WorldWonders

పాకీలకు ఇక వీసాలు లేవు

usa stops issuing visas to pakistanis

పాకిస్థాన్‌పై అగ్ర రాజ్యం అమెరికా ఆంక్షలు విధించింది. అమెరికా నుంచి బహిష్కరణకు గురైన పాక్‌ జాతీయులు, వీసా గడువు ముగిసినా ఇంకా అమెరికాలో ఉంటున్న పాకిస్థానీయులను స్వదేశానికి రప్పించేందుకు పాక్‌ నిరాకరించడంతో అమెరికా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో పాకిస్థానీయులకు వీసాల మంజూరును అమెరికా నిలిపివేసే అవకాశం ఉందని అధికారవర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ‘పాక్‌తో దౌత్య సంబంధ విషయాల్లో ఎలాంటి మార్పు చేర్పులు ఉండవు. కానీ, ఆంక్షలు విధిస్తున్నట్లు ఫెడరల్‌ రిజిస్ట్రార్‌ ఏప్రిల్‌ 22న నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీని వల్ల పాకిస్థానీయులకు వీసాల మంజూరు ప్రక్రియను ప్రస్తుతానికి నిలిపివేయవచ్చు.’అని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.అమెరికా ఆంక్షలు విధించిన పది దేశాల జాబితాలోకి పాకిస్థాన్‌ కూడా చేరింది. అమెరికా న్యాయ నిబంధనల ప్రకారం ఆయా దేశాలు దేశబహిష్కృతులను, వీసా గడువు ముగిసిన వారిని వెనక్కి తీసుకెళ్లడానికి నిరాకరిస్తున్నాయి. ఇప్పటికే గయానా(2001), గాంబియా(2016), కంబోడియా, ఎరిట్రియా, గునియా, సియెర్రా లియోన్‌(2017), బర్మా, లావోస్‌(2018) దేశాలపై ట్రంప్‌ ప్రభుత్వ ఆంక్షలు కొనసాగుతుండగా, ఈ ఏడాది ఘనా, పాకిస్థాన్‌ వచ్చి చేరాయి. ‘ఆంక్షలు మినహా మిగిలిన అన్ని దౌత్య సంబంధ విషయాలు యథావిధిగా కొనసాగుతాయి. ఈ ద్వైపాక్షిక అంశాన్ని ఇరుదేశాల ప్రభుత్వాలు కూర్చొని చర్చిస్తాయి. అయితే, ఎప్పుడనే విషయాన్ని మాత్రం చెప్పలేం.’అని స్టేట్‌ డిపార్ట్‌మెంట్‌ ప్రతినిధి తెలిపారు. అమెరికా విధించిన తాజా ఆంక్షలపై యూఎస్‌లో పాకిస్థాన్‌ మాజీ అంబాసిడర్‌ హుస్సేన్‌ హక్కానీ స్పందించారు. తాజా చర్యతో అమెరికా వెళ్లాలనుకునే పాకిస్థానీయులకు ఇబ్బందులు తప్పవని అభిప్రాయపడ్డారు. ‘పాకిస్థాన్‌ నుంచి అమెరికా వెళ్లాలనుకునే వారికి ఇది శరాఘాతమే. దేశ బహిష్కృతుల విషయంలోఅమెరికా న్యాయ నిబంధలను పాకిస్థాన్‌ అధికార వర్గాలు గౌరవించక తప్పదు.’ అని ఆయన అన్నారు. దేశ బహిష్కృతులు, వీసా గడువు ముగిసిన వారిపై కఠిన చర్యలు తప్పవని ట్రంప్‌ ప్రభుత్వం అధికారంలో వచ్చిన రోజునే స్పష్టంగా చెప్పింది. ఇందులో భాగంగానే నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న దేశాలపై ఆంక్షలు విధిస్తోంది.