Business

ఓలా విద్యుత్ వాహనాలకు ₹400కోట్లు

ratan tata invests in ola cabs

దేశీయంగా క్యాబ్ సేవలందిస్తున్న ప్రముఖ సంస్థ ఓలాకు చెందిన ఓటా ఎలక్ట్రిక్‌లో రతన్‌ టాటా పెట్టుబడులు పెట్టారు. ఓలా మాతృ సంస్థ అయిన ఏఎన్‌ఐ టెక్నాలజీస్‌లో కూడా రతన్‌ అంతకుముందు పెట్టుబడులు పెట్టారు. అయితే ఆయన ఎంత పెట్టుబడులు పెట్టిందీ ఓలా యాజమాన్యం వెల్లడించలేదు. సంస్థలో విద్యుత్‌ వాహనాల విభాగానికి సంబంధించి ఇప్పటికే టైగర్‌ గ్లోబల్‌, మాట్రిక్స్ ఇండియా వంటి సంస్థలు వాటాదార్లుగా కొనసాగుతున్నాయి. వీటన్నిటి వల్ల ఇప్పటికే ఓలా విద్యుత్‌ ఎలక్ట్రిక్‌కు రూ.400 కోట్ల మేర పెట్టుబడులు అందాయి. ఈ సందర్భంగా 2021కల్లా దేశంలో 10 లక్షల విద్యుత్‌ వాహనాలను ప్రవేశపెట్టాలనే సంస్థ లక్ష్యానికి ఈ పెట్టుబడులు ఎంతో ఉపకరిస్తాయని ఓలా సహ వ్యవస్థాపకుడు, సీఈవో భవిష్‌ అగర్వాల్‌ తెలిపారు. ‘ఆయన ఓలాలో పెట్టబడులు పెట్టడం మా అందరికీ ఎంతో సంతోషంగా ఉంది. ఆయన మా అందరికీ ఎంతో స్ఫూర్తిదాయకం. మాకు దిశానిర్దేశం చేసేందుకే ఆయన వస్తున్నారు. ప్రపంచంలోని అన్ని తరగతుల వారూ భరించగలిగేలా రవాణా సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలన్నదే మా లక్ష్యం. 2021 కల్లా 10 లక్షల విద్యుత్‌ వాహనాలను తీసుకొస్తామ’ని అన్నారు. అగర్వాల్‌ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన రతన్‌ ‘ఓలా సీఈవో భవిష్‌ అగర్వాల్‌పై నాకు పూర్తి నమ్మకం ఉంది. ఆయన విధానాలు ఎంతో బాగుంటాయి. ఆయన దృష్టి ఎప్పుడూ లక్ష్యం వైపే ఉంటుంది. ఆయనతో కలిసి చేస్తున్న ఈ ప్రయాణంలో మరెన్నో మైలురాయిలను దాటుకుంటూ వెళ్లగలమ’ని అన్నారు