Editorials

భారత వాయుసేన అరుదైన ఘనత-NewsRoundup-May 23 2024

భారత వాయుసేన అరుదైన ఘనత-NewsRoundup-May 23 2024

* లైంగిక దౌర్జన్యం కేసు ఎదుర్కొంటున్న హసన ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణ ఆచూకీ ఇంకా తెలియడం లేదు. విదేశాల్లో ఉన్న ఆయనను రప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుండగా.. ఆయన కుటుంబీకుల నుంచి వరుస విజ్ఞప్తులు వస్తున్నాయి. ఈ క్రమంలో మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ మరోసారి స్పందించారు. ఎక్కడున్నా తక్షణమే వచ్చి పోలీసుల ముందు లొంగిపోవాలని, తన సహనాన్ని పరీక్షించొద్దని, లేదంటే తన ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందని ప్రజ్వల్‌ను హెచ్చరిస్తూ ఎక్స్‌లో సుదీర్ఘ లేఖ పోస్టు చేశారు.

* సార్వత్రిక ఎన్నికల్లో భాజపా 300లకు పైగా సీట్లు సాధిస్తుందని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత కిశోర్ (Prashant Kishor) అంచనా వేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన చేసిన పోస్టులో తన అంచనాల్లో ఎలాంటి మార్పు ఉండదనే ఉద్దేశం కనిపించింది. అలాగే నిరాశలో కూరుకుపోయిన వారికి ఒక సలహా ఇచ్చారు. ‘‘జూన్‌ 4న మీ గొంతు తడారిపోకుండా నీళ్లు దగ్గర పెట్టుకోండి’’ అని ఎద్దేవా చేశారు. ఆరోజున సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి.

* పోలింగ్‌ రోజు ఈవీఎంను ధ్వంసం చేసిన కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న మాచర్ల (Macherla) ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (Pinnelli Ramakrishna Reddy)హైకోర్టును ఆశ్రయించారు. పల్నాడు (Palnadu) జిల్లా మాచర్ల నియోజకవర్గం పరిధిలోని పాల్వాయిగేటు పోలింగ్‌ కేంద్రంలో ఈవీఎంను ధ్వంసం చేసిన ఘటనను ఈసీ సీరియస్‌గా తీసుకుంది. వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు. ఈ నేపథ్యంలో పిన్నెల్లి.. ముందస్తు బెయిల్‌ ఇవ్వాలని కోరుతూ హైకోర్టులో లంచ్‌మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. కాసేపట్లో ఈ పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టనుంది.

* పోలింగ్‌ రోజు ఈవీఎంలు పగలగొట్టి, హింసకు దిగి ఆ తర్వాత పరారైన మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై సామాజిక మాధ్యమాల్లో ట్రోల్స్‌ పేలుతున్నాయి. ‘నేను నేరుగా చెబుతున్నాను.. నాకు మాచర్లకు రావాలంటే 2 గంటలు అన్నోడు 2 కార్లు మార్చి ఎందుకు పారిపోయాడు..?’ అని ఎద్దేవా చేస్తున్నారు. ‘పులిరా.. పులిరా పెద్ద పులిరా.. ఈవీఎంలు పగలగొట్టి పారిపోయేరా..’ అని వ్యంగాస్త్రాలు విసురుతున్నారు. ‘జూన్‌ 4 వరకు ఎలా కాలక్షేపం అవుతుందా అనుకున్నాం. తస్సాదియ్యా ఏం కథ మొదలు పెట్టిర్రుపో’ అంటూ పిన్నెల్లి ఎపిసోడ్‌లపై జోకులు వేసుకుంటున్నారు. కొన్ని మీమ్స్‌లో రాష్ట్ర పరిస్థితులనూ వివరిస్తూ పిన్నెల్లిపై చురకలు వేస్తున్నారు.

* చుట్టూ అడవి.. ఒక వందమంది వరకు ఉంటారు.. అందరి కళ్లలో దైన్యం.. ఆకలి తీర్చుకోవడం కోసం పుట్టిన గడ్డను వదిలి అమెరికాలో ఏదైనా ఉపాధి దొరుకుతుందన్న ఆశతో అన్నింటికీ తెగించి అక్రమ మార్గాల్లో వెళ్లేందుకు నడుస్తున్నారు. వీరిలో మహిళలుంటే అత్యంత తీవ్రమైన సమస్య పొంచి ఉంటుంది. దారిలో డ్రగ్స్‌ ముఠాలు వీరిపై పడి అత్యాచారాలకు పాల్పడుతుంటాయి. వీరిని ఎదిరించే ధైర్యం ఎవరికీ ఉండదు. ఎదిరిస్తే ప్రాణాలు తీసేస్తారు. అందుకనే మానవ రవాణా స్మగ్లర్ల సూచన మేరకు ప్రతి మహిళ కచ్చితంగా గర్భ నిరోధకాలను వెంట తీసుకెళ్లాల్సిన పరిస్థితి. కనీసం గర్భం దాల్చకుండా ఉంటామన్న ఆశ. అలాంటి దుర్భర పరిస్థితుల్లో మహిళలు భీతావహమైన దారిలో ప్రయాణం సాగిస్తుంటారు. కొలంబియా, పనామాకు మధ్యలో అటవీ ప్రాంతం ఉంటుంది. దీన్నే డేరియన్‌ గ్యాప్‌ అంటారు. కొలంబియాలో ఈ ప్రాంతం మాదక ద్రవ్యాల ముఠాల అధీనంలో ఉంటుంది. మనిషికి ఇంత అని డబ్బు తీసుకొని ఇక్కడికి పంపిస్తారు. కేవలం డేరియన్‌లోనే కాదు అమెరికా సరిహద్దు దేశమైన మెక్సికోకు చేరుకునే వరకు మహిళలకు ఎటువంటి రక్షణ ఉండదు. వీరిని తీసుకువెళ్లే గైడ్లు.. మహిళల సంచుల్లో కండోమ్‌ ప్యాకెట్లు ఉంచుతారు. రౌడీమూకలు అడ్డగిస్తే ఏ మాత్రం ప్రతిఘటించకుండా లొంగిపొమ్మని కోరతారు.

* పోలింగ్‌ రోజు జరిగిన హింసాత్మక ఘటనలకు బాధ్యుడిని చేస్తూ సీఎస్‌ జవహర్‌రెడ్డిని ఆ పదవి నుంచి తొలగించాలని తెదేపా సీనియర్‌ నేత కనకమేడల రవీంద్రకుమార్‌ డిమాండ్‌ చేశారు. హింసాత్మక ఘటనలపై చర్యలు చేపట్టడంలో సీఎస్‌ పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. సీఎస్‌ను తొలగించకపోతే కౌంటింగ్‌ ప్రక్రియపై ప్రభావం పడే అవకాశం ఉందన్నారు. వైకాపాకు అనుకూలంగా వ్యవహరించే పోలీసులపై ఈసీ విచారణకు ఆదేశించాలని కోరారు.

* మహారాష్ట్రలోని ఠానేలో ఓ రసాయన పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా.. 56 మందికి గాయాలయ్యాయి. డోంబివిలి ఎంఐడీసీ ఫేజ్‌ -2 ప్రాంతంలోని అముదాన్‌ కెమికల్‌ కంపెనీలో ఈ మధ్యాహ్నం 1.40 గంటల సమయంలో రియాక్టర్‌ పేలడంతో ఈ విషాదం చోటుచేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటివరకు ఈ ఘటనలో ఐదు మృతదేహాలను గుర్తించినట్లు తహశీల్దార్‌ సచిన్‌ షెజల్‌ తెలిపారు. ఈ పేలుడు కారణంగా పెద్దఎత్తున చెలరేగిన మంటల ప్రభావం ఆ ప్రాంతంలో కనీసం ఐదు కంపెనీలపై పడినట్లు తెలిపారు. ఈ పేలుడు ధాటికి దాదాపు కి.మీ. మేర శబ్దం వినిపించినట్లు ప్రత్యక్షసాక్షి చెప్పారు. పక్కనే ఉన్న భవనాల అద్దాలకు పగుళ్లు రాగా.. పరిసరాల్లోని పలు ఇళ్లు సైతం దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు.

* ఓటు బ్యాంకు పోతుందన్న భయంతోనే కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్‌ అయోధ్య రామమందిరాన్ని దర్శించలేదని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా విమర్శించారు. ఈ ఎన్నికల్లో భాజపా 310 కంటే ఎక్కువ స్థానాలను గెలుచుకుంటుందని, కాంగ్రెస్‌ మాత్రం 40 సీట్లకే పరిమితమవుతుందని అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉత్తర్‌ప్రదేశ్‌లోని అంబేడ్కర్‌ నగర్‌, దోమరియాగంజ్‌, సంత్‌ కబీర్‌ నగర్‌ లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో నిర్వహించిన బహిరంగ సభల్లో ఆయన ప్రసంగించారు. ప్రధానంగా కాంగ్రెస్‌, సమాజ్‌వాదీ పార్టీలపై విమర్శనాస్త్రాలు సంధించారు. ఇప్పటివరకు జరిగిన 5 విడతల పోలింగ్‌ సరళిని పరిశీలిస్తే.. కాంగ్రెస్‌ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయినట్లు అర్థమవుతోందని వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష పార్టీలు బంధుప్రీతి రాజకీయాలు చేస్తున్నాయని, ఇకపై అవి మనుగడ సాగించలేవని అన్నారు.

* సీఎం రేవంత్‌రెడ్డికి రైతులకంటే ఎన్నికలే ముఖ్యంగా మారాయని కేంద్ర మంత్రి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి విమర్శించారు. ఐకేపీ కేంద్రాల్లో కనీస సౌకర్యాలు లేవని, 45 రోజులుగా ధాన్యం వస్తున్నా.. కొనుగోలు ప్రక్రియ వేగంగా జరగడం లేదని ఆరోపించారు. భువనగిరి నియోజకవర్గం బీబీనగర్ మండలంలోని రాఘవపూర్, రుద్రవెల్లి గ్రామాల్లోని ఐకేపీ కొనుగోలు కేంద్రాలను కేంద్రమంత్రి గురువారం సందర్శించారు. కొనుగోళ్ల తీరుతోపాటు పీఏసీఎస్‌ కేంద్రంలో ధాన్యం కుప్పలను పరిశీలించారు. కొనుగోలు ఆలస్యం కావడానికి గల కారణాలను నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రక్రియ నత్తనడకన సాగుతుండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

* సార్వత్రిక ఎన్నికల సమరం ముగింపు దశకు చేరుకుంటున్న తరుణంలో ప్రధాని మోదీ (Modi) విస్తృతంగా ప్రచారంలో పాల్గొంటున్నారు. విపక్ష ‘ఇండియా’ నేతలపై విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా ఆయన హరియాణాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు.

* పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పరారీ పోలీసుల అసమర్థతకు నిదర్శనమని తెదేపా నేత ప్రత్తిపాటి పుల్లారావు విమర్శించారు. నిందితులకే పోలీసులు పహారా కాస్తారని మరోసారి నిరూపించారన్నారు. వివేకా హత్య కేసు నిందితుడు అవినాష్‌ను ఇలానే దగ్గరుండి కాపాడారని ఆరోపించారు.

* తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో గురు, శుక్రవారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు తెలిపారు. శనివారం రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ రెండు రోజుల్లో కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతోపాటు గంటకు 30- 40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీయనున్నాయి.

* భారత వాయుసేన (IAF) మరో అరుదైన ఫీట్ సాధించింది. నైట్ విజన్ గాగుల్స్‌(NVG) సాయంతో తూర్పు సెక్టార్‌లో ట్రాన్స్‌పోర్టు విమానాన్ని విజయవంతంగా ల్యాండ్ చేసింది. C-130J విమానం అధునాతన ల్యాండింగ్‌ గ్రౌండ్‌లో దిగిందని వాయుసేన ఎక్స్ వేదికగా వెల్లడించింది. దీనికి సంబంధించి రెండు వీడియో క్లిప్‌లను షేర్ చేసింది. HarKaamDeshKeNaam అనే హ్యాష్ ట్యాగ్‌ను జోడించింది. ఈ ఎన్‌వీజీ సాంకేతికత సాయంతో తక్కువ వెలుగులో ఐఏఎఫ్ మరింత సమర్థతతో ఆపరేషన్లు నిర్వహించేందుకు వీలుపడుతుంది. ఒక క్లిప్‌లో ఎన్‌వీజీ సహాయంతో విమానం సజావుగా ల్యాండ్‌ కావడం కనిపించింది. ఎయిర్‌క్రాఫ్ట్‌ లోపలి నుంచి వ్యూ ఎలా ఉంటుందో మరో వీడియోలో పంచుకుంది. ‘‘దేశ సార్వభౌమత్వాన్ని పరిరక్షించుకునే ప్రక్రియలో భాగంగా మా సామర్థ్యాలను పెంపొందించుకొనేందుకు కట్టుబడి ఉన్నాం’’ అని ఈ సందర్భంగా ఐఏఎఫ్ తెలిపింది. అవి ఎన్‌వీజీ విజువల్స్‌ కావడంతో ఆ దృశ్యాలన్ని ఆకుపచ్చ రంగులో భిన్నంగా కనిపిస్తున్నాయి. ఒడిశా, ఝార్ఖండ్‌, సిక్కిం, పశ్చిమ బెంగాల్‌, బిహార్‌ రాష్ట్రాలు తూర్పు సెక్టార్‌ పరిధిలోకి వస్తాయి. చైనా, నేపాల్‌, భూటాన్‌, మయన్మార్‌, బంగ్లాదేశ్‌తో కూడిన 6,300 కి.మీ. అంతర్జాతీయ సరిహద్దుకు బాధ్యత వహిస్తుంది. చైనాతో సరిహద్దు ఉద్రిక్తతల వేళ.. ఈ సెక్టార్‌లో సైన్యం బలోపేతంపై కేంద్రం ప్రధానంగా దృష్టి సారించింది. దానిలో భాగంగా ఈ సరికొత్త ఘనతను సొంతం చేసుకుంది. ఇదివరకు నియంత్రణ రేఖ వద్ద కార్గిల్‌ ఎయిర్‌స్ట్రిప్‌ మీద కూడా ఈ విమానం రాత్రివేళ విజయవంతంగా ల్యాండ్ అయింది. తక్కువ స్థలంలోనే ల్యాండింగ్, టేకాఫ్ కావడం C-130J ప్రత్యేకత.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z