* సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్‌ఎంఈలు) కోసం తీసుకొచ్చిన రూ.3 లక్షల కోట్ల అత్యవసర రుణ హామీ పథకం కింద బ్యాంకులు రూ.52,255.53 కోట్లు పంపిణీ చేశాయని ఆర్థిక శాఖ ప్రకటించింది. జూన్ 1 ఈ పథకం ప్రారంభమైన విషయం తెలిసిందే. జులై 1కి ఈ పథకం కింద బ్యాంకులు రూ.1,10,343.77 కోట్లు మంజూరు చేయగా.. అందులో రూ.52,255.53 కోట్లను ఇప్పటికే మంజూరు చేశాయని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ట్వీట్ చేశారు. ప్రభుత్వ రంగ బ్యాంకులు రూ.63,234.94 కోట్లు మంజూరు చేయగా.. రూ.33,349.13 కోట్లు పంపిణీ చేశాయి. ఇక ప్రైవేటు బ్యాంకులు రూ.47,108.83 కోట్లు మంజూరు చేయగా.. ఎంఎస్‌ఎంఈలకు రూ.18,906.40 కోట్లు ఇచ్చాయి. దేశంలో అతిపెద్ద బ్యాంక్ అయిన ఎస్‌బీఐ రూ.20,281 కోట్లు మంజూరు చేయగా.. ఇప్పటికే రూ.12,885 కోట్లు పంపిణీ చేసింది. ఇక పంజాబ్ నేషనల్ బ్యాంక్ రూ.7,957 కోట్లు మంజూరు చేయగా.. రూ.2404 కోట్లు ఇచ్చింది.
* ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21) మొదటి రెండు నెలల్లో పసిడి దిగుమతులు 79.14 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.600 కోట్లు)కు పరిమితమయ్యాయి. ఏడాది క్రితం ఇదే సమయంలో పసిడి దిగుమతుల విలువ 8.75 బిలియన్ డాలర్లు కావడం గమనార్హం. కరోనా సంక్షోభం నేపథ్యంలో గిరాకీ మందగించడం ప్రభావం చూపింది. పసిడి దిగుమతులు తగ్గడంతో ఏప్రిల్, మే నెలల్లో దేశ వాణిజ్య లోటు 9.91 బిలియన్ డాలర్లకు దిగొచ్చింది. ఏడాది క్రితం ఇది 30.7 బిలియన్ డాలర్లుగా ఉంది. జనవరి- మార్చి త్రైమాసికంలో కరెంటు ఖాతా లోటు కూడా అదుపులోకి వచ్చిందని ఆర్‌బీఐ తెలిపింది. గతేడాది డిసెంబరు నుంచి పసిడి దిగుమతులు ప్రతికూల వృద్ధిని నమోదు చేస్తున్నాయి. ఈ ఏడాది మార్చి, ఏప్రిల్, మేలో వరుసగా 62.6%, 99.93%, 98.4% చొప్పున క్షీణత నమోదుచేశాయి. ఇక ఏప్రిల్-మేలో రత్నాలు, ఆభరణాల ఎగుమతులు 82.46% తగ్గి 1.1 బిలియన్ డాలర్లకు, వెండి దిగుమతులు 30.7% తగ్గి 437.89 మిలియన్ డాలర్లకు చేరాయి.
* ఆదాయపు పన్ను (ఐటీ) విభాగం ఏప్రిల్ 8 నుంచి జూన్ 30 మధ్య ఇరవై లక్షల మందికి పైగా పన్ను చెలింపుదార్లకు రూ.62,361 కోట్ల రిఫండ్‌లను జారీ చేసింది. ఇందులో వ్యక్తిగత ఆదాయపు పన్ను రిఫండ్‌ల విలువ రూ.23,453.57 కోట్లు కాగా.. కార్పొరేట్ పన్ను రిఫండ్‌లు రూ.38,908.37 కోట్లు. ఐటీ రిఫండ్‌లు పొందినవాళ్లలో వ్యక్తిగత ఆదాయపు పన్ను చెల్లింపుదార్లు 19.07 లక్షలు, కార్పొరేట్ పన్ను చెల్లింపుదార్లు 1.36 లక్షల మంది అని ఓ అధికారిక ప్రకటన వెల్లడించింది. 2020 ఏప్రిల్ 8 నుంచి జూన్ 30 మధ్య సగటున నిమిషానికి 76 రిఫండ్‌లను ఐటీ విభాగం మంజూరు చేసిందని పేర్కొంది. రిఫండ్‌లు మంజూరు చేయాలంటూ ఆదాయపు పన్ను కార్యాలయాలకు పన్ను చెల్లింపుదార్లు వెళ్లే పని లేకుండా రిఫండ్ మొత్తాన్ని వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. ఆదాయపు పన్ను విభాగం పంపే ఇ-మెయిళ్లకు సత్వరమే పన్ను చెల్లింపుదార్లు స్పందిస్తే.. రిఫండ్‌లను సాధ్యమైనంత త్వరగా జారీ చేసే వీలుంటుందని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) వెల్లడించింది. రిఫండ్ ఎంత రావాలి, బ్యాంకు ఖాతా వివరాలేమిటి? లాంటి విషయాలపై స్పష్టత కోసం పన్ను చెల్లింపుదార్లకు ఐటీ విభాగం ఈ ఇ-మెయిళ్లను పంపిస్తోందని తెలిపింది. వీటికి వెంటనే బదులిస్తే రిఫండ్‌ల జారీ ప్రక్రియ వేగంగా పూర్తవుతుందని వివరించింది. కొవిడ్-19, లాక్‌డౌన్ పరిణామాల నేపథ్యంలో వ్యక్తులు, వ్యాపార సంస్థలకు తక్షణ ఉపశమనాన్ని అందించే ఉద్దేశంతో రూ.5 లక్షల వరకు పెండింగ్‌లో ఉన్న రిఫండ్‌ల సత్వర జారీకి ఆదాయపు పన్ను విభాగం నిర్ణయం తీసుకుంది.
* శాటిలైట్ సాంకేతికత సంస్థ ‘వన్‌వెబ్’ను బ్రిటన్ ప్రభుత్వంతో కలిసి భారతీ చేజిక్కించుకుంది. వన్‌వెబ్ కొనుగోలుకు నిర్వహించిన వేలం ప్రక్రియలో ఈ బృందం విజయవంత బిడ్డర్‌గా నిలిచింది. లావాదేవీ వివరాలను భారతీ వెల్లడించనప్పటికీ.. బ్రిటన్ ప్రభుత్వం, భారతీ గ్లోబల్‌లు చెరో 50 కోట్ల డాలర్లను (సుమారు రూ.3,750 కోట్లు) వెచ్చించనున్నాయని బ్రిటన్ వాణిజ్య కార్యదర్శి అలోక్ శర్మ వెల్లడించారు. అలాగే బ్రిటన్ ప్రభుత్వం, భారతీ గ్లోబల్‌కు వన్‌వెబ్‌లో 45% చొప్పున వాటా లభిస్తుందని తెలిపారు. ప్రస్తుత వాటాదార్ల వద్ద మిగిలిన 10 శాతం వాటా ఉంటుందని చెప్పారు. అయితే ఈ లావాదేవీకి అమెరికా కోర్టు అనుమతి, నియంత్రణ సంస్థల ఆమోదం లభించాల్సి ఉంది. ప్రస్తుత సంవత్సరం చివరికల్లా ఈ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. భారతీ ఎంటర్‌ప్రైజెస్ విదేశీ అనుబంధ సంస్థ అయిన భారతీ గ్లోబల్‌కు టెలికాం, సాంకేతికత, ఆతిథ్యం, రవాణా, విద్యుత్ విభాగాల్లో పెట్టుబడులు ఉన్నాయి. 2012లో వ్యవస్థాపితమైన వన్‌వెబ్.. అమెరికా, బ్రిటన్‌లో శాటిలైట్ సాంకేతికతను అభివృద్ధి చేస్తోంది. ప్రస్తుతం ఈ సంస్థ దివాలా ప్రక్రియను ఎదుర్కొంటోంది.
* జీఎస్‌టీ నెలవారీ, త్రైమాసిక రిటర్న్‌ల దాఖలు ఆలస్యమైతే గరిష్ఠంగా ఒక్కో రిటర్న్‌కు రూ.500 ఆలస్య రుసుం చెల్లించాల్సి ఉంటుంది. 2017 జులై నుంచి 2020 జులై వరకు రిటర్న్‌లకు ఈ ఆలస్య రుసుం పరిమితి వర్తిస్తుంది. అయితే ఈ రిటర్న్‌లను కూడా 2020 సెప్టెంబరు 30లోగా దాఖలు చేయాల్సి ఉంటుందని కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్ బోర్డు (సీబీఐసీ) వెల్లడించింది. ‘జీఎస్‌టీ చెల్లింపుదార్లకు ఊరట కల్గించే నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుంది. 2017 జులై- 2020 జులై వరకు దాఖలు చేయాల్సిన జీఎస్‌టీఆర్-3బీ రిటర్న్‌లకు ఆలస్య రుసుము గరిష్ఠ పరిమితిని రూ.500గా నిర్ణయించింద’ని ఒక ప్రకటనలో తెలిపింది. ఎటువంటి పన్ను బకాయిలు లేకుంటే ఆలస్యం రుసుము కూడా ఏమీ ఉండదని స్పష్టం చేసింది.