Movies

రజనీ సినిమాకు ఇళయరాజా లీగల్ నోటీసులు-CrimeNews-May 23 2024

రజనీ సినిమాకు ఇళయరాజా లీగల్ నోటీసులు-CrimeNews-May 23 2024

* బెంగళూరు రేవ్‌ పార్టీలో పట్టుబడిన వారిలో 103 మందికి డ్రగ్‌ టెస్ట్‌లో పాజిటివ్‌గా తేలినట్లు బెంగళూరు పోలీసులు వెల్లడించారు. పలువురు నటుల రక్త నమూనాల్లో మాదకద్రవ్యాల ఆనవాళ్లు లభ్యమైనట్లు తెలిపారు. వారిలో తెలుగు నటి కూడా ఉన్నట్లు చెప్పారు. నగర శివారులో ఆదివారం రాత్రి నిర్వహించిన రేవ్‌ పార్టీని పోలీసులు భగ్నం చేసిన విషయం తెలిసిందే. తెలుగు సినీ రంగానికి చెందిన కొందరు నటులు, బుల్లితెర నటులు, మోడల్స్, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరైనట్లు పోలీసులు ఇప్పటికే వెల్లడించారు. వారంతా మత్తు పదార్థాలు తీసుకున్నారో.. లేదో పరీక్షించడానికి రక్తనమూనాలు సేకరించి ప్రయోగశాలకు పంపించామని తెలిపారు. ఈక్రమంలో తాజాగా డ్రగ్స్‌ పరీక్షల వివరాలు వెల్లడించారు.

* ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్‌- బీజాపూర్‌ సరిహద్దులో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. పోలీసులు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. విశ్వసనీయ సమాచారం అందుకున్న స్పెషల్‌ టాస్క్‌ ఫోర్స్‌ సిబ్బంది, స్థానిక పోలీసులతో కలిసి గురువారం కూంబింగ్‌ చేపట్టారు. ఉదయం 11 గంటల నుంచి ప్రారంభమైన ఆపరేషన్‌ ఇప్పటికీ కొనసాగుతోంది. మృతి చెందిన మావోయిస్టుల సంఖ్య పెరిగే అవకాశముంది. ఈ ఏడాది పలుచోట్ల జరిగిన ఎదురుకాల్పుల్లో ఇప్పటి వరకు 100 మందికి పైగా మావోయిస్టులు మృతి చెందారు.

* మహారాష్ట్రలోని ఠానేలో ఓ రసాయన పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా.. 56 మందికి గాయాలయ్యాయి. డోంబివిలి ఎంఐడీసీ ఫేజ్‌ -2 ప్రాంతంలోని అముదాన్‌ కెమికల్‌ కంపెనీలో ఈ మధ్యాహ్నం 1.40 గంటల సమయంలో రియాక్టర్‌ పేలడంతో ఈ విషాదం చోటుచేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటివరకు ఈ ఘటనలో ఐదు మృతదేహాలను గుర్తించినట్లు తహశీల్దార్‌ సచిన్‌ షెజల్‌ తెలిపారు. ఈ పేలుడు కారణంగా పెద్దఎత్తున చెలరేగిన మంటల ప్రభావం ఆ ప్రాంతంలో కనీసం ఐదు కంపెనీలపై పడినట్లు తెలిపారు. ఈ పేలుడు ధాటికి దాదాపు కి.మీ. మేర శబ్దం వినిపించినట్లు ప్రత్యక్షసాక్షి చెప్పారు. పక్కనే ఉన్న భవనాల అద్దాలకు పగుళ్లు రాగా.. పరిసరాల్లోని పలు ఇళ్లు సైతం దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు.

* పోలింగ్‌ రోజున గురజాల నియోజకవర్గంలో హింసకు పాల్పడిన నిందితులను పోలీసులు నరసరావుపేట కోర్టులో ప్రవేశపెట్టారు. పిడుగురాళ్లకు చెందిన 50 మంది ఎన్నికల రోజున అల్లర్లకు పాల్పడినట్లు గుర్తించి అరెస్టు చేశారు. వీరిలో దాచేపల్లికి చెందిన 22 మంది వైకాపా వర్గీయులు కాగా.. తంగెడకు చెందిన తెదేపా మద్దతుదారులు 11 మంది ఉన్నారు. నిందితులను గురువారం న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు.

* లైంగిక దౌర్జన్యం కేసు ఎదుర్కొంటున్న హసన ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణ ఆచూకీ ఇంకా తెలియడం లేదు. విదేశాల్లో ఉన్న ఆయనను రప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుండగా.. ఆయన కుటుంబీకుల నుంచి వరుస విజ్ఞప్తులు వస్తున్నాయి. ఈ క్రమంలో మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ మరోసారి స్పందించారు. ఎక్కడున్నా తక్షణమే వచ్చి పోలీసుల ముందు లొంగిపోవాలని, తన సహనాన్ని పరీక్షించొద్దని, లేదంటే తన ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందని ప్రజ్వల్‌ను హెచ్చరిస్తూ ఎక్స్‌లో సుదీర్ఘ లేఖ పోస్టు చేశారు. ‘‘ప్రజ్వల్‌ రేవణ్ణ గురించి మే 18న ఓ ఆలయానికి వెళ్తూ మీడియాతో మాట్లాడా. అతడు నాకు, నా కుటుంబం, పార్టీ, శ్రేయోభిలాషులకు కలిగించిన బాధ, ఆ షాక్‌ నుంచి కోలుకోవడానికి కొంత సమయం పట్టింది. ఆ కేసులో దోషిగా తేలితే కఠినశిక్ష పడాల్సిందే. నా కుమారుడు, మాజీ సీఎం కుమారస్వామి కూడా ఇదే వైఖరితో ఉన్నాడు. ప్రజ్వల్‌.. ఎక్కడున్నా వచ్చి పోలీసుల ముందు లొంగిపో. నా సహనాన్ని పరీక్షించవద్దు. ఇది నా విజ్ఞప్తి కాదు.. వార్నింగ్‌. లేదంటే నాతో పాటు కుటుంబసభ్యుల ఆగ్రహానికి గురవుతావ్‌’ అని హెచ్చరిక లేఖలో దేవెగౌడ పేర్కొన్నారు.

* బాపట్ల జిల్లాలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు కార్లు ఢీకొన్న ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందగా, ఆరుగురికి తీవ్ర గాయాలైన ఘటన వేటపాలెం మండలం పందిళ్లపల్లి బైపాస్‌ రోడ్డులో జరిగింది. వేటపాలెం ఎస్‌ఐ జి.సురేష్‌ కుమార్‌ కథనం ప్రకారం.. బాపట్ల వైపు నుంచి కనిగిరి వెళ్తోన్న కారు అదుపుతప్పి పందిళ్లపల్లి నుంచి చీరాల వైపు వస్తున్న కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప్రకాశం జిల్లా కనిగిరికి చెందిన శిరీష(29) అక్కడికక్కడే మృతి చెందగా, భర్త టెండూల్కర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. మరో కారులో ఉన్న ఐదుగురికి తీవ్ర గాయాలవ్వడంతో చీరాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

* ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా ‘మంజుమ్మ‌ల్ బాయ్స్‌’ నిర్మాణ సంస్థకు లీగల్‌ నోటీసులు పంపారు. తన అనుమతి లేకుండా ఓ పాటను ఆ సినిమాలో ఉపయోగించారని పేర్కొన్నారు. ఇది కాపీరైట్‌ ఉల్లంఘన కిందకు వస్తుందని ఆరోపించారు. ఇటీవల విడుదలై అన్ని భాషల్లోనూ ‘మంజుమ్మ‌ల్ బాయ్స్‌’ (Manjummel Boys movie) విజయాన్ని అందుకొన్న విషయం తెలిసిందే. య‌థార్థ క‌థ‌ ఆధారంగా రూపొందిన ఈ చిత్రంలో గతంలో ఇళయరాజా కంపోజ్‌ చేసిన ‘గుణ’లోని పాటను వాడారు. ‘కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే..’ పాటను క్లైమాక్స్‌లో ఉపయోగించారు. అయితే, తన అనుమతి లేకుండా ఈ హిట్ సాంగ్‌ను వాడుకున్నారని ‘మంజుమ్మ‌ల్ బాయ్స్‌’ చిత్ర నిర్మాణ సంస్థకు ఇళయరాజా తరఫు న్యాయవాది లీగల్ నోటీసులు పంపారు. సినిమాలో పాటను ఉపయోగించాలంటే సంగీత దర్శకుడి దగ్గర అనుమతి తీసుకోవాలని, లేదంటే కాపీరైట్‌ను ఉల్లంఘించినట్లేనని నోటీసులో పేర్కొన్నారు. దీనిపై చిత్రబృందం స్పందించాల్సి ఉంది. ఇక పాటలను అనుమతిలేకుండా స్టేజ్‌ షోలలో పాడకూడదని, సినిమాల్లోనూ ఉపయోగించకూడదని గతంలో ఇళయరాజా ఆంక్షలు విధించారు. రజనీకాంత్‌ నటిస్తున్న ‘కూలీ’ నిర్మాణ సంస్థకు కూడా ఇళయరాజా (Ilaiyaraaja) ఇటీవల లీగల్ నోటీసులు పంపారు. ఈ సినిమా టైటిల్‌ టీజర్ విడుదల చేయగా.. అందులో రజనీకాంత్‌ గతంలో నటించిన ‘తంగమగన్‌’లోని ‘వా వా పక్కమ్ వా’ పాట బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ ఉపయోగించారు. ఇది తాను కంపోజ్‌ చేసిన పాట అని ఇళయరాజా పేర్కొన్నారు. తన అనుమతి లేకుండా వాడారని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ మ్యూజిక్‌ను వెంటనే తొలగించాలని, లేకుంటే ఆ పాటకు అనుమతి తీసుకోవాలని సన్‌ పిక్చర్స్‌కు ఇళయరాజా నోటీసు పంపారు. అలా చేయకుంటే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z