటల్‌లోనే ఉండిపోయాయి.