Politics

ట్రంప్‌కు కృతజ్ఞతలతో ఈ క్షిపణి అంకితం

north korea tests short range nuclear missile

ఉత్తరకొరియా పాలకుడు కిమ్‌ దూకుడు పెంచాడు. అమెరికాతో హనోయ్‌లో జరిగిన చర్చలు విఫలమైన తర్వాత కిమ్‌ వైఖరిలో మార్పునకు తాజా చర్యలు చిహ్నంగా నిలిచాయి. తాజాగా ఉత్తరకొరియా కొన్ని స్వల్పశ్రేణి క్షిపణులను ప్రయోగించింది. ఈ ప్రయోగం శనివారం ఉదయం 9.06కు హోడో ద్వీపకల్పం సమీపంలో వోన్‌సోన్‌పట్టణం వద్ద జరిగింది. ఈ క్షిపణులు 70 కిమీ నుంచి 200 కిమీ మధ్య దూరం ప్రయాణించాయి. ఈ విషయాన్ని దక్షిణకొరియా జాయింట్‌ చీఫ్ ఆఫ్‌ స్టాఫ్‌ వెల్లడించారు. ఈ పరిణామాలను దక్షిణ కొరియా జాగ్రత్తగా గమనిస్తోంది. 2017 నవంబర్‌లో చివరి సారి ఉత్తరకొరియా క్షిపణి పరీక్షలు నిర్వహించింది. ఫిబ్రవరిలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, ఉత్తరకొరియా అధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ మధ్య చర్చలు విఫలమైనప్పుడే కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ వారం మొదట్లో ఉత్తరకొరియా మంత్రి చోస్‌ సన్‌ హుయ్‌ మాట్లాడుతూ అమెరికా ఆర్థిక ఆంక్షలను తొలగించకపోతే అనుకోని పరిణామాలు చోటు చేసుకొంటాయని హెచ్చరించారు. ఈ పరీక్షల విషయంలో ఉత్తరకొరియా వ్యూహాత్మకంగా వ్యవహరించింది. కిమ్‌ జోంగ్‌ ఉన్‌ గతంలో ఖండాంతర క్షిపణుల ప్రయోగంపై స్వీయ నియంత్రణ విధించుకొన్నారు. అందుకే ఈ సారి స్వల్పశ్రేణి క్షిపణులను ప్రయోగించారు.