Politics

₹5లక్షలు ప్రకటించిన కేసీఆర్

రాష్ట్రంలో వరద బాధితులకు యుద్ధ ప్రాతిపదికన సహాయ కార్యక్రమాలు చేపట్టాలని తెలంగాణ సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. బాధితులకు అవసరమైన బియ్యం, పప్పు, ఇతర సామగ్రి అందించాలని సూచించారు. భారీ వర్షాలు, వరద ప్రభావంపై సీఎం అత్యవసర ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఆయా శాఖల పరంగా జరిగిన నష్టాన్ని అధికారులు సీఎం కేసీఆర్‌కు వివరించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రభుత్వం తరఫున ప్రతి ఇంటికి ఆహారం, 3 దుప్పట్లు వెంటనే అందించాలని కేసీఆర్‌ ఆదేశించారు. హైదరాబాద్‌ పరిధిలో సహాయ కార్యక్రమాల కోసం రూ.5కోట్ల నిధులను తక్షణమే విడుదల చేయాలని ఆయన నిర్ణయించారు. మరోవైపు వరదల వల్ల రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 50 మంది మృతిచెందారని.. మృతుల్లో హైదరాబాద్‌ పరిధిలో 11 మంది ఉన్నట్లు అధికారులు సీఎంకు వివరించారు. మృతిచెందిన వారి కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని.. ఇల్లు పూర్తిగా కూలిపోయిన వారికి కొత్తగా మంజూరు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతులకు ఆర్థికసాయం అందించాలని సూచించారు.