* గుంటూరు జీజీహెచ్ కు ఆంధ్రప్రదేశ్ మంత్రి శ్రీరంగనాథరాజు రూ.కోటి విరాళం ప్రకటించారు. పేద ప్రజలకు ఆ ఆసుపత్రి అందిస్తోన్న సేవలను ఆయన కొనియాడారు. జీజీహెచ్ 9 జిల్లాల ప్రజలకు వైద్య సేవలు అందిస్తోందని, ఆ ఆసుపత్రిలోని రోగులతో పాటు అటెండర్లకు కూడా రెండు పూటల భోజన సదుపాయం కల్పించాలని తాము నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.
* రేపు ఉదయం 11.30 గంటలకు కనకదుర్గ ఫ్లై ఓవర్ ప్రారంభం.వర్చువల్ గా ప్రారంభోత్సవం లో పాల్గొననున్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, సీఎం జగన్మోహన్ రెడ్డి.ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ ఏ.యండి.ఇంతియాజ్.ఫ్లై ఓవర్ ప్రారంభం అయ్యాక ఫ్లైఓవర్ పై మొదటగా ట్రావెల్ చేయనున్న ఆర్బి మంత్రి శంకర్ నారాయణ, అధికారులు.కనకదుర్గ ఫ్లై ఓవర్ తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 61 కొత్త ప్రాజెక్టులు ప్రారంభోత్సవం శంకుస్థాపన కార్యక్రమాలు.15,592 కోట్లతో అంచనాలతో 61 ప్రాజెక్టుల పనులు ప్రారంభించనున్న అధికారులు.
* భారతీయ జనతా పార్టీలో చేరుతూ కాంగ్రెస్‌పై చేసిన వ్యాఖ్యలు ఖుష్బూ సుందర్‌కు తలనొప్పిగా మారాయి. తన వ్యాఖ్యలపై ఆమె క్షమాపణ చెప్పినప్పటికీ, కొందరు ఆమెపై 50 పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు.
* పలు ఛానెళ్లు టీఆర్‌పీ కుంభకోణానికి పాల్పడటంపై కొనసాగుతున్న వివాదం నేపథ్యంలో బ్రాడ్‌కాస్ట్ ఆడియన్స్ రీసెర్చి కౌన్సెల్ (బార్క్) గురువారం కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని భాషల్లోని వార్తా ఛానెళ్లకు ప్రతివారం ఇచ్చే రేటింగ్‌లను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. మూడు నెలల పాటు రేటింగ్‌లు ఇవ్వబోమని రేటింగ్స్ ఏజెన్సీ ఓ ప్రకటనలో స్పష్టంచేసింది. ప్రస్తుతం ఉన్న ప్రమాణాలను సాంకేతిక కమిటీతో సమీక్షించి వాటిని మరింతగా మెరుగుపరచాలని భావిస్తున్న బార్క్.. 12 వారాల పాటు వీక్లీ రేటింగ్‌లు ఇచ్చే ప్రక్రియను నిలిపివేయనున్నట్టు పేర్కొంది. తప్పుడు టీఆర్‌పీలతో మోసాలకు పాల్పడుతున్నట్టు ఆరోపిస్తూ మూడు ఛానెళ్లపై ముంబయి పోలీసులు కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. రిపబ్లిక్ టీవీ సహా మరో రెండు మరాఠా ఛానళ్లు ఈ మోసాలకు పాల్పడినట్లు ముంబయి పోలీస్ కమిషనర్ పరమ్‌వీర్‌సింగ్ ఇటీవల వెల్లడించారు. ఈ వ్యవహారంలో ఇప్పటివరకు ఆయా ఛానళ్లకు చెందిన ఐదుగురిని అరెస్ట్ చేశారు.
* గత కొన్నేళ్లుగా ప్రభుత్వ నిర్లక్ష్య విధానాలే రాష్ట్రంలోని వరద నష్టాలకు కారణమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. తెలుగు రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ మాట్లాడారని.. ఇక్కడి ప్రజలకు అండగా ఉంటానని ప్రధాని హామీ ఇచ్చినట్లు తెలిపారు. భారీ వర్షాల కారణంగా హైదరాబాద్‌లో దెబ్బతిన్న ప్రాంతాలను గురువారం ఉదయం కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పరిశీలించారు. హిమాయత్‌నగర్‌లోని దత్తానగర్, జనార్దన్‌వాడ, ఖైరతాబాద్‌లోని ఓల్డ్ సీబీఐ క్వాటర్స్, బీజేఆర్, గణేష్‌నగర్‌లో పర్యటించి జరిగిన నష్టంపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఓపెన్ నాలాల్లో తూతూమంత్రంగా పూడిక తీస్తున్నారని.. సాంకేతికతను వినియోగించుకోవడంలో జీహెచ్‌ఎంసీ పూర్తిగా విఫలమైందని విమర్శించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం దృష్టి సారించాలని సూచించారు.
* దేశంలో గడిచిన 24 గంటల్లో 67,708 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 73,07,098కి చేరింది. నిన్న ఒక్క రోజే 680 మంది మరణించగా ఇప్పటివరకు మొత్తం 1,11,266 మంది కరోనాతో మృత్యువాతపడ్డారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం కరోనాపై హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. నిన్న 63,83,442 మంది కోలుకుని ఆసుపత్రులనుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 8,12,390గా ఉంది.
* కరోనా బులెటిన్‌ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఒక్కరోజు వ్యవధిలో 73,767 నమూనాలను పరీక్షించగా 4,038 మందికి కొవిడ్ నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 7,71,503కి చేరింది. 24 గంటల్లో కరోనాతో చికిత్స పొందుతూ 38 మంది మృతిచెందారు. చిత్తూరు జిల్లాలో 9 మంది, ప్రకాశం 7, కృష్ణా 5, తూర్పుగోదావరి 4, గుంటూరు 3, కడప 3, విశాఖపట్నం 3, అనంతపురం, కర్నూలు, విజయనగరం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒకరు చొప్పున మరణించారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనాతో మృతిచెందిన వారి సంఖ్య 6,357కి చేరింది. ఒక్కరోజులో 5,622 మంది కొవిడ్ నుంచి పూర్తిగా కోలుకోగా 40,047 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 68,46,040 నమూనాలను పరీక్షించినట్లు వైద్యఆరోగ్యశాఖ బులెటిన్‌లో పేర్కొంది.
* రాష్ట్రంలో వరద బాధితులకు యుద్ధ ప్రాతిపదికన సహాయ కార్యక్రమాలు చేపట్టాలని తెలంగాణ సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. బాధితులకు అవసరమైన బియ్యం, పప్పు, ఇతర సామగ్రి అందించాలని సూచించారు. భారీ వర్షాలు, వరద ప్రభావంపై సీఎం అత్యవసర ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఆయా శాఖల పరంగా జరిగిన నష్టాన్ని అధికారులు సీఎం కేసీఆర్‌కు వివరించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రభుత్వం తరఫున ప్రతి ఇంటికి ఆహారం, 3 దుప్పట్లు వెంటనే అందించాలని కేసీఆర్ ఆదేశించారు. హైదరాబాద్ పరిధిలో సహాయ కార్యక్రమాల కోసం రూ.5కోట్ల నిధులను తక్షణమే విడుదల చేయాలని ఆయన నిర్ణయించారు. మరోవైపు వరదల వల్ల రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 50 మంది మృతిచెందారని.. మృతుల్లో హైదరాబాద్ పరిధిలో 11 మంది ఉన్నట్లు అధికారులు సీఎంకు వివరించారు. మృతిచెందిన వారి కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని.. ఇల్లు పూర్తిగా కూలిపోయిన వారికి కొత్తగా మంజూరు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతులకు ఆర్థికసాయం అందించాలని సూచించారు.
* బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ నివాసంలో బెంగళూరు పోలీసులు సోదాలు నిర్వహించారు. శాండిల్‌వుడ్‌లో కలకలం రేపిన డ్రగ్స్ కేసులో నిందితుడు ఆదిత్య అల్వా కోసం అతడి బంధువైన వివేక్ ఇంట్లో తనిఖీలు చేపట్టారు. డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆదిత్య అల్వా పరారీలో ఉన్నాడనీ, వివేక్ ఇంట్లో ఉన్నట్టు తమకు అందిన సమాచారం మేరకు సోదాలు చేసినట్టు పోలీసులు పేర్కొన్నారు. కోర్టు వారెంట్ తీసుకున్న తర్వాతే క్రైం బ్రాంచ్ పోలీసులు వివేక్ ఇంటికి వెళ్లారని బెంగళూరు సంయుక్త పోలీస్ కమిషనర్ సందీప్ పాటిల్ వెల్లడించారు.
* * ప్రఖ్యాత శబరిమల యాత్ర కూడా దగ్గర పడుతుండటంతో అక్కడి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇతర రాష్ట్రాల నుంచి ప్రజలు యాత్రకు రానున్న నేపథ్యంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెబుతూ మార్గదర్శకాలు జారీ చేసింది. ఆయా రాష్ట్రాల్లో స్థానిక భాషల్లో ప్రచురిస్తూ అందరికీ తెలియజేయాలని కేరళ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విశ్వాస్ మెహతా కోరారు. ఈ మేరకు ఓ అధికారిక ప్రకటన విడుదల చేశారు.
* పది రోజులుగా వరుస లాభాల్లో దూసుకెళుతున్న దేశీయ మార్కెట్ల జోరుకు బ్రేక్ పడింది. ఐటీ, ఫైనాన్స్ రంగాల్లోని ప్రధాన షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనవ్వడం, అంతర్జాతీయ పరిణామాలు, అక్కడి మార్కెట్ల ప్రభావంతో మన మార్కెట్లు భారీ నష్టాలు చవిచూశాయి. దీంతో సెన్సెక్స్ 1000కి పైగా పాయింట్లు నష్టపోగా.. నిఫ్టీ 11,700 దిగువకు చేరింది.
* ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లేఖ రాశారు. భారీ వర్షాలు, వరదల వల్ల ప్రాథమిక అంచనాల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఐదు వేల కోట్లకు పైగా నష్టం జరిగిందని సీఎం కేసీఆర్ లేఖలో వివరించారు. తక్షణ సహాయ, పునరావాస చర్యల కోసం ₹ 1350 కోట్లు సాయంగా అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కేసీఆర్ కోరారు.
* నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉప ప్రధాని ఈశ్వర్ పోఖ్రియాల్‌ను రక్షణశాఖ బాధ్యతలను నుంచి తప్పించారు. ఆ శాఖను తానే చూసుకుంటున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు బుధవారం జరిగిన కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నారు. ఈశ్వర్ పోఖ్రియాల్‌ను ప్రధాని కార్యాలయానికి అటాచ్ చేశారు. దీంతో ఆయన ఏ శాఖా లేని మంత్రిగా కొనసాగనున్నారు. గతంలో ఈశ్వర్ పోఖ్రియాల్ భారత్‌కు వ్యతిరేకంగా వ్యవహరించారు. తాజా చర్యతో భారత్‌తో సంబంధాలను పునరుద్ధరించుకోవడానికి కేపీ శర్మ ఓలి ఒక ముందడుగు వేసినట్లయింది.
* టీ20 లీగ్‌లో భాగంగా 31వ మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లో కోహ్లీ సారథ్యంలోని బెంగళూరు, రాహుల్ నేతృత్వంలోని పంజాబ్ తలపడనున్నాయి. సమష్టిగా పోరాడుతూ ప్లేఆఫ్ రేసులో బెంగళూరు దూసుకెళుతోంది. మరోవైపు పంజాబ్ మాత్రం పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో కొట్టుమిట్టాడుతోంది. ఆ జట్టు ప్లేఆఫ్‌కు వెళ్లాలంటే మిగిలిన 7 మ్యాచుల్లో అన్నింటా గెలిచి తీరాల్సిందే. ఈ రోజు రాత్రి షార్జా వేదికగా రాత్రి 7.30గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
* దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతున్నప్పటికీ వైరస్ తీవ్రత కాస్త తగ్గుముఖం పట్టినట్లు కనిపిస్తోంది. రోజువారీ కేసులు, మరణాల సంఖ్య గణనీయంగా తగ్గడం, కేసుల సంఖ్య రెట్టింపు కావడానికి ఎక్కువ సమయం పట్టడం ఊరటనిస్తోంది. ఆగస్టు నెలలో కేసుల సంఖ్య రెట్టింపు కావడానికి (డబ్లింగ్) 25రోజుల సమయం పడితే ప్రస్తుతం అది 73రోజులకు చేరుకుందని కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టంచేసింది. స్వల్ప కాలంలోనే 25రోజుల నుంచి 73రోజులకు పెరగడం వైరస్ వ్యాప్తి నియంత్రణకు సూచికగా ప్రభుత్వం భావిస్తోంది.
* దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హాథ్రస్ ఘటనపై గురువారం సుప్రీంకోర్టులో వాదనలు ముగిశాయి. ఇరు పక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బొబ్డే ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. ఈ సందర్భంగా సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ.. హాథ్రస్ బాధిత కుటుంబానికి యూపీ ప్రభుత్వం తగిన భద్రత కల్పించిందని కోర్టుకు తెలిపారు. న్యాయ సహాయ విషయంలో ఇప్పటికే ప్రైవేటు న్యాయవాదులు బాధిత కుటుంబం తరపున ఉన్నారని వివరించారు.
* రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవ్ పల్లిలోని అలీనగర్‌లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది గల్లంతయ్యారు. పల్లె చెరువుకు భారీగా వరదనీరు చేరుతుండటతో దిగువకు నీరు విడుదల చేస్తున్నారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్, రంగారెడ్డి కలెక్టర్ అమయ్ కుమార్, సైబరాబాద్ సీపీ సజ్జనార్ అలీనగర్‌లో పర్యటించి సహాయక చర్యలను పర్యవేక్షించారు.
* నారాయణఖేడ్: సంగారెడ్డి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. నారాయణఖేడ్ మండలం అనంతసాగర్‌లో ఓ వ్యక్తి భార్య తల నరికి అతి కిరాతకంగా హతమార్చాడు. సీఐ రవీందర్‌రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. అనంతసాగర్‌కు చెందిన జుర్రు సాయిలు, అంశమ్మ (35) భార్యాభర్తలు. అంశమ్మకు గత కొంతకాలంగా ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని సాయిలు అనుమానిస్తున్నాడు. ఈ క్రమంలో ఆమెతో అనేకసార్లు గొడవపడ్డాడు. బుధవారం రాత్రి సైతం భార్యతో గొడవపడి ఆమెపై గొడ్డలితో దాడి చేశాడు. కిరాతకంగా శరీరం నుంచి తలను వేరు చేశాడు.