Devotional

అక్షయ తృతీయ నాడు బంగారం కొనడం పాపం

Chaganti Says Buying Gold On Akshaya Tritiya Is A Sin

అక్షయ తృతీయ వచ్చిందంటే చాలు బంగారం కొనుగోళ్లతో షాపులన్నీ రద్దీగా మారుతున్నాయి. జ్యూవెలరీ షాపులు ఆఫర్లతో ముఖ్యంగా మహిళాలోకాన్ని ఆకట్టుకుంటున్నాయి. అక్షయ తృతీయ రోజు బంగారం కొనుగోలు చేస్తే అదృష్టం అనే ప్రచారం జోరుగా సాగటంతో అక్షయతృతీయకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. అయితే తాజాగా ఇదే అంశంపై ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రవచన బ్రహ్మ చాగంటి కోటేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. అక్షయ తృతీయ రోజున బంగారం కొంటే పాపం కొనుగోలు చేసినట్టేనని ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త చాగంటి కోటేశ్వరరావు ప్రవచించారు. బంగారంలో కలి పురుషుడు ఉంటాడంటూ అసలు బంగారం కొనాలని ఎవరూ చెప్పారో అర్ధం కావట్లేదు అని ఆయన అన్నారు . అక్షయతృతీయ సమయంలో చాగంటి చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చాగంటి వ్యాఖ్యల్లో సైతం నిజముందంటూ ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు. అక్షయ తృతీయ రోజు దానం చేస్తే మంచిది కానీ బంగారం కొంటే పాపం అని చెప్తున్నారు. ఏ ధర్మశాస్త్రాల్లోనూ అక్షయ తృతీయ రోజున బంగారం కొనుగోలు చేయాలంటూ లేదని.. ఈ ఆచారం ఎలా వచ్చిందో కూడా తమకు తెలియదని చెబుతున్నారు ఆధ్యాత్మిక వేత్తలు. ఆరోజున బంగారం కొని తీరాలని కేవలం జ్యూవెలరీ షాపుల వారి ప్రచారంతో ప్రజల్లో ఎక్కడలేని వేలంవెర్రి పట్టిందని అంటున్నారు. మహిళల సెంటిమెంట్ ను అడ్డం పెట్టుకుని వ్యాపారులు కాసుల పంట పండిస్తున్నారని చెబుతున్నారు.