Politics

చంద్రబాబు ఇల్లు మునుగుతోంది

చంద్రబాబు ఇల్లు మునుగుతోంది

ఎగువన కురుస్తున్న వర్షాలకు ప్రకాశం బ్యారేజీకి వరద నీరు పోటెత్తుతోంది. గంట గంటకు కృష్ణానది వరద ప్రవాహం పెరుగుతోంది. దీంతో  ఈస్ట్రన్, వెస్ట్రన్ కెనాల్స్‌కు 5 వేల క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేశారు. బ్యారేజీ వద్ద 16.2 అడుగులకు నీటిమట్టం చేరింది. ఇన్‌ఫ్లో 6.66 లక్షలు క్యూసెక్కులు ఉండగా ఔట్‌ఫ్లో 6.61 లక్షల క్యూసెక్కులుగా ఉంది. పరివాహాక ప్రాం‍తాల్లో రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. కృష్ణా నది వరద ప్రవాహంతో లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురైనాయి. కృష్ణలంక, తారకరామనగర్, భూపేష్ గుప్తానగర్‌లో ఇళ్లు నీట మునిగాయి. విజయవాడ నగరంలో నాలుగు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. పునరావాస కేంద్రాలకు ముంపు బాధితులను అధికారులు తరలిస్తున్నారు.

ప్రకాశం బ్యారేజ్ నుంచి వెంకటపాలెం వరకు కరకట్ట లోపల వైపు ఉన్న నిర్మాణాలకు అధికారులు ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. చంద్రబాబు ఇంటితో సహా 36 భవనాలకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. వరద ముంపు ప్రభావిత ప్రాంతాలను అధికారులు అప్రమత్తం చేశారు. లంక గ్రామాల్లో ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసి పరిస్థితిని జిల్లా కలెక్టర్ సమీక్షిస్తున్నారు. కృష్ణానది పరీవాహక ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. ముంపునకు గురయ్యే ప్రాంతాలపై స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రత్యేక దృష్టిపెట్టారు.