Fashion

విశాఖ అక్రమ మానవ రవాణా కేసులో పురోగతి-CrimeNews-May 22 2024

విశాఖ అక్రమ మానవ రవాణా కేసులో పురోగతి-CrimeNews-May 22 2024

* హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. తాజాగా హ్యూమన్ ట్రాఫికింగ్ కేసు విచారణకు విశాఖపట్నం సీపీ ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటు అయింది. విశాఖ సీపీ రవిశంకర్ ఆధ్వర్యంలో 20 మందితో సిట్ బృందం ఏర్పడింది. జాయింట్ సీపీ, ఇద్దరు సీఐలు, నలుగురు ఎస్సైలు, 12 మంది హెడ్ కానిస్టేబుళ్లతో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఈ కేసును లోతుగా దర్యాప్తు చేయనుంది. మరోవైపు.. ఆపరేషన్ కంబోడియా విజయవంతమైంది. 360 మంది భారతీయులను ఎంబసీ అఫ్ ఇండియా కాపాడింది. సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్: + 855 10642777 సంప్రదించాలని అధికారులు కోరారు. అయితే.. విదేశీ ఉద్యోగాలంటూ కోటి ఆశలతో కంబోడియా వెళ్లిన భారతీయులు మోసపోయారు. కంప్యూటర్‌ ఆపరేటర్‌ ఉద్యోగమని తీసుకువెళ్లి అక్కడ బలవంతంగా సైబర్‌ నేరాలు చేయిస్తున్న చైనా గ్యాంగ్‌పై సోమవారం తిరుగుబాటు చేసిన బాధితులు జైలు పాలయ్యారు. అక్కడ నిర్వాహకులు తమను చిత్ర హింసలకు గురి చేస్తున్నారని కొంత మంది బాధితులు విశాఖ పోలీసులకు మంగళవారం వాట్సాప్‌తో పాటు ‘ఎక్స్‌’ ద్వారా వీడియో సందేశాలు పంపించిన విషయం తెలిసిందే. విదేశాల్లో కంప్యూటర్‌ ఆపరేటర్‌ ఉద్యోగాలు అంటూ గాజువాకకు చెందిన చుట్టా రాజేష్‌ విజయ్‌కుమార్‌ సోషల్‌ మీడియాలో ప్రకటనలు ఇచ్చాడు. అది నిజమని నమ్మి విశాఖ నుంచే కాకుండా రాష్ట్రంలో సుమారు 150 మంది నిరుద్యోగులు రూ.1.5 లక్షలు చొప్పున చెల్లించారు. వారిని బ్యాంకాక్, సింగపూర్‌ల మీదుగా కంబోడియాకు పంపించారు. అక్కడ మరో గ్యాంగ్‌ బాధితులను రిసీవ్‌ చేసుకొని కంబోడియాలో పాయిపేట్‌ వీసా సెంటర్‌కు తీసుకెళ్లింది. ఓ నెలకు టూరిస్ట్‌ వీసా చేయించి ఆ గ్యాంగ్‌ చైనా ముఠాకు విక్రయించింది. నిరుద్యోగుల నైపుణ్యం ఆధారంగా వారిని రూ.2,500 నుంచి రూ.4వేల అమెరికన్‌ డాలర్లకు చైనా కంపెనీలకు అమ్మేశారు. అక్కడ పని చేసి చైనా వారి చెర నుంచి తప్పించుకున్న నగరానికి చెందిన బొత్స శంకర్‌ అనే వ్యక్తి ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన విశాఖ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు సైబర్‌ నేరాలతో పాటు మానవ అక్రమ రవాణా వ్యవహారాన్ని వెలుగులోకి తీసుకువచ్చారు. ఈ కేసుని లోతుగా దర్యాప్తు చేయాలని సీపీ రవిశంకర్‌ ఆదేశాలు జారీ చేశారు. దీంతో జాయింట్‌ కమిషనర్‌ ఫకీరప్ప సారథ్యంలో సైబర్‌ క్రైమ్‌ ఇన్‌స్పెక్టర్‌ కె.భవానీప్రసాద్, సిబ్బందితో ఏడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

* అక్రమాస్తుల కేసులో అరెస్టయిన సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావును నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరుపర్చారు. అంతకు ముందు ఏసీబీ కార్యాలయంలో ఆయనను విచారించిన అధికారులు.. ట్యాబ్‌లో ఉన్న ఆస్తి వివరాలపై ఆరా తీశారు. బీనామీ ఆస్తులపై కూపీలాగుతున్నారు. సందీప్ అనే వ్యక్తి ఎవరు? అతనితో ఉన్న లావాదేవీలు ఏంటి? అనే కోణంలో విచారణ చేపట్టారు. ఇప్పటి వరకు స్వాధీనం చేసుకున్న ఆస్తులు డాక్యుమెంట్స్ వివరాలను ఏసీబీ అధికారులు కోర్టుకు అందించారు. ఇప్పటి వరకు అధికారిక లెక్కల ప్రకారం మూడు కోట్ల ఆస్తులను ఏసీబీ గుర్తించింది.

* దేశ రాజధాని ఢిల్లీలో కేంద్ర హోం శాఖ కొలువు దీరిన నార్త్ బ్లాక్‌ భవనానికి బాంబు బెదిరింపులు వచ్చాయి. హోం శాఖకు బుధవారం(మే22) బాంబు బెదిరింపుల మెయిల్ అందినట్లు పోలీస్ కంట్రోల్ రూమ్‌ వెల్లడించింది. బాంబు బెదిరింపులు వచ్చిన వెంటనే పోలీసులు అప్రమత్తమయ్యారు. ముందు జాగ్రత్త చర్యగా రెండు ఫైర్‌ ఇంజిన్లను నార్త్‌బ్లాక్‌ వద్దకు తరలించారు. గత కొన్ని రోజులుగా దేశంలోని పలు ప్రాంతాల్లోని స్కూళ్లకు, ఎయిర్‌పోర్టులకు ఫేక్‌ బెదిరింపు కాల్స్‌ వస్తున్న విషయం తెలిసిందే.

* పోలింగ్‌ రోజు మాచర్లలో ఈవీఎంల ధ్వంసం కేసులో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఇప్పటికే ఆయనను ఏ1గా ఎఫ్ఐఆర్‎లో చేర్చారు. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మే 13న పోలింగ్ నిర్వహిచారు ఎన్నికల అధికారులు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా జరిగినప్పటికీ పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈనేపథ్యంలోనే పల్నాడు నియోజకవర్గంలో పెట్రోలు బాంబులతో దాడులు చేసుకున్నారు. ఈ క్రమంలోనే మాచర్ల నియోజకవర్గంలోని రెంటచింతలలో ఏర్పాటు చేసిన పోలింగ్ స్టేషన్లో ఈవీఎంను ధ్వంసం చేశారు స్థానిక ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి. ఈ దృశ్యాలు వెబ్ క్యామ్ లలో స్పష్టంగా రికార్డు అయ్యాయి. దీంతో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కమార్ మీనా సీరియస్ అయ్యారు. విదేశాలకు పారిపోకుండా లుకౌట్‌ నోటీసులు జారీ చేశారు. అన్ని ఎయిర్‌పోర్టులను అప్రమత్తం చేసిన ఏపీ పోలీసులు.. పిన్నెల్లి డ్రైవర్‌, అనుచరుల అరెస్ట్‌ చేశారు.

* ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో బెంగళూరు రేవ్ పార్టీ కలకలం రేపుతున్న విషయం తెలిసిందే. ఈ పార్టీలో పలువురు టాలీవుడ్ నటీనటులు పాల్గొన్నట్లు వార్తలు సర్కులేట్ అవుతున్నాయి. అందులో నటి హేమ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ‘నేనేమీ ఆ పార్టీకి హాజరు కాలేదు’ అంటూ ఆమె బుకాయిస్తన్నప్పటికీ.. రేవ్‌ పార్టీకి తెలుగు సినీ నటి హేమ హాజరైనట్లు నగర పోలీసు కమిషనర్‌ దయానంద్‌ స్పష్టం చేశారు. దీంతో జనాలను చీట్ చేయాలని చూసిన హేమపై నెట్టింట ట్రోల్స్ పేలుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మరో నటి కరాటే కల్యాణీ హేమపై చేసిన కామెంట్స్‌ వైరల్‌గా మారాయి. ఇండస్ట్రీ వాళ్లను ఉద్దరిస్తున్నట్లు కలరింగే ఇచ్చే హేమ నిజ స్వరూపం ఇప్పుడు బట్టబయలు అయిందని కల్యాణీ చెప్పుకొచ్చారు. ఫ్రెండ్స్‌తో సరదాగా పేకాడుతూ దొరికితే.. తానేదో పెద్ద తప్పు చేసినట్లు బిల్డప్ ఇచ్చిందన్నారు. మనం ఏం చేస్తే అది తిరిగి వస్తుందని.. చాలా పనిష్‌మెంట్స్ తీసుకోడానికి హేమ రెడీగా ఉండాలన్నారు కల్యాణీ. అయితే హేమ డ్రగ్స్ కేసు నుంచి బయటకు రావాలని తాను కోరుకుంటున్నట్లు చెప్పారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z