Editorials

దయచేసి ఆ సెల్‌ఫోన్ ఆపేయండి!

this is how mobile phones are ruining emotions in india

ప్రతి నగరంలో ప్రస్తుతం ఓ నిశ్శబ్ద విప్లవం నడుస్తోంది. తలదించుకుని బతకడాన్ని.. నగరవాసులు ఓ విప్లవంలా కొనసాగిస్తున్నారు. హోటళ్లు, పార్కులు, సినిమా థియేటర్లు, ఫుట్‌పాత్‌లు, రైళ్లు, బస్సులు.. ఎక్కడైనా చూడండి.. అంతా తలదించుకునే బతుకుతున్నారు. కనీసం పక్కనున్న వారినైనా చూసేందుకు.. పొరపాటున కూడా తలెత్తడం లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే.. సమూహంలో ఉంటూ ఏకాంతంగా గడుపుతున్నారు. చివరికి కుటుంబంతో కలిసి హోటల్‌కు తినడానికి వెళ్లినప్పుడు కూడా.. ఎవరి ప్రపంచం వారిదే. టేబుల్‌కు చుట్టూ నలుగురు కూర్చుని.. చేతిలో ఉన్న స్మార్ట్‌ ఫోన్‌తో ఎవరికి వారు ఒంటరిగా గడుపుతున్నారు. విజయవాడ, గుంటూరు నగరాల్లో గత ఐదేళ్లలో ఈ తలదించుకుని బతికే విప్లవం మరింత ఉద్ధృతంగా మారిపోయింది. ఎక్కడికెళ్లినా ఉచిత వైఫై, అతి తక్కువ ధరకే.. అంతర్జాలం డేటా అందుబాటులోనికి రావడంతో.. ఇంక బయట ప్రపంచంతో బంధాలను పూర్తిగా తెంచేసుకున్న వారి సంఖ్య 90 శాతం దాటిపోయి.. ప్రమాదం అంచుకు చేరుకుంది. ఎదురుగా కనిపించే ప్రపంచాన్ని ఎవరూ చూడడం లేదు. అసలు.. కళ్లెదుట కనిపించే ప్రపంచాన్ని చూడాలనే ధైర్యం కూడా చేయడం లేదు. కనిపించని.. మాయా ప్రపంచంలో గడిపేందుకే అత్యధిక శాతం మంది ఆసక్తి చూపుతున్నారు. ఎదురుగా ఉన్న వాళ్లతో మాట్లాడాలన్నా.. అతని ఫేస్‌బుక్‌, వాట్సాప్‌ ద్వారా సందేశాలు పంపుకుంటూ.. గడపడానికే అత్యధికులు ఆసక్తి చూపుతున్నారు. గతంలో రైలు, బస్సు ప్రయాణమంటే.. ఎదురుగా, పక్కన కూర్చున్న వాళ్లతో మాట్లాడుతూ.. వెళ్లే వాళ్లు. ప్రస్తుతం కుటుంబాలతో కలిసి ప్రయాణం చేస్తున్నా.. కనీసం ఒక్క ముక్క మాట్లాడుకునే పరిస్థితి లేదు. ఎవరి ఫోన్‌ వాళ్లు తీసి.. చెవిలో ఇయర్‌ఫోన్లను పెట్టుకుని.. ఒంటరి ప్రపంచంలోనికి వెళ్లిపోతున్నారు. స్మార్ట్‌ ఫోన్‌ వచ్చాక.. సమయం, ఆరోగ్యం పూర్తిగా ఆవిరైపోతున్నాయన్నది ఇప్పటివరకూ తెలిసిందే. కానీ.. ఇప్పుడు తాజాగా సరదాలు, సంతోషాలను కూడా ఆవిరి చేస్తోంది. ఎవరైనా కుటుంబాలతో కలిసి విహార యాత్రలు, ప్రయాణాలు, హోటళ్లు, సినిమా థియేటర్లకు ఎందుకు వెళతారు? ఆనందంగా గడిపి రావాలని, తమ వారితో సరదాలు పంచుకోవాలని, కానీ.. ఇప్పుడు ఆ సరదాలు కాస్త.. చాలా చిరాకు తెప్పించేవిగా మారిపోయాయి. కేవలం ఎవరికి వారు ఏదో తిని రావడానికి కుటుంబాలతో హోటల్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు. మాట్లాడుకుంటూ, నవ్వుకుంటూ.. ఫుడ్‌ను ఎంజాయ్‌ చేయాలనే ఉద్దేశంతోనే వెళుతుంటారు. ప్రస్తుతం నగరంలోని.. ఏ హోటల్‌కైనా వెళ్లి చూడండి.. లేదంటే సినిమా థియేటర్‌కు వెళ్లండి.. ఖచ్చితంగా పది మందిలో ఏడెనిమిది మంది సెల్‌ఫోన్‌ చూస్తూ నిశ్శబ్దంగా గడుపుతూ కనిపిస్తారు. అందుకే.. తిన్నా, నడుస్తున్నా, సినిమా చూస్తున్నా.. ఎవరిలోనూ ఆనందమనేది కనిపించడం లేదు. ఏదో తెలియని ఒత్తిడి.. క్షణ క్షణానికి ఫోన్‌ వైపు చూసుకోవడానికే సరిపోతోంది. సినిమాకు వెళితే.. ప్రారంభానికి పది నిమిషాల సమయం ఉన్నా ఖచ్చితంగా ఎవరి ఫోన్‌ను వారు పట్టుకుని.. ఏదో వెతుకుతూ కనిపిస్తున్నారు. మధ్యలో వచ్చే ఇంటర్‌వెల్‌, సినిమా తర్వాత బయటకు వచ్చేటప్పుడు, పార్కింగ్‌ దగ్గర.. ఎక్కడ చూసినా.. తలదించుకుని గడిపేవాళ్లే కనిపిస్తున్నారు. ఒక్క నిమిషం ఖాళీ సమయం దొరికితే.. సరదాగా నాలుగు కబుర్లు చెబుదాం, బయట ప్రపంచాన్ని గమనిద్దాం.. అనే ఆలోచనే రావడం లేదు. అంత ఓపిక, సహనం ఇప్పుడు కనిపించడం లేదు. ఒక్క నిమిషం వేచి ఉండాలంటే.. ఎలా గడపాలా.. అనే ఆందోళన అందరిలోనూ వచ్చేసింది. అందుకే.. వెంటనే ఫోన్‌ను తీసి.. దానిలో మునిగి తేలుతున్నారు. ప్రస్తుతం నిత్య జీవితంలో ఒత్తిడి విపరీతంగా పెరిగిపోవడానికి.. ఈ నిశ్శబ్ద విప్లవం కూడా ఓ కారణమని మానసిక వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. ఒత్తిడి నుంచి ఉపశమనం కోసం పర్యాటక ప్రదేశాలకు వెళుతూ.. అక్కడ కూడా ఎవరి ఫోన్‌ వాళ్లు పట్టుకుని గడుపుతున్నారు. స్నేహితులు సైతం నలుగురైదుగురు కలిసి హోటల్‌కు, సినిమాకు, పర్యాటక ప్రదేశాలకు వెళుతూ.. అక్కడ ఎవరికి వారు.. ఒంటరిగా గడుపుతున్నారు. ఇలా ఒంటరిగా గడిపేందుకు అంతా కలిసి వెళ్లడం.. ఎందుకనేది ప్రతిఒక్కరూ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని ప్రముఖ మానసిక నిపుణులు డాక్టర్‌ టి.ఎస్‌.రావు సూచించారు. ఎప్పుడు చూసినా.. తలదించుకుని.. ఉండడమే అతిపెద్ద మానసిక రోగమనే విషయం గుర్తించాలన్నారు. రోడ్డు దాటేటప్పుడు కూడా చాలామంది యువత.. ఫోన్‌ చూస్తూ వెళ్లడం వల్ల ప్రాణాలకే ప్రమాదం వాటిల్లుతోందని, అయినా.. ఇది వేలం వెర్రిగా.. పెరుగుతూ వెళుతోందే తప్ప తగ్గడం లేదన్నారు. ప్రస్తుతం మందు, సిగరెట్‌ కంటే.. ఇది పెద్ద వ్యసనంగా ఇది మారిపోయిందని, దీని నుంచి ఎంత త్వరగా బయటకొస్తే.. అంతమంచిదని మానసిక వైద్య నిపుణులు సూచిస్తున్నారు. తలెత్తుకుని బతికేందుకు ప్రయత్నం చేస్తే.. ఆరోగ్యం, ఆనందం రెండూ సొంతమవుతాయని చెబుతున్నారు.