Agriculture

కూరగాయల సాగులో హార్మోన్ల వాడకం

Telugu Agricultural News-Using Hormones In Veggies Cultivation At Home

వేసవిలో సాగు చేసే కూరగాయలలో ప్రధాన సమస్య మొక్కలు ఎదగకపోవడం. పూత, పిందె విపరీతంగా రాలిపోవడం. దీనికితోడు వైరస్‌ తెగుళ్ల తాకిడి ఎక్కువగా ఉంటుంది. దీంతో దిగుబడి కూడా తగ్గిపోతుంది.ఉష్ణోగ్రత 36 డిగ్రీల సెల్సియస్‌ మించితే మగపూల సంఖ్య పెరుగుతుంది. సకాలంలో సూక్ష్మధాతు పోషకాలు, వృద్ధి నియంత్రక హార్మోన్లు వాడితే దీన్ని తగ్గించడంతో పాటు దిగుబడులు పెంచుకోవచ్చు. పందిరి కూరగాయలైన బీర, సొర, దోస, కాకర, పొట్ల, గుమ్మడిలలో వేసవిలో అధిక ఉష్ణోగ్రతల వల్ల మగపూలు ఎక్కువై దిగుబడి తగ్గుతుంది. గింజలు విత్తిన 15 రోజులకు మొక్క 2 నుంచి 4 ఆకుల దశలో ఉన్నప్పుడు లీటరు నీటికి 3-4 గ్రాముల బోరాక్స్‌ లేదా 10 లీటర్ల నీటిలో 2.5 మి.లీ. ఇథరిల్‌ కలిపి వారంరోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేస్తే, ఆడపూల సంఖ్య పెరిగి దిగుబడి పెరుగుతుంది. ఈ పంటలకు సిఫార్సు చేసిన నత్రజనిని రెండు దఫాలుగా విభజించాలి. రెండోదఫాను పూత, పిందె పడే సమయంలో అంటే 45 రోజుల పంటప్పుడు తప్పనిసరిగా వేయాలి. బూడిద గుమ్మడి తీగ పాకే సమయంలో సైకోసిల్‌ (CCC) 2.5 గ్రాములు లేదా మాలిక్‌ హైడ్రజైడ్‌ 0.5 గ్రాములు పదిలీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ఫలితంగా దిగుబడి పెరుగుతుంది. దొండలో పూత, పిందె సమయంలో నీటి ఎద్దడి ఎదురుకాకుండా చూసుకోవాలి. లేదంటే పూత, పిందె రాలిపోతుంది. పుచ్చ, దోసపండు మొక్కలు 2-4 ఆకుల దశలో ఉన్నప్పుడు లీటరు నీటికి 1.5 నుంచి 2 గ్రాముల డైసోడియం ఆర్తోబోరేట్‌ను లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. పూత రావడానికి ముందు చివర్లు తుంచాలి. దీనివల్ల పక్క తీగలు అభివృద్ధి చెంది దిగుబడి పెరుగుతుంది. వేసవిలో తోటకూర మొక్కలపై లీటరు నీటికి 20 గ్రాముల యూరియాతో 50 పీపీఎం (లీటరు నీటికి 50 మి. గ్రా.) జిబ్బరిలిక్‌ ఆమ్లం కలిపిన ద్రావణాన్ని పిచికారీ చేస్తే దిగుబడి పెరుగుతుంది. ఆకులు తాజాగా ఉంటాయి. పాలకూరలో లీటరు నీటికి 10 గ్రాముల యూరియా కలిపి పిచికారీ చేయాలి. కేవలం అధిక వేడిని తట్టుకునే టమాటా రకాలను సాగు చేయాలి. మొక్కలను దగ్గర దగ్గరగా నాటాలి. పూతదశలో ఎకరానికి 400 మి.గ్రా. 2,4-డి మందును 200 లీటర్ల నీటిలో కలిపి లేదా 1 మి.లీ. ప్లానోఫిక్స్‌ 4 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. దీంతో ఎండకాలంలో పూత, పిందె నిలుస్తుంది. దిగుబడి కూడా తగ్గకుండా ఉంటుంది. వీటితోపాటు వైరస్‌ తెగుళ్లను ఎప్పటికప్పుడు అరికట్టాలి. అలాగే సాధ్యమైనంత వరకు నీడను కల్పిస్తే వేసవిలోనూ మేలైన దిగుబడులు పొందవచ్చు.