DailyDose

జూన్ 19న రాజ్యసభ ఎన్నికలు-తాజావార్తలు

Telugu Breaking News Roundup Today - Rajyasabha Elections On June 19th

* భారత్‌కు మరో తుపాను ముప్పు పొంచి ఉన్నట్లు వాతావరణ పరిశోధనాశాఖ ఈ ఉదయం ప్రకటించింది. ఆగ్నేయ అరేబియా సముద్రంలో ఆదివారం అల్పపీడనం ఏర్పడినట్టు ఆ శాఖ శాస్త్రవేత్తలు వివరించారు. ఈ అల్పపీడనం గోవాలోని పాంజిమ్‌కు నైరుతి దిశగా 370 కి.మీ, ముంబయికి దక్షణ నైరుతి దిశగా 690 కి.మీ దూరంలో, గుజరాత్‌లోని సూరత్‌కు దక్షణ నైరుతి దిశలో 920 కి.మీ దూరంలో కేంద్రీకృతమైనట్టు తెలిపింది. కాగా ఇది సోమవారం నాటికి వాయుగుండంగా, అనంతరం తుపానుగా మారే అవకాశం ఉందని వారు అంచనా వేస్తున్నారు. ‘నిసర్గ’ అని పిలుస్తున్న ఈ తుపాను జూన్‌ 3 సాయంత్రానికి దక్షిణ గుజరాత్‌, ఉత్తర మహారాష్ట్ర తీరాలను తాకవచ్చని వారు తెలిపారు. సూపర్‌ సైక్లోన్‌ అంపన్‌ కొద్ది రోజుల క్రితమే పశ్చిమ బెంగాల్‌, ఒడిశాలలో విధ్వంసం సృష్టించిన నేపథ్యంలో… మరో తుపాను హెచ్చరిక వెలువడటం ప్రాధాన్యతను సంతరించుకుంది.

* ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి అమెరికా బయటకు రావడంపై సోమవారం చైనా విమర్శలు గుప్పించింది. అమెరికాకు నిష్క్రమించడం ఓ వ్యసనమైందని ఎద్దేవా చేసింది. ఇది ఆ దేశ ఏకపక్షవాదానికి నిదర్శనమని మండిపడింది. దీనిపై చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి జావో లిజియన్ మాట్లాడుతూ..‘సంస్థల నుంచి నిష్క్రమించడం, ఒప్పందాలకు స్వస్తి పలకడం అమెరికాకు వ్యసనంగా మారింది’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

* సీఎం కేసీఆర్‌కు, ఆయన కేబినెట్‌ మంత్రులకు గత ఆరేళ్లుగా అబద్ధాలు మాట్లాడుతూ దబాయించడం అలవాటైందని తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి మండిపడ్డారు. ప్రతి విషయంలోనూ తెరాస నేతలు బూటకపు మాటలు చెప్తూ వస్తున్నారని దుయ్యబట్టారు. నిన్న నల్గొండలో తాను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే మంత్రి జగదీశ్ రెడ్డి తనపై వ్యక్తిగత విమర్శలు చేశారని ఉత్తమ్ ఆక్షేపించారు. రుణమాఫీపై ప్రస్తావిస్తే అడ్డగోలుగా మాట్లాడారని విమర్శించారు.

* తాను పార్టీ మారుతున్నానంటూ జరుగుతున్న ప్రచారాన్ని రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌ ఖండించారు. ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక ఈ తరహా అసత్య ప్రచారం జరగడం ఇది మూడోసారన్నారు. ఈ మేరకు ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. తెదేపా అధినేత చంద్రబాబు చేసే ప్రతి పోరాటంలో అండగా ఉంటున్నందుకే తనపై కొందరు కుట్ర పన్నారని ఆరోపించారు. మార్చి 20వ తేదీ నుంచి నిన్న మొన్నటి వరకు తాను ఏపీలో ఉన్నట్లు గానీ, ఒంగోలులో మంత్రి బాలినేనిని కలిసినట్లు గానీ నిరూపిస్తే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని అనగాని స్పష్టం చేశారు.

* వాయిదా పడిన 18 రాజ్యసభ స్థానాలకు జూన్‌ 19న ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. వాస్తవానికి మార్చిలోనే ఈ ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా కొవిడ్‌-19 కారణంగా వాయిదా పడ్డాయి. ఈ నెల 19న ఉదయం 9 గంటల నుంచి 4 గంటల వరకు పోలింగ్‌ నిర్వహించనున్నారు. వెంటనే ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.

* పొన్నూరు, మంత్రాలయం నియోజక వర్గాల్లో తమ పార్టీ కార్యకర్తలపై దాడులు అమానుషమని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. మహిళలు అని కూడా చూడకుండా దాడులకు తెగబడడం వైకాపా అరాచక శక్తులకు తగదని హెచ్చరించారు. బీసీలు, దళితులపై వైకాపా దాడులు గత ఏడాదిగా శ్రుతిమించి పోయాయని చంద్రబాబు మండిపడ్డారు. రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తెదేపా కార్యకర్తలు, పార్టీ సానుభూతి పరుల ఆస్తులను ధ్వంసం చేశారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.

* పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌కు నిజంగానే ఆరోగ్యం బాగోలేదా? అనారోగ్యమంటూ అబద్ధాలు చెప్పి లండన్‌ చెక్కేశారా? అనే విషయం ప్రస్తుతం మరోసారి చర్చనీయాంశమైంది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నవాజ్‌ షరీఫ్‌ తాజాగా లండన్‌ వీధుల్లో తిరగడం పాకిస్థాన్‌లోనే ఆయనమీద విమర్శలకు కారణమయ్యింది. పాకిస్థాన్‌కు అత్యధిక కాలం ప్రధానమంత్రిగా పనిచేసిన నవాజ్‌ షరీఫ్‌(70) తాజాగా తన మనువరాళ్లతో కలిసి లండన్‌ వీధుల్లో కనిపించారు. నగరంలోని ఓ రోడ్డుపక్కన ఉన్న హోటల్‌లో టీ తాగుతూ కూర్చున్న ఫొటో తాజాగా సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యింది.