Sports

తమన్నాకు కోర్టు సమన్లు-CrimeNews-Apr 25 2024

తమన్నాకు కోర్టు సమన్లు-CrimeNews-Apr 25 2024

* ప్రముఖ నటి తమన్నా (Tamannaah)కు మహారాష్ట్ర సైబర్‌ పోలీసు (Maharashtra Cyber Cell) విభాగం సమన్లు జారీ చేసింది. ఐపీఎల్ 2023 మ్యాచ్‌లను అక్రమంగా ‘ఫెయిర్‌ ప్లే’ యాప్‌లో ప్రదర్శించిన కేసులో ఆమెను ప్రశ్నించేందుకు ఈ నోటీసులిచ్చింది. ఈ నెల 29న సైబర్‌ విభాగం ఎదుట విచారణకు హాజరుకావాలని సూచించింది. నిబంధనలకు వ్యతిరేకంగా ఐపీఎల్‌ మ్యాచ్‌లను ఈ యాప్‌లో ప్రసారం చేయడంతో ‘వయాకామ్‌’ మీడియాకు రూ.కోట్ల మేర నష్టం జరిగిందని సైబర్‌ విభాగం వెల్లడించింది. ఇదే కేసులో ఇటీవల మరో నటుడు సంజయ్‌ దత్‌కు కూడా సమన్లు జారీ అయ్యాయి. ఏప్రిల్‌ 23నే విచారణకు రావాలని ఆదేశించగా.. ఆయన గైర్హాజరయ్యారు. ఆ సమయంలో తాను దేశంలో లేనని, వాంగ్మూలం ఇచ్చేందుకు మరో తేదీ కేటాయించాలని కోరారు.

* ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిందితులపై దర్యాప్తు బృందం సైబర్‌ టెర్రరిజం సెక్షన్లు నమోదు చేసింది. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ఐటీ యాక్ట్‌ 66(ఎఫ్‌)ను పోలీసులు ప్రయోగించనున్నారు. దీనిపై పోలీసులు నాంపల్లి కోర్టులో మెమో దాఖలు చేయనున్నారు. ఈ కేసులో అరెస్టయిన మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు, అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న బెయిలు పిటిషన్‌పై వాదనలు బుధవారం పూర్తయ్యాయి. ఇరువర్గాల వాదనలు విన్న నాంపల్లి కోర్టు తీర్పును నేటికి వాయిదా వేసింది. ప్రస్తుతం చంచల్‌గూడ జైల్లో రిమాండులో ఉన్న ప్రణీత్‌రావు, తిరుపతన్న, భుజంగరావు.. తమకు బెయిలు మంజూరు చేయాలంటూ నాంపల్లి కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. న్యాయస్థానం బుధవారం విచారణ చేపట్టగా.. పోలీసుల తరఫున ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ వాదనలు వినిపించారు. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు విచారణ కీలక దశలో ఉన్న సమయంలో నిందితులకు బెయిలు మంజూరు చేస్తే సాక్షుల్ని ప్రభావితం చేస్తారని పేర్కొన్నారు.

* శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో నాలుగు రోజుల క్రితం మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి అనుచరుడి వద్ద భారీగా మద్యం స్వాధీనం చేసుకున్న ఘటన మరువక ముందే తాజాగా పొదలకూరు మండలం విరువూరులో మరో అనుచరుడు చిర్రా రాజగోపాల్‌రెడ్డి రైస్‌మిల్లులో మద్యం నిల్వలను బుధవారం సెబ్‌, పోలీసు అధికారులు సీజ్‌ చేశారు. 54 బాక్సుల్లో ఉన్న 2069 మద్యం సీసాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.4.05 లక్షలు ఉంటుందన్నారు. సెబ్‌ సీఐ వెంకట్రావు కేసు నమోదు చేసి మద్యం సీసాలను పొదలకూరు సెబ్‌ కార్యాలయానికి తరలించారు. రైస్‌ మిల్లు యజమాని సహాయకుడు పసుపులేటి పెంచలయ్యను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. మంత్రి కాకాణి అనుచరులు సర్వేపల్లి నియోజకవర్గంలో పలు చోట్ల భారీగా మద్యం నిల్వ చేశారని అయిదు రోజులుగా విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.

* బిహార్‌ రాజధాని పాట్నాలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. పాట్నా జంక్షన్‌ రైల్వే స్టేషన్‌ సమీపంలోని ఓ హోటల్‌లో గురువారం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఉదయం 11 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. పలువురు గాయపడగా.. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది

* సార్వత్రిక ఎన్నికల వేళ బిహార్‌లో అలజడి రేగింది. ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌కి చెందిన జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ) యువ నాయకుడు దారుణ హత్యకు గురయ్యాడు. పాట్నాలో ఒక కార్యక్రమంలో పాల్గొని తిరిగి వస్తుండగా బుధవారం అర్ధరాత్రి ఆయన్ను దుండగులు కాల్చి చంపారు. బైక్‌లపై వచ్చిన నలుగురు వ్యక్తులు జేడీయూ నేత సౌరభ్ కుమార్ తలపై రెండుసార్లు కాల్చారు. ఆయన వెంట ఉన్న సహచరుడు మున్మున్‌పైనా కాల్పులు జరిపి పరారయ్యారు. నెత్తుటి మడుగులో ఉన్న వారిని వెంటనే ఆసుపత్రికి తరలించగా, సౌరభ్ చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. మున్మున్ పరిస్థితి విషమంగా ఉంది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z