వారణాసి నుంచి లోక్‌సభకు పోటీ చేస్తున్న ప్రధాని నరేంద్రమోదీ నేటి మధ్యాహ్నం నామినేషన్ దాఖలు చేశారు. బీజేపీ చీఫ్ అమిత్ షా, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, శివసేన చీఫ్ ఉద్ధవ్ థాకరే సహా ఎన్డీయే నేతలు, కేంద్రమంత్రులు వెంట రాగా కలెక్టరేట్‌లో మోదీ నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా సమర్పించిన అఫిడవిట్‌లో మోదీ తన మొత్తం ఆస్తుల విలువను రూ.2.51 కోట్లుగా పేర్కొన్నారు. ఇందులో చరాస్తి రూ.1,41,36,119 కాగా, స్థిరాస్తి విలువను రూ.1.10 కోట్లుగా చూపించారు. 2014లో మోదీ తన చరాస్తి విలువను రూ.65,91,582 గా పేర్కొనగా ఈ ఐదేళ్లలో అవి ఏకంగా 114.15 శాతం పెరిగాయి. మోదీ తన ప్రధాన ఆదాయ వనరుగా తన వేతనాన్ని, సేవింగ్స్‌పై వస్తున్న వడ్డీని చూపించారు. ఇక, తనపై ఎటువంటి క్రిమినల్ కేసులు లేవని అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఈ ఏడాది మార్చి 31 నాటికి తన చేతిలో రూ.38,750 ఉందని తెలిపారు. తన బ్యాంకు బ్యాలెన్స్‌ను రూ.4,143గా పేర్కొన్న మోదీ….రూ.1,27,81,574 (రూ.1.27 కోట్లు) భారతీయ స్టేట్ బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్ రూపేణా ఉందని వివరించారు. 2014లో మోదీ చేతిలో రూ.32,700 నగదు ఉండగా, బ్యాంకు బ్యాలెన్స్ రూ.26.05 లక్షలు, ఫిక్స్‌డ్ డిపాజిట్ల విలువ రూ.32.48 లక్షలు. అలాగే, ఈ ఏడాది మార్చి 31 నాటికి రూ.1,13,800 విలువైన నాలుగు బంగారు ఉంగరాలు (45 గ్రాములు) ఉన్నట్టు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. 2014లో వీటి విలువ సుమారు రూ.1.35 లక్షలు. ఇక చదువు విషయానికొస్తే, మోదీ 1978లో ఢిల్లీ యూనివర్సిటీ నుంచి డిగ్రీ, 1983లో అహ్మదాబాద్‌లోని గుజరాత్ యూనివర్సిటీ నుంచి పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినట్టు పేర్కొన్నారు.
ఐదేళ్లలో ఏకంగా 114.15 శాతం పెరిగాయి
Related tags :