Politics

జేడీ లక్ష్మీనారాయణ హత్యకు కుట్ర?-NewsRoundup-Apr 26 2024

జేడీ లక్ష్మీనారాయణ హత్యకు కుట్ర?-NewsRoundup-Apr 26 2024

* జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు మద్దతుగా సినీనటుడు వరుణ్‌ తేజ్‌ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. పవన్‌ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో శనివారం ప్రచారంలో పాల్గొననున్నారు. ఈ మేరకు జనసేన పార్టీ ప్రకటన విడుదల చేసింది. గొల్లప్రోలు రూరల్‌ మండలం తాటిపర్తిలో మధ్యాహ్నం 3 గంటలకు వరుణ్‌తేజ్‌ ప్రచారం ప్రారంభం కానుంది. వన్నెపూడి మీదుగా కొడవలి, చందుర్తి, దుర్గాడ మీదుగా కొనసాగనుంది.

* గుడివాడ, డోన్‌ వైకాపా అభ్యర్థుల నామినేషన్లను ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్‌ అధికారులు ఆమోదించారు. కృష్ణా జిల్లా గుడివాడ అసెంబ్లీ వైకాపా అభ్యర్థి, మాజీ మంత్రి కొడాలి నాని నామినేషన్‌పై వివాదం ఏర్పడింది. నామినేషన్‌ పత్రాల్లో తప్పుడు సమాచారం చేర్చారంటూ రిటర్నింగ్‌ అధికారి (ఆర్వో)కి తెదేపా నేతలు ఫిర్యాదు చేశారు. మున్సిపల్‌ కార్యాలయాన్ని క్యాంపు కార్యాలయంగా వినియోగించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. భవనాన్ని అద్దెకిచ్చినట్లు అధికారులు పేర్కొన్న పత్రాలను దీనికి జత చేశారు. తప్పుడు సమాచారమిచ్చిన నాని నామినేషన్‌ను తిరస్కరించాలని కోరారు. కొడాలి నామినేషన్‌పై సాయంత్రం వరకు ఉత్కంఠ నెలకొంది. చివరికి, నామినేషన్‌ను ఆమోదించినట్టు ఆర్వో తెలపడంతో వైకాపా నేతలు ఊపిరిపీల్చుకున్నారు.

* జైభారత్‌ నేషనల్‌ పార్టీ అధ్యక్షుడు, సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ సంచలన ఆరోపణలు చేశారు. తనను చంపేందుకు విశాఖపట్నంలో కుట్ర జరుగుతోందన్నారు. ఈ మేరకు శుక్రవారం విశాఖ సీపీని కలిసి ఫిర్యాదు చేశారు. తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని కోరారు. లక్ష్మీనారాయణ జైభారత్‌ నేషనల్‌ పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే. విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసేందుకు లక్ష్మీనారాయణ నామినేషన్‌ దాఖలు చేశారు. ఆయన పార్టీకి పార్లమెంట్‌, అసెంబ్లీ నియోజకవర్గాల కామన్‌ సింబల్‌గా టార్చిలైట్‌ గుర్తును కేటాయిస్తూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది.

* భారత్‌ (India)తో దౌత్య విభేదాల వేళ మాల్దీవులు (Maldives) చైనా (China)కు దగ్గరవుతోంది. ఇటీవల డ్రాగన్‌ పరిశోధక నౌక (research ship) ఒకటి కొన్నిరోజుల పాటు ఈ దీవుల జలాల్లో ఉన్న విషయం తెలిసిందే. తాజాగా ఆ నౌక మరోసారి మాల్దీవుల జలాల్లోకి ప్రవేశించడం చర్చనీయాంశంగా మారింది. చైనాకు చెందిన పరిశోధక నౌక ‘షియాంగ్‌ యాంగ్‌ హాంగ్‌-03’ గురువారం ఉదయం తిలాఫుషీ ఇండస్ట్రియల్‌ హార్బర్‌లో లంగరేసినట్లు స్థానిక మీడియా కథనాలు తాజాగా వెల్లడించాయి. అయితే, ఈ నౌక ఎందుకు తిరిగొచ్చిందన్న విషయాన్ని ముయిజ్జు సర్కారు వెల్లడించలేదు.

* సమాజ్‌వాదీ పార్టీ చీఫ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్‌ యాదవ్‌ (Akhilesh Yadav) తన పేరిట ఉన్న ఆస్తుల్ని ప్రకటించారు. ప్రస్తుతం కన్నౌజ్‌ నియోజవర్గం నుంచి పోటీ చేస్తోన్న ఆయనకు రూ.26.34 కోట్ల ఆస్తిపాస్తులున్నాయి. ఆయన సతీమణి, మైన్‌పురీ అభ్యర్థి డింపుల్ యాదవ్ (Dimple Yadav) ఆస్తుల మొత్తం రూ.15 కోట్లుగా ఉంది. మొత్తంగా వారిద్దరి సంపద విలువ రూ.41 కోట్లని నామినేషన్ పత్రాల్లో పేర్కొన్నారు. అఖిలేశ్‌.. చరాస్తులు రూ.9.12 కోట్లు కాగా, స్థిరాస్తులు రూ.17.22 కోట్లుగా ఉన్నాయి. రూ.25.61 లక్షలు నగదు రూపంలో ఉందని, రూ.5.41 కోట్లు బ్యాంక్‌లో ఉందని పేర్కొన్నారు. ఇక ఆయన ఐదు సంవత్సరాల వార్షిక సగటు ఆదాయం రూ.87 లక్షలు కాగా.. డింపుల్‌ ఆదాయం రూ.65 లక్షలుగా ఉంది. ఈ వివరాల్లో ఒక ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. మాజీ సీఎం తన భార్యకు రూ.54 లక్షలు అప్పుగా ఇచ్చారట.

* సోషల్‌మీడియాలో పాపులర్‌ అయ్యేందుకు కొందరు చేసే విన్యాసాలు విమర్శల పాలవుతుంటాయి. పైగా కొత్త చిక్కులు తెచ్చి పెడుతుంటాయి. ఇంకాస్త తేడా జరిగితే కటకటాలే తరువాయి. తాజాగా అలాంటి ఘటనే జరిగింది. నెట్టింట పాపులర్‌గా మారేందుకు ఓ జంట చేసిన పని చివరకు వారు జైలు పాలయ్యేలా చేసింది. స్పైడర్‌ మ్యాన్ దుస్తుల్లో ఆదిత్య (20), స్పైడర్ ఉమెన్ వేషధారణలో అంజలి(16) మోటార్‌ సైకిల్‌పై దిల్లీ వీధుల్లో చక్కర్లు కొట్టారు. బైక్‌ని వదిలేసి విన్యాసాలు చేస్తూ రీల్స్‌ రూపొందించారు. దాన్ని ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పంచుకున్నారు. అంతే ఆ వీడియో కాస్తా వైరల్‌గా మారి చివరకు పోలీసుల కంట పడింది. అద్దాలు, నంబర్‌ ప్లేట్‌ లేని బైక్‌పై హెల్మెట్ ధరించకుండా వీరిద్దరూ ప్రయాణించడం వీడియోలో స్పష్టంగా కనిపించింది. దీన్ని గుర్తించిన పోలీసులు ట్రాఫిక్‌ నిబంధనలను ఉల్లంఘించిన కారణంగా ఇద్దరినీ శుక్రవారం అరెస్టు చేశారు.

* రైతులకు మద్దతు ధర ఇప్పించే బాధ్యతను కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ హామీ ఇచ్చారు. కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం పరిధిలోని మలికిపురంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారసభలో ఆయన ప్రసంగించారు. జగన్‌పై చిన్న గులకరాయి పడితేనే యువకుడిపై కేసు పెట్టారని, దళితుడిని చంపి మృతదేహాన్ని డోర్‌ డెలివరీ చేసిన అనంతబాబుపై మాత్రం చర్యలు లేవని మండిపడ్డారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా మార్పు కనిపిస్తోందని, వైకాపాను ఇంటికి పంపించే సమయం ఆసన్నమైందన్నారు. సమస్యలు పరిష్కరించేందుకు సమయం ఇవ్వండి, ఫొటోల కోసం పోటీ పడొద్దు.. క్షేత్రస్థాయిలో పర్యటించకుండా అడ్డుపడొద్దు అంటూ అభిమానులకు విజ్ఞప్తి చేశారు.

* సార్వత్రిక సమరంలో (Lok Sabha elections) రెండో విడత ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతున్న వేళ జేడీఎస్‌ నేత, మాజీ సీఎం కుమారస్వామి (Kumaraswamy) కాంగ్రెస్‌ (Congress)పై ఆరోపణలు చేశారు. బెంగళూరు రూరల్‌ లోక్‌సభ నియోజకవర్గంలోని కనకపుర తాలుకాలో ఓటర్లకు కాంగ్రెస్‌ నగదు, గిఫ్ట్‌ ఓచర్లు పంపిణీ చేస్తూ ప్రలోభాలకు గురిచేస్తోందన్నారు. ఇక్కడ ‘హస్తం’ పార్టీ నుంచి కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ సోదరుడు డీకే సురేష్‌ పోటీ చేస్తుండగా.. భాజపా టిక్కెట్‌పై జేడీఎస్‌ వ్యవస్థాపకుడు, మాజీ ప్రధాని దేవెగౌడ అల్లుడు డా.సీఎన్‌ మంజునాథ్‌ బరిలో నిలిచిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సీటు నుంచి మూడు పర్యాయాలు గెలిచిన సురేష్‌.. తనకు నాలుగోసారి అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు. కనకపుర తాలుకాలో భాజపా, జేడీఎస్‌ మద్దతుదారులపై కాంగ్రెస్‌ శ్రేణులు దాడులు చేసి చొక్కాలు చింపేశారని ఆరోపించారు. రూ.10వేలు వరకు కొనుగోలు చేసుకోగలిగేలా గిఫ్ట్‌ ఓచర్లు పంపిణీ చేస్తుండటంతో అదేంటని ప్రశ్నిస్తే దాడులకు తెగబడ్డారని కుమారస్వామి ఆరోపించారు. దీనిపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదన్నారు.

* లోక్‌సభ ఎన్నికల్లో (Lok Sabha Elections) భాగంగా పోలింగ్‌ శాతాన్ని పెంచేందుకు ఎన్నికల సంఘంతోపాటు ఇతర సంస్థలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందుకోసం వివిధ భాగస్వామ్య పక్షాలతో కలిసి అనేక కార్యక్రమాలు చేపడుతున్నాయి. ఈ క్రమంలో బెంగళూరులోని వివిధ హోటళ్లు ఇందుకు శ్రీకారం చుట్టాయి. ఓటు వేసి వచ్చినవారికి దోశ, లడ్డు, కాఫీతో పాటు ఇతర ఆహార పదార్థాలను ఉచితంగా లేదా సబ్సిడీ రూపంలో అందజేశాయి. దీంతో పలు రెస్టారంట్ల వద్ద భారీ సంఖ్యలో జనం క్యూ కట్టిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. బెంగళూరు నగరంలో పోలింగ్‌ శాతాన్ని పెంచే ఉద్దేశంతో బృహత్‌ బెంగళూరు హోటల్స్‌ అసోసియేషన్‌ (బీబీహెచ్‌ఏ)కు అనుబంధంగా ఉన్న పలు రెస్టారంట్లు తమవంతు ప్రయత్నం చేయాలని భావించాయి. ఇందులోభాగంగా ఓటు వేసి వచ్చినవారికి ఉచితంగా ఆహార పదార్థాలు అందించగా.. మరికొన్ని మాత్రం బిల్లులో డిస్కౌంట్‌ ఇచ్చాయి. నృపతుంగా రోడ్డులో ఉన్న నిసర్గ గ్రాండ్‌ హోటల్‌.. ఓటు వేసి వచ్చినవారికి బటర్‌ దోశ, లడ్డూ, జ్యూస్‌ వంటివి ఉచితంగా అందించింది. ‘ఓటు వేయండి-ఫుడ్‌ తినండి’ అనే నినాదంతో వీటిని అందించింది. దీంతో ఉదయం నుంచే అనేకమంది ఓటర్లు హోటల్‌ ముందు బారులు తీరారు. దాదాపు 2వేల మందికి వీటిని ఫ్రీగా అందించారట.

* ఎన్నికల వేళ వైకాపాకు మరో షాక్‌ తగిలింది. దళిత వర్గానికి చెందిన సీనియర్‌ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్‌ ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. వైకాపా క్రియాశీలక సభ్యత్వంతో పాటు గుంటూరు జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. దీనికి సంబంధించిన లేఖను సీఎం జగన్‌కు పంపారు. డొక్కా మాణిక్య వరప్రసాద్‌ తాడికొండ టికెట్‌ను ఆశించారు. అక్కడ మాజీ మంత్రి మేకతోటి సుచరితకు వైకాపా అవకాశం కల్పించింది. దీంతో గతకొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్న డొక్కా.. నేడు రాజీనామా చేశారు.

* రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖడ్‌ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. ప్రమాణ స్వీకారం చేసిన వారిలో దేవేంద్ర ప్రతాప్‌ సింగ్‌ (ఛత్తీస్‌గఢ్‌), తేజ్‌వీర్‌ సింగ్‌ (ఉత్తర్‌ప్రదేశ్‌), మహేంద్ర భట్‌ (ఉత్తరాఖండ్‌) ఉన్నారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z