WorldWonders

రన్‌వే కూడా దాటుకుని నదిలోకి వెళ్లిపోయింది

boeing flight in florida rams into river diving off of runway

అమెరికాలో ఘోర విమాన ప్రమాదం తప్పింది. ఫ్లోరిడాలోని జాక్సన్ విల్లేలో ఉన్న నేవల్ ఎయిర్ స్టేషన్ లో ల్యాండ్ అయిన సందర్భంలో రన్ వే చివరకు వెళ్లిపోయిన విమానం ఆ పక్కనే ఉన్న సెయింట్ జాన్స్ నదిలోకి దూసుకుపోయింది. ఈ సందర్భంగా విమానంలో 136 మంది ప్రయాణికులతో పాటు ఏడుగురు క్రూ సిబ్బంది కూడా ఉన్నారు. అయితే, విమానం నీటిలో మునగకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. కొంత మంది మాత్రం గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడకు చేరుకున్న నావికాదళ సిబ్బంది సహాయకచర్యలను ప్రారంభించింది. మరోవైపు, విమానంలోని ఇంధనం నదిలోకి లీక్ అవ్వకుండా సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. క్యూబాలోని గ్వాంటనమో బే నేవల్ స్టేషన్ నుంచి ఈ విమానం బయల్దేరింది. అక్కడి స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 9.40 గంటలకు విమానం నదిలోకి దూసుకుపోయింది. ఈ విమానం మియామీ ఎయిర్ కు చెందినది. ఈ ఘటనపై మియామీ ఎయిర్ ప్రతినిధులెవరూ ఇంతవరకు స్పందించలేదు. బోయింగ్ అధికార ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ, ప్రమాదానికి సంబంధించి సమాచారాన్ని తెప్పించుకుంటున్నామని తెలిపారు. ఈ సందర్భంగా జాక్సన్ విల్లే మేయర్ మాట్లాడుతూ, విమానం నీటిలో మునగకపోవడంతో, అందులో ఉన్నవారంతా క్షేమంగా ఉన్నారని చెప్పారు.