◆ ఒక మహోజ్వల శక్తి. ఇతడు జరిపిన సాయుధ పోరాటం స్వాతంత్ర్య ఉద్యమంలో ఒక ప్రత్యేక అధ్యాయం. సాయుధ పోరాటం ద్వారానే స్వతంత్రం వస్తుందని నమ్మి, దాని కొరకే తన ప్రాణాలర్పించిన యోధుడు అల్లూరి.
■ కేవలం 27 ఏళ్ళ వయసులోనే నిరక్షరాస్యులు, నిరుపేదలు, అమాయకులు అయిన అనుచరులతో, చాలా పరిమిత వనరులతో బ్రిటీషు సామ్రాజ్యమనే మహా శక్తిని ఢీకొన్నాడు.
☄మన్యం ప్రజలలో రాజు తెచ్చిన చైతన్యం..
■ మన్యం వాసుల కష్టాలను కడతేర్చటానికి, తెల్లదొరల దోపిడిని ఎదుర్కోవడానికి గిరిజనులకు ఆండగా నిలిచి పోరాటం చెయ్యాలని రాజు నిర్ణయించుకున్నాడు. వారికి తమ హక్కులను వివరించి, వారిలో ధైర్యాన్ని పెంపొందించి, అన్యాయాలను ఎదిరించే విధంగా తయారుచేసాడు. ప్రజలు ఆయన వద్దకు సలహాలకు, వివాద పరిష్కారాలకు వచ్చేవారు. చుట్టుపక్కల 30, 40 గ్రామాల ప్రజలకు రాజు నాయకుడ య్యాడు. మన్యం లోని గిరిజనులను సమీకరించి, వారిని దురలవాట్లకు దూరంచేసి, వారికి యుద్ధవిద్యలు, గెరిల్లా యుద్ధపద్ధతులు నేర్పి వారిని పోరాటానికి సిద్ధం చేయ్యసాగాడు. అతని అనుచరుల్లో ముఖ్యులు గాము గంటందొర, గాము మల్లుదొర, కంకిపాటి ఎండు పడాలు.
■ గిరిజనులపై దోపిడీ చేసిన బ్రిటీషు అధికారులలో చింతపల్లికి తహసీల్దారు అయిన బాస్టియన్అత్యంత క్రూరుడు. నర్సీపట్నం నుండి లంబసింగివరకు రోడ్డు మార్గం నిర్మించే కాంట్రాక్టరుతో కుమ్మక్కై, కూలీలకు సరైన కూలీ ఇవ్వక, ఎదురు తిరిగిన వారిని కొరడాలతో కొట్టించేవాడు. రామరాజు దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసాడు. దానిపై ఏ చర్యా తీసుకోలేదు. అయితే తనపై ఫిర్యాదు చేసాడనే కోపంతో బాస్టియన్ రామరాజు పై ప్రభుత్వానికి ఒక నివేదిక పంపాడు. రామరాజు గిరిజనులను కూడగట్టి విప్లవం తీసుకువచ్చే సన్నాహాల్లో ఉన్నాడనేది దాని సారాంశం.
■ అప్పటికే గిరిజనుల్లో కలుగుతున్న చైతన్యాన్ని గమనించిన ప్రభుత్వం రాజును గిరిజనులకు దూరంగా ఉంచదలచి, అతన్ని నర్సీపట్నంలో కొన్నాళ్ళు, అడ్డతీగల సమీపంలోని పైడిపుట్టిలోకొన్నాళ్ళు ప్రభుత్వ అధికారుల కనుసన్నలలో ఉంచింది. పైడిపుట్టిలో కుటుంబంతో సహా ఉండేవాడు. అనునిత్యం పోలీసుల నిఘా ఉండేది. రాజుకు ఇది ప్రవాస శిక్ష. పోలవరంలో డిప్యూటీ కలెక్టరు గా పనిచేస్తున్న ఫజులుల్లా ఖాన్ అనే వ్యక్తి సహకారంతో ఈ ప్రవాస శిక్షను తప్పించుకుని మళ్ళీ 1922 జూన్ లో మన్యంలో కాలు పెట్టాడు. విప్లవానికి వేదిక సిద్ధమయింది.
☄విప్లవం…
■ ప్రభుత్వోద్యోగి అయిన ఫజలుల్లాఖాన్ రాజును చాలా అభిమానించి సహాయం చేసేవాడు. కనుక ఫజలుల్లాఖాన్ బ్రతికి ఉండగా తాను తిరగబడనని రాజు మాట ఇచ్చాడట. 27-7-1922న తిమ్మాపురంలో ఫజలుల్లాఖాన్ ఆకస్మికంగా మరణించాడట. ఇక విప్లవ మార్గానికి సీతారామరాజు ఉద్యుక్తుడయ్యాడు. వారించిన తల్లిని క్షేమం కోసం వరసాపురం పంపేశాడు.
■ గంటందొర, మల్లుదొర, మొట్టడం వీరయ్యదొర, కంకిపాటి ఎండు పడాలు, సంకోజి ముక్కడు, వేగిరాజు సత్యనారాయణ రాజు (అగ్గిరాజు – భీమవరం తాలూకా కుముదవల్లి గ్రామం), గోకిరి ఎర్రేసు (మాకవరం), బొంకుల మోదిగాడు (కొయ్యూరు) వంటి సాహస వీరులు 150 మంది దాకా ఇతని అజమాయిషీలో తయారయ్యారట. పోలీసు స్టేషన్లపై దాడి చేసి ఆయుధాలు ఎత్తుకెళ్ళడంతో విప్లవం ప్రారంభమైంది. 1922 ఆగస్టు 19న మహారుద్రాభిషేకం చేసి చింతపల్లి పోలీసు దోపిడీకి నిశ్చయించుకొన్నారు. ఆగష్టు 22న మన్యం విప్లవం ఆరంభమైంది.
☄విప్లవ దళం వివిధపోలీసు స్టేషన్లపై చేసిన దాడుల వివరాలు:
?చింతపల్లి:
◆1922 ఆగష్టు 22న మన్యంలో తిరుగుబాటు ప్రారంభం అయింది. రంపచోడవరం ఏజన్సీలోని చింతపల్లి పోలీసు స్టేషనుపై 300 మంది విప్లవ వీరులతో రాజు దాడిచేసి, రికార్డులను చింపివేసి, తుపాకులు, మందుగుండు సామాగ్రిని తీసుకువెళ్ళారు. మొత్తం 11 తుపాకులు, 5 కత్తులు, 1390 తుపాకీ గుళ్ళు, 14 బాయొనెట్లు తీసుకువెళ్ళారు. ఏమేం తీసుకువెళ్ళారో రికార్డు పుస్తకంలో రాసి, రాజు సంతకం చేసాడు. ఆ సమయంలో స్టేషనులో ఉన్న పోలీసులకు ఏ అపాయమూ తలపెట్టలేదు. తిరిగి వెళ్ళేటపుడు, మరో ఇద్దరు పోలీసులు కూడా ఎదురుపడ్డారు. వారి వద్దనున్న ఆయుధాలను కూడా లాక్కున్నారు.
?కృష్ణదేవి పేట :
◆ఇనుమడించిన ఉత్సాహంతో మరుసటి రోజే శరభన్నపాలెం వెళ్ళి, భోజనాలు చేసి ఆ రాత్రే ఆగష్టు 23న – కృష్ణదేవి పేట పోలీసు స్టేషనును ముట్టడించి, ఆయుధాలను తీసుకు వెళ్ళారు. ముందుగా పోలీసులను భయపెట్టి బయటకు పంపేశారు. 7 తుపాకులు, కొన్ని మందుగుండు పెట్టెలు మాత్రం లభించాయి.
?రాజవొమ్మంగి :
◆ఆగష్టు 24న – వరుసగా మూడవ రోజు – రాజవొమ్మంగి పోలీసు స్టేషనుపై దాడి చేసారు. అయితే ఈసారి పోలీసుల నుండి కొద్దిపాటి ప్రతిఘటన ఎదురైంది. అక్కడ ఆయుధాలు దోచుకోవడమే కాక, అక్కడ బందీగా ఉన్న వీరయ్య దొరను కూడా విడిపించారు. ఈ మూడు దాడులలోను మొత్తం 26 తుపాకులు, 2500కు పైగా మందుగుండు సామాగ్రి వీరికి వశమయ్యాయి.
★ వరుసదాడులతో దెబ్బతిని ఉన్న బ్రిటీషు ప్రభుత్వం విప్లవ దళాన్ని అంతం చెయ్యడానికి కబార్డు, హైటర్ అనే అధికారులను చింతపల్లి ప్రాంతంలో నియమించింది. సెప్టెంబర్ 24 న తమ అనుచర సైనికులతో వీరు గాలింపు జరుపుతూ దట్టమైన అడవిలో ప్రవేశించారు. రాజు దళం గెరిల్లా యుద్ధరీతిలో వీరిపై దాడిచేసి, అధికారులిద్దరినీ హతమార్చింది. మిగిలిన సైనికులు చెల్లాచెదురై పోయారు. ఆ ఇద్దరు అధికారుల శవాలు తీసుకుని వెళ్ళడానికి స్థానిక ప్రజల మధ్యవర్తిత్వం తీసుకోవలసి వచ్చింది. విప్లవదళం పట్ల ప్రజల్లో సహజంగానే ఉండే ఆదరభావం ఈ సంఘటనలతో మరింత పెరిగిపోయింది.
?అడ్డతీగల :
◆ రామరాజు పోరాటంలో అత్యంత సాహసోపేతమైనది అడ్డతీగల పోలీసు స్టేషనుపై అక్టోబర్ 15న జరిపిన దాడి. మొదటి దాడులవలె కాక ముందే సమాచారం ఇచ్చి మరీ చేసిన దాడి ఇది. ప్రభుత్వం పూర్తి రక్షణ ఏర్పాట్లు చేసుకుని కూడా దళాన్ని ఎదిరించలేక పోయింది. ఆయుధాలు అందకుండా దాచిపెట్టడం మినహా, ఎటువంటి ప్రతిఘటన ఇవ్వలేకపోయింది. స్టేషనుపై దాడిచేసిన దళం దాదాపు 5 గంటలపాటు స్టేషనులోనే ఉండి, పారిపోగా మిగిలిన పోలీసులను బంధించి, వారికి జాబులు ఇచ్చి మరీ వెళ్ళింది. ఆసుపత్రి పుస్తకంలో రాజు సంతకం చేసిన పుస్తకం ఇంకా ఉంది. రాజు పోరాటం లో అడ్డతీగల ప్రాంతం ముఖ్యమయింది.
?రంపచోడవరం :
◆ అక్టోబర్ 19న రంపచోడవరం స్టేషనును పట్టపగలే ముట్టడించారు. రాజు అక్కడ సబ్ మేజిస్ట్రేటును, సబ్ ఇన్స్పెక్టరును పిలిచి మాట్లాడాడు. అక్కడ కూడా ఆయుధాలు దాచిపెట్టడం చేత దళానికి ఆయుధాలు దొరకలేదు. అయితే అక్కడి ప్రజలు అసంఖ్యాకంగా వచ్చి రాజుపట్ల తమ అభిమానాన్ని తెలియజేశారు. జ్యోతిశ్శాస్త్రరీత్యా తాను పెట్టుకొన్న ముహూర్తాన్ని ముందుగా తెలియజేసి ముట్టడిచేయడంలో ఇతనికి లభించిన విజయాలవల్ల రాజు ప్రతిష్ట ఇనుమడించింది. ఇతని సాహసాలను గురించి కథలు కథలుగా చెప్పుకొనసాగారు. కొన్ని సార్లు రాజు తను ఫలానా చోట ఉంటానని, కావాలంటే యుద్ధం చేయమని సవాలు పంపేవాడు.
◆ ఇతనిని పట్టుకోవడానికి బ్రిటిష్ ప్రభుత్వం ప్రయత్నాలు తీవ్రతరం చేసింది. అక్టోబర్ 23న ప్రత్యేక సైనిక దళాలతో వచ్చిన సాండర్స్ అనే సేవాని దళంతో రాజు దళానికి ముఖాముఖి యుద్ధం జరిగింది. పరిస్థితులు అనుకూలంగా లేవని సాండర్స్ వెనుదిరిగాడు. భారత జాతికి చెందిన పోలీసులు పట్టుబడ్డాగాని వీలయినంతవరకు రాజు దళం వారు మందలించి వదిలేశేవారు. క్రమంగా గూఢచారుల వలన, పట్టుబడ్డ రాజు అనుచరులవలన ప్రభుత్వాధికారులు రాజు కదలికలను నిశితంగా అనుసరించసాగారు.
?రాజు గురించి వివిధ అభిప్రాయాలు…
◆అల్లూరి సీతారామరాజు విప్లవంపై ఆనాటి పత్రికల అభిప్రాయాలు ఇలా ఉండేవి:
◆ కాంగ్రెస్ పత్రిక: రంప పితూరీని పూర్తిగా అణచివేస్తే ఆనందిస్తామని ప్రచురించింది.
◆స్వతంత్ర వార పత్రిక (1924 మే 13, 20): అటువంటి (రాజు) వారు చావాలి అని ప్రచురించింది.
◆ కృష్ణాపత్రిక: విప్లవకారులను ఎదుర్కోవడం కొరకు ప్రజలకు, పోలీసులకు మరిన్ని ఆయుధాలు ఇవ్వలేదని ప్రభుత్వాన్ని విమర్శించింది.
అయితే రాజు మరణించాక పత్రికలు ఆయనను జాతీయ నాయకుడిగా, శివాజీగా, రాణా ప్రతాప్‌గా, లెనిన్‌గా కీర్తించాయి. రాజు వీర స్వర్గమలంకరించాడని రాసాయి. సత్యాగ్రహి అనే పత్రిక రాజును జార్జి వాషింగ్టన్ తో పోల్చింది.
★1929లో మహాత్మా గాంధీ ఆంధ్ర పర్యటనలో ఉండగా ఆయనకు అల్లూరి చిత్రపటాన్ని బహూకరించారు. తరువాతి కాలంలో రాజు గురించి ఆయన ఇలా రాసాడు:
★ శ్రీరామరాజువంటి అకుంఠిత సాహసము, త్యాగదీక్ష, ఏకాగ్రత, సచ్చీలము మనమందరము నేర్చుకొనదగినది. సాయుధ పోరాటం పట్ల నాకు సానుకూలత లేదు, నేను దానిని అంగీకరించను. అయితే రాజు వంటి ధైర్యవంతుని, త్యాగశీలుని, సింపుల్ వ్యక్తి, ఉన్నతుని పట్ల నా గౌరవాన్ని వెల్లడించకుండా ఉండలేను. రాజు తిరుగుబాటుదారు కాదు, ఆయనో హీరో. – (యంగ్ ఇండియా పత్రిక – 1926)
సుభాష్ చంద్ర బోస్..
★ సీతారామరాజు జాతీయోద్యమానికి చేసిన సేవను ప్రశంసించే భాగ్యం నాకు కలిగినందుకు నేను సంతోషిస్తున్నాను. …. భారతీయ యువకులు ఇలాంటి వీరులను ఆరాధించడం మరువకుందురు గాక.
“సీతారామరాజు” బుర్రకథ ముగింపులో ఇలా ఉంది..
★ శ్రీ సీతారామరాజు మరణించినా అతడు రగిలించిన విప్లవాగ్ని చల్లారలేదురా తమ్ముడూ! వీరుడు మరణింపడు. విప్లవానికి పరాజయం లేదు. చిందిన వీరుని రక్తం చిరకాలము ప్రవహిస్తూ ఉంటుంది….(జ: జూలై4,1897 – మ:మే 7, 1924)