Agriculture

వరంగల్ మిర్చి యార్డులో ₹24వేలు దాటిన ధర

Telugu Agricultural News Today-Record Price For Red Chillies In Warangal

వరంగల్‌ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో సోమవారం మిర్చి రికార్డు స్థాయిలో ధర పలికింది. ఈ సీజన్‌లో అత్యధికంగా క్వింటాల్‌ సింగిల్‌పట్టి రకం మిర్చికి రూ.24,500 లభించింది. గత నెలలో సింగిల్‌పట్టి రకం మిర్చికి క్వింటాల్‌కు రూ.21,500 ధరలు వచ్చింది. అయితే ఈ సీజన్‌లో ఇప్పటి వరకు తేజ, యుఎస్‌-341 రకాలకు అత్యధికంగా క్వింటాల్‌కు రూ.23,500 ధర లభించింది. వరంగల్‌ రూరల్‌ జిల్లా నర్సంపేట మండలం గుల్లాపాడ్‌ గ్రామానికి చెందిన సోమ్లా నాయక్‌కు చెందిన సింగిల్‌పట్టి మిర్చి రెండు బస్తాలు క్వింటాల్‌కు రూ.24,500 ధరతో కొనుగోలు జరిగింది. వెంకటరమణ అడ్తి అండ్‌ కో ద్వారా సాయి మహేశ్వర ట్రేడర్స్‌ వారు కొనుగోలు చేసినట్లు తెలిపారు. ఈ సీజన్‌ డిసెంబర్‌ నుంచి ఇప్పటి వరకు మార్కెట్‌కు 3,03,277 క్వింటాళ్ల మిర్చి విక్రయానికి రాగా అందులో సింగిల్‌పట్టి రకం మిర్చి 233 క్వింటాళ్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు.