DailyDose

రూ.2000 కోట్లు పక్కనపెట్టిన ఎన్‌ఎస్‌ఈ-ప్రధాన వార్తలు-05/02

national stock exchange puts 2000 crores aside

1. ఉత్తరాంధ్రపై ఫొని పడగ
ఫొని పెను తుపాను గురు, శుక్రవారాల్లో ఉత్తరకోస్తాలోని విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు సమీపంగా ప్రయాణించనుంది. ఇది గురువారం విశాఖ తీరానికి సుమారు 130 నుంచి 140 కిలోమీటర్ల దూరంలో తీరానికి సమాంతరంగా ప్రయాణించవచ్చని అంచనా. విజయనగరం జిల్లాకు కాస్త దగ్గరగానూ.. శుక్రవారం శ్రీకాకుళం జిల్లాకు మరింత సమీపంగానూ.. అంటే కేవలం 40-50 కిలోమీటర్ల దూరం నుంచే ఒడిశావైపు ప్రయాణిస్తుందని వాతావరణశాఖ చెబుతోంది. ఈ ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాకు భారీ స్థాయిలో ముప్పు వాటిల్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.

2. నేడు భాజపా తెలంగాణ బంద్‌
ఇంటర్మీడియట్‌ ఫలితాల్లో చోటుచేసుకున్న అవకతవకలను నిరసిస్తూ భాజపా గురువారం తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చింది. బంద్‌కు మద్దతు తెలపాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఏప్రిల్‌ 29 నుంచి మొదలుపెట్టిన తన నిరవధిక దీక్షను విద్యార్థులకు న్యాయం జరిగేవరకు కొనసాగిస్తానని ఆయన స్పష్టం చేశారు.

3. ఏటిగడ్డ కిష్టాపూర్‌ను ఖాళీ చేయండి
సిద్దిపేట జిల్లా ఏటిగడ్డ కిష్టాపూర్‌లో ఒక్క అధికారి, పోలీసులు, యంత్రాలు, జేసీబీలు ఉండటానికి వీల్లేదు. వీరంతా అక్కడ ఉండటం గ్రామస్థుల శాంతియుత జీవనానికి భంగం కలిగించడమే అంటూ హైకోర్టు బుధవారం ఘాటుగా వ్యాఖ్యానించింది. మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌కు సంబంధించిన భారీ యంత్రాలు ఆ గ్రామంలో ఉన్నాయని, అధికారులు భూములను చదును చేస్తున్నట్లు ఆధారాలున్న నేపథ్యంలో తదుపరి విచారణ దాకా అక్కడ పరిస్థితిని తీవ్రం చేయరాదని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చింది.

4. ఇంటర్‌ పునఃపరిశీలన, ఫలితాలకు..మరో కంప్యూటర్‌ సంస్థ
ఇంటర్‌ జవాబుపత్రాల పునఃమూల్యాంకనం-పరిశీలనకు సంబంధించి, ఫలితాల ప్రక్రియ నిర్వహణ కోసం మరో స్వతంత్ర కంప్యూటర్‌ సంస్థ రంగంలోకి దిగనుంది. దీన్ని ప్రస్తుతం ఉన్న గ్లోబరీనా టెక్నాలజీస్‌ సంస్థతో పాటు వినియోగిస్తారు. ఫలితాల్లో తప్పుల నివారణకు గ్లోబరీనాకు సమాంతరంగా మరో సంస్థతోనూ ఫలితాల ప్రాసెసింగ్‌ చేయించాలని త్రిసభ్య కమిటీ సూచించడం తెలిసిందే. ఈ క్రమంలోనే మరో కంప్యూటర్‌ ఏజెన్సీ ఎంపిక బాధ్యతను రాష్ట్ర ఐటీ మంత్రిత్వ శాఖ పరిధిలోని తెలంగాణ రాష్ట్ర సాంకేతిక సేవలు (టీఎస్‌టీఎస్‌) విభాగానికి అప్పగించారు.

5. చంద్రయాన్‌-2కు చురుకుగా ఏర్పాట్లు
చంద్రుడిపైకి మూడు మాడ్యూళ్లను పంపించే చంద్రయాన్‌-2కు ఏర్పాట్లు చురుగ్గా కొనసాగుతున్నాయని ఇస్రో అధికారులు బుధవారం బెంగళూరులో ప్రకటించారు. ఆర్బిటర్‌, ల్యాండర్‌(విక్రం), రోవర్‌(ప్రజ్ఞాన్‌) పేరిట మూడు మాడ్యూళ్లను జి.ఎస్‌.ఎల్‌.వి. ఎం.కె-3 లాంచ్‌ వెహికల్‌తో ప్రయోగిస్తారు. చంద్రుడి ఉపరితలానికి చేరువలో ఆర్బిటర్‌, దక్షిణ ధ్రువంపై ల్యాండర్‌, ఉపరితలంపై ప్రయోగాలను నిర్వహించేందుకు అనువుగా రోవర్‌ను తయారుచేశారు. చంద్రయాన్‌-2 జులై 9 నుంచి 16 మధ్యలో ప్రయోగిస్తారు.

6. చట్టాలు కులాలకు అతీతంగా ఉండాలి: సుప్రీంకోర్టు
కులం విషయంలో చట్టాలు తటస్థంగా ఉండాలని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ‘చట్టాలు అందరికీ సమానంగా ఉండాలి. జనరల్‌ చట్టాలు…ఎస్సీ/ఎస్టీ కేటగిరీ చట్టాలు అంటూ ఉండవు’ అని బుధవారం జస్టిస్‌ అరుణ్‌ మిశ్ర, జస్టిస్‌ యు.యు.లలిత్‌లతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఎస్సీ/ఎస్టీ చట్టంలోని అంశాలను నీరుగార్చేలా గతంలో ఇచ్చిన తీర్పును సమీక్షించాలంటూ కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై తీర్పును వాయిదా వేసే సందర్భంలో ఈ వ్యాఖ్య చేసింది.

7. శ్రీలంకలో ఆ ఛానెల్‌ బంద్‌!
ఇస్లాం మత ప్రబోధకుడు జకీర్‌ నాయక్‌కు చెందిన పీస్‌ టీవీని శ్రీలంకలో నిషేధించారు. వరుస పేలుళ్ల ఘటన నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు కేబుల్‌ ఆపరేటర్లు ఈ ఛానెల్‌ ప్రసారాలను నిలిపివేసినట్టు స్థానిక వార్తా సంస్థలు పేర్కొన్నాయి. ఇప్పటికే భారత్‌, బంగ్లాదేశ్‌లు ఈ ఛానెల్‌పై నిషేధం విధించాయి. ఐసిస్‌కు సంబంధించిన భావజాల కార్యక్రమాలను పీస్‌ టీవీలో ప్రసారం చేసి, యువతను ఆకర్షిస్తున్నారనే ఆరోపణలపై దీన్ని నిషేధించారు.

8. 100 సేవలు ఒకే యాప్‌లో
ఆన్‌లైన్‌-సంప్రదాయ దుకాణాలను అనుసంధానించేలా, ప్రపంచంలోనే అతిపెద్ద ఇకామర్స్‌ ప్లాట్‌ఫామ్‌ సూపర్‌యాప్‌ను ముకేశ్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అభివృద్ధి చేస్తోంది. అమెజాన్‌, వాల్‌మార్ట్‌కు చెందిన ఫ్లిప్‌కార్ట్‌కు దీటుగా రూపొందిస్తున్న ఈ యాప్‌ను అధికారికంగా ఆవిష్కరించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. మొబైల్‌ ద్వారా 4జీ డేటా సేవలు అందిస్తున్న రిలయన్స్‌ జియో నెట్‌వర్క్‌ సహకారంతో దీన్ని అత్యధికులకు చేరువ చేయాలన్నది ముకేశ్‌ ప్రణాళిక.

9. రూ.2,000 కోట్లు పక్కనపెట్టిన ఎన్‌ఎస్‌ఈ
స్టాక్‌ మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ  కొరడా  ఝుళిపించడంతో జాతీయ స్టాక్‌ ఎక్స్‌ఛేంజి అప్రమత్తమైంది. కో లోకేషన్‌ కేసులో సెబీ మిగిలిన తీర్పును అమలు చేయడానికి వీలుగా రూ.2,000 కోట్ల ప్రొవిజన్‌ను 2018 డిసెంబర్‌ నాటికే ఏర్పాటు చేసింది.