Politics

మళ్లీ మోడీనే ప్రధాని-NewsRoundup-May 05 2024

మళ్లీ మోడీనే ప్రధాని-NewsRoundup-May 05 2024

* తెలంగాణలో ఎప్పుడు అసెంబ్లీ ఎన్నికలు వచ్చినా భారాస ప్రభుత్వమే వస్తుందని ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ అన్నారు. కరీంనగర్‌ ఎంపీ అభ్యర్థి వినోద్‌కు మద్దతుగా వీణవంకలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో కేసీఆర్‌ ప్రసంగించారు. ‘‘అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తాత్కాలికమే. రాజకీయాల్లో ఉన్నవారికి గెలుపోటములు సహజం. గెలిస్తేనే లెక్క అనుకోవద్దు. గెలిచినా, ఓడినా ప్రజల కోసం పనిచేస్తూనే ఉండాలి. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణకు పేరు వచ్చే విధంగా కష్టపడ్డాను. రాష్ట్రానికి పరిశ్రమలు తెచ్చేందుకు ఎంతో కృషి చేశాం. కానీ, కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత హైదరాబాద్‌ నుంచి అనేక పరిశ్రమలు వెళ్లిపోవాలని యోచిస్తున్నాయి. రాష్ట్రంలో రూ.వెయ్యి కోట్లు పెట్టుబడి పెట్టే కంపెనీ ఒకటి తమిళనాడుకు వెళ్లి పోయింది. అల్యూమినియం, ప్లాస్టిక్‌ తయారీ పరిశ్రమలకు విద్యుత్‌ కోతలు విధిస్తున్నారు. దీంతో ఆ కంపెనీలు తెలంగాణ నుంచి వెళ్లిపోవాలనుకుంటున్నాయని మీడియాలో వార్తలు చూస్తుంటే బాధేస్తోంది. నాలుగైదు నెలల్లోనే ఇలా చేశారని దుఃఖం కలుగుతోంది. 2001లో తెలంగాణ జెండా ఎత్తిన రోజు పెద్ద పెద్ద నాయకులు లేకపోయినా ఎక్కువ మంది జడ్పీటీసీలు, ఎంపీపీలను గెలిపించిన గడ్డ హుజూరాబాద్‌. దాని ఫలితమే మనకు తెలంగాణ వచ్చింది. తెలంగాణ ఉద్యమం అయిపోలేదు.. ఇంకా ఉంది. తెలంగాణ పునర్నిర్మాణ ప్రక్రియ ముందుకు సాగాల్సిన అవసరముంది. నాలుగైదు నెలల్లోనే ఈ ప్రభుత్వం ప్రజల్లో నమ్మకం కోల్పోయింది’’ అని కేసీఆర్‌ విమర్శించారు.

* ఐపీఎల్ 17వ సీజన్‌లో ప్లేఆఫ్స్‌ బెర్తు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తోన్న చెన్నైకి (Chennai Super Kings) వరుసగా షాక్‌లు తగులుతున్నాయి. బోర్డు పిలుపు మేరకు ఇప్పటికే స్వదేశానికి వెళ్లిన ముస్తాఫిజుర్‌ సేవలను సీఎస్కే కోల్పోయిన సంగతి తెలిసిందే. సీనియర్‌ ఆటగాడు దీపక్ చాహర్‌ గాయంతో ఇబ్బంది పడుతున్నాడు. గత మ్యాచ్‌లో కేవలం రెండు బంతులు మాత్రమే వేసి మైదానాన్ని వీడాడు. తాజాగా మరో యువ పేసర్‌ పతిరన (Pathirana) బౌలింగ్‌ను కూడా మిస్‌ కానుంది. తొడ కండరాలు పట్టేయడంతో నాలుగు రోజుల కిందట పంజాబ్‌తో మ్యాచ్‌కు దూరమైన అతడు వీసా పనుల నిమిత్తం శ్రీలంకకు వెళ్లి వచ్చాడు. గాయం తిరగబెట్టడంతో కోలుకునేందుకు సమయం పట్టే అవకాశం ఉంది. అతడు మళ్లీ స్వదేశానికి పయనమైనట్లు చెన్నై మేనేజ్‌మెంట్ వెల్లడించింది. అయితే, కోలుకున్నాక వస్తాడా? లేదా? అనేది మాత్రం తెలియజేయలేదు. ‘పతిరన త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాం’’ అని మాత్రమే సీఎస్కే ప్రకటన చేసింది.

* ఏపీ మంత్రి, సత్తెనపల్లి వైకాపా అభ్యర్థి అంబటి రాంబాబు(Ambati Rambabu)కు ఓటు వేస్తే పవిత్రమైన ఎమ్మెల్యే పదవి అపవిత్రమవుతుందని ఆయన రెండో అల్లుడు గౌతమ్‌ అన్నారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యుడిగా పని చేస్తున్న గౌతమ్‌.. అంబటి అరాచకాలను వివరిస్తూ విడుదల చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. ‘‘అంబటి రాంబాబుకి అల్లుడిని కావడం నా దురదృష్టం. అతనికి వ్యక్తిత్వం లేదు. శవాలమీద పేలాలు ఏరుకునే రకం. రోజూ దేవుడికి దండం పెట్టుకునేటప్పుడు.. ఇంకెప్పుడూ ఇలాంటి వ్యక్తి నా జీవితంలో ఎదురు కాకూడదని కోరుకుంటా. అంత భయంకరమైన వ్యక్తి. ఈ విషయం ఇప్పుడే ఎందుకు చెబుతున్నానంటే.. అతను పోటీ చేయబోతున్న పదవి అలాంటిది. ఎమ్మెల్యే అంటే.. మంచితనం, మానవతా విలువలు, కనీస బాధ్యత ఉండాలి. వంద శాతం లేకపోయినా కనీసం వాటిలో 0.001 శాతం కూడా లేని వ్యక్తి రాంబాబు. ఇలాంటి వ్యక్తికి ఓటేస్తే మనకు తెలియకుండానే చెడును ప్రోత్సహిస్తున్నట్టు. ఎవరైతే నిస్సిగ్గుగా.. పెద్ద గొంతేసుకుని అరిచి అబద్ధాన్ని నిజం చేయొచ్చనే భ్రమలో బతుకుతారో అలాంటి వాళ్లకు ఓటేస్తున్నట్టు లెక్క. ఎంత నీచమైన పనులు చేసినా సమాజంలో హుందాగా బతకవచ్చని అనుకునే వాళ్లను ప్రోత్సహించినట్టే అవుతుంది. అంబటి లాంటి వారిని ఎన్నుకుంటే రేపటి సమాజం కూడా ఇలాగే తయారవుతుంది. ప్రజలు గమనించి సరైన బాధ్యతతో ఓటు వేసి మంచి నాయకుడిని ఎన్నుకోవాలి’’ అని గౌతమ్‌ సూచించారు.

* ‘దేశంలో రాబోయేది ఎన్డీయేనే.. మళ్లీ ప్రధాని అయ్యేది మోదీనే’ అని తెదేపా (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu) అన్నారు. రాష్ట్రంలో ధర్మాన్ని గెలిపించేందుకు అందరూ సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో కూటమి అభ్యర్థి సత్యకుమార్‌కు మద్దతుగా నిర్వహించిన సభలో కేంద్రమంత్రి అమిత్‌షాతో కలిసి ఆయన పాల్గొన్నారు.

* పోస్టల్‌ బ్యాలెట్ల పోలింగ్‌ ప్రక్రియలో ఏర్పడిన గందరగోళం, అయోమయ పరిస్థితులు పోలింగ్‌ అధికారులను కూడా ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. మే 13న పోలింగ్‌ విధుల్లో పాల్గొనాల్సిన అధికారులు.. తమకే ఓటు లేకుండా చేయడంపై తీవ్రంగా స్పందిస్తున్నారు. ఇంత గందరగోళ పరిస్థితులు తామెన్నడూ చూడలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

* భాజపా మళ్లీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తుందని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ విమర్శించారు. నిర్మల్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. ‘‘పేదల హక్కులను హరించి.. ధనికులకు ప్రయోజనం చేకూర్చడమే భాజపా లక్ష్యం. రైతులకు రుణమాఫీ చేస్తామంటే మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు’’ అని రాహుల్‌ అన్నారు.

* యాపిల్‌ వాచ్‌ (Apple watch) ఓ మహిళ జీవితాన్ని కాపాడింది. అందులోని పల్స్‌ రేట్‌ ఫీచర్‌ ఆధారంగా అలర్ట్‌ అయిన ఆమె సరైన సమయంలో ఆసుపత్రికి వెళ్లి ప్రాణాలు దక్కించుకుంది. దీనికి సంబంధించిన వివరాలను ఓ ఆంగ్ల మీడియాతో పంచుకున్నారు. దీనిపై యాపిల్‌ సీఈఓ కూడా స్పందించడం విశేషం.

* నూతన ఆవిష్కరణలకు కేంద్రంగా భావించే అమెరికాలోని సిలికాన్‌ వ్యాలీలో జరిగే అత్యధిక ఇన్నోవేషన్లకు భారతీయులే నాయకులని ‘సిలికాన్‌ వ్యాలీ సెంట్రల్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌’ సీఈఓ హర్బీర్‌ కె భాటియా తెలిపారు. ఇండియన్స్‌ లేకుండా అగ్రరాజ్య టెక్‌ పరిశ్రమ మనుగడ సాగించలేదని పేర్కొన్నారు.

* ఆంధ్రప్రదేశ్‌లో గూండాగిరీని అంతం చేసేందుకే తెదేపా(TDP), జనసేన (Janasena)తో కలిసి కూటమిగా ఏర్పడ్డామని భాజపా(BJP) అగ్రనేత, కేంద్రమంత్రి అమిత్‌షా (Amit Shah) అన్నారు. అవినీతి వైకాపా ప్రభుత్వాన్ని గద్దె దించుతామని చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో భాజపా అభ్యర్థి సత్యకుమార్‌కు మద్దతుగా నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు.

* ప్రస్తుతం పాఠశాలలో చిన్నారులపై ఉపాధ్యాయులు చేయి చేసుకోవడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాం. కానీ, కొన్నేళ్ల క్రితం విద్యనభ్యసించిన వారికి మాత్రం ఇది సాధారణం. ఈ తరహా శిక్ష భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్‌ (CJI Justice Chandrachud) కూడా ఎదురైందట. తాను కూడా చిన్నప్పుడు పాఠశాలలో బెత్తం దెబ్బలు తిన్నారట.

* వచ్చే వారం రోజుల్లో ప్రైమరీ మార్కెట్‌లో మళ్లీ సందడి నెలకొననుంది. మొత్తం మూడు కంపెనీలు ఐపీఓకి (IPO) రానున్నాయి. బ్లాక్‌స్టోన్‌ మద్దతున్న ఆధార్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌, ఆరోగ్య సంరక్షణ కంపెనీ ఇండెజీన్‌, ట్రావెల్‌ డిస్ట్రిబ్యూషన్‌ సంస్థ టీబీఓ టెక్‌ పబ్లిక్‌ ఇష్యూకు వస్తున్నాయి.

* అనకాపల్లి లోక్‌సభ ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్‌పై దాడిని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఖండించారు. డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడి తీరు దొంగే.. దొంగ.. దొంగ అని అరిచినట్లు ఉందని వ్యాఖ్యానించారు. ఓటమి భయంతోనే ముత్యాలనాయుడు, ఆయన అనుచరులు ప్రత్యర్థులపై దాడులకు దిగుతున్నారని విమర్శించారు. ఎంవీపీ కాలనీలోని తన నివాసంలో గంటా శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు.

* నటి, ఏపీ మంత్రి రోజా (Roja) ఇటీవల తనపై చేసిన కామెంట్లపై కమెడియన్‌ గెటప్‌ శ్రీను (Getup Srinu) స్పందించారు. తాను ప్రధాన పాత్ర పోషించిన ‘రాజు యాదవ్‌’ (Raju Yadhav) సినిమా ట్రైలర్‌ విడుదల కార్యక్రమంలో పలు ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. ‘‘మెగా ఫ్యామిలీతో ఎన్ని సినిమాలు చేశానో మీకు తెలుసు. వెంకటేశ్‌, ఎన్టీఆర్‌, నానిలతోనూ నేను కలిసి నటించా. ఇతర హీరోల చిత్రాల్లో నాకు ఆఫర్లు రావట్లేదా?’’ అని అన్నారు.

* మాజీ ప్రధానమంత్రి హెచ్‌డీ దేవెగౌడ మనవడు, ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణ వందల మంది మహిళలపై అఘాయిత్యానికి పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో వేధింపులకు గురైన బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని అందిస్తుందని కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది. బెళగావిలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో కాంగ్రెస్ జనరల్‌ సెక్రటరీ, ఆ రాష్ట్ర ఇంఛార్జ్‌ రణ్‌దీప్‌ సుర్జేవాలా ఈ విషయాన్ని వెల్లడించారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ల సమక్షంలో ఈ ప్రకటన చేశారు. ‘బాధితులు వందల సంఖ్యలో ఉన్నారు. వారికి ఆర్థిక సహాయం అందించాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నిర్ణయించారు. ఇది భిన్నమైన కేసు. గడిచిన 75ఏళ్లలో ఇటువంటి ఘటన ఎన్నడూ జరగలేదు’ అని సుర్జేవాలా వెల్లడించారు. నిందితులపై సరైన చర్యలు తీసుకోవాలని రాహుల్‌ గాంధీ కూడా డిమాండ్‌ చేశారన్నారు. భాజపా కూటమిలో జేడీఎస్‌ ఉన్నందున.. వారిని రక్షించేందుకు ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాలు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రజ్వల్‌కు సంబంధించిన సమాచారం ఉన్నప్పటికీ ఆ పార్టీతో ఎందుకు పొత్తు పెట్టుకున్నారని భాజపాను ప్రశ్నించారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z