Business

తెలంగాణా ఆర్టీసీ పేరు మార్పు-BusinessNews-May 22 2024

తెలంగాణా ఆర్టీసీ పేరు మార్పు-BusinessNews-May 22 2024

* తెలంగాణ బస్సు పేరు మారింది.. ఇక మీదట TSRTC కాదు.. TGSRTCగా యాజమాన్యం పేరు మార్చింది. ప్రభుత్వం ఆదేశాల మేరకు పేరు మార్పు చేసింది. ఈ విషయాన్ని తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అధికారికంగా ప్రకటించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పాలనలో పలు కీలక మార్పులు చేస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ క్రమంలోనే తెలంగాణ స్టేట్(TS)ను తెలంగాణ(TG) మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. త్వరలోనే టీఎస్ఆర్టీసీ ఇక నుంచి టీజీఎస్ ఆర్టీసీగా లోగో మార్పులు చేసి కొత్త లోగోను ప్రకటిస్తామని ఆర్టీసీ సంస్థ అధికారులు స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు టీఎస్ ఆర్టీసీ పేరును టీజీఎస్ ఆర్టీసీగా మార్చడం జరిగిందని.. సజ్జనార్ తన ఎక్స్ ఖాతాలో తెలిపారు. ఈ మేరకు అధికారిక ఎక్స్‌ ఖాతాల పేర్లను తెలియజేశారు. ఇకపై @tgsrtcmdoffice, @tgsrtchq గా సంస్థ మార్చిందన్నారు. ప్రయాణీకులు, ప్రజలు తమ విలువైన సలహాలు, సూచనలతో పాటు ఏవైనా ఫిర్యాదులు ఉంటే మార్చిన ఈ ఖాతాల ద్వారా తమ దృష్టికి సమాచారం తీసుకురావాలని విజ్ఙప్తి చేశారు. తెలంగాణ ఆర్టీసీ అందిస్తోన్న సేవల గురించి తెలుసుకునేందుకు @tgsrtcmdoffice, @tgsrtchq అనే ఎక్స్ ఖాతాలను ఫాలో అవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

* కేంద్ర ప్రభుత్వానికి రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) తీపి కబురు అందించింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.2.11 లక్షల కోట్లు డివిడెండ్‌గా (dividend payout) చెల్లించేందుకు నిర్ణయించింది. గవర్నర్‌ శక్తికాంత దాస్‌ నేతృత్వంలో ఆర్‌బీఐ కేంద్ర బోర్డు డైరెక్టర్లు ఈమేరకు సమావేశమై మిగులు నిధులను ప్రభుత్వానికి బదిలీ చేసే విషయమై ఆమోదం తెలిపారు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి ఆర్‌బీఐ రూ.87,416 కోట్లు డివిడెండ్‌ రూపంలో చెల్లించింది. దీంతో పోలిస్తే 2023-24 ఆర్థిక సంవత్సరంలో 140 శాతం అధికంగా డివిడెండ్‌ చెల్లిస్తుండడం గమనార్హం. ఈ ఏడాది రూ.75,000-1,20,000 కోట్ల మేర నిధులు బదిలీ చేస్తారని ఆర్థిక వేత్తలు అంచనా వేయగా.. అంతకుమించి చెల్లించేందుకు ఆర్‌బీఐ బోర్డు నిర్ణయించింది. ఆర్‌బీఐ ఇచ్చిన డివిడెండ్‌ వల్ల కేంద్రం తన ద్రవ్య లోటును పూడ్చుకోవడానికి ఉపయోగపడనుంది. దేశీయంగా ఆర్థిక కార్యకలాపాలు పుంజుకోవడంతో కంటిన్‌జెంట్‌ రిస్క్‌ బఫర్‌ లెవల్‌ను కూడా 6 శాతం నుంచి 6.50 శాతానికి పెంచింది.

* మహీంద్రా అండ్‌ మహీంద్రా ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ ఇన్సూరెన్స్‌ యాక్ట్‌, 1938 ప్రకారం కార్పొరేట్‌ ఏజెంట్‌గా వ్యవహరించడానికి IRDAI నుంచి రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్‌ పొందినట్లు ప్రకటించింది. ఈ రిజిస్ట్రేషన్‌ 2024 మే 21 నుంచి 2027 మే 20 వరకు చెల్లుబాటులో ఉంటుందని మహీంద్రా ఫైనాన్స్‌ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. ఈ లైసెన్స్‌తో మహీంద్రా ఫైనాన్స్‌ బీమా ప్లాన్స్‌ను అందించడానికి వీలు కలుగుతుంది. మహీంద్రా ఫైనాన్స్‌కు చెందిన 1360 శాఖల్లో ఈ బీమా సేవలు లభిస్తాయని మహీంద్రా ఫైనాన్స్‌ ఎండీ అండ్‌ సీఈఓ రౌల్‌ రెబెల్లో తెలిపారు. మహీంద్రా ఫైనాన్స్‌ ఈ కార్పొరేట్‌ ఏజెన్సీ లైసెన్స్‌తో బీమా కంపెనీల తరఫున జీవిత బీమా, ఆరోగ్య బీమా, సాధారణ బీమాతో సహా అన్ని రకాల బీమా ఉత్పత్తులను విక్రయిస్తుంది.

* ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న స్పైస్‌జెట్‌ విమానయాన సంస్థ.. తన మాజీ ప్రమోటర్‌ అయిన కళానిధి మారన్‌ నుంచి రూ.450 కోట్ల మేర రిఫండ్‌ కోరనుంది. గతంలో మారన్‌కు, ఆయనకు చెందిన కేఏఎల్‌ ఎయిర్‌వేస్‌కు చెందిన రూ.730 కోట్ల మొత్తం నుంచి అదనంగా చెల్లించిన మొత్తాన్ని తిరిగి వెనక్కి ఇవ్వాలని అడగనుంది. ఈమేరకు ఆ సంస్థ ఓ ప్రకటన విడుదల చేసింది. ఇటీవల దిల్లీ హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ఆ కంపెనీ నుంచి ఈ ప్రకటన వెలువడింది.

* దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు (Stock market) లాభాల్లో ముగిశాయి. రిలయన్స్‌, ఇన్ఫోసిస్‌, హిందుస్థాన్‌ యూనిలీవర్‌ షేర్లలో కొనుగోళ్ల మద్దతు సూచీలకు దన్నుగా నిలిచాయి. దీంతో సెన్సెక్స్‌ 250 పాయింట్ల మేర లాభపడగా.. నిఫ్టీ 22,600 ఎగువన ముగిసింది. సెన్సెక్స్‌ ఉదయం 74,165 పాయిట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 73,860.33- 74,307.79 పాయింట్ల మధ్య కదలాడింది. చివరికి 267.75 పాయింట్ల లాభంతో 74,221.06 వద్ద ముగిసింది. నిఫ్టీ 68.75 పాయింట్ల లాభంతో 22,597.80 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 83.28గా ఉంది. సెన్సెక్స్‌- 30 సూచీలో హిందుస్థాన్‌ యూనిలీవర్‌, రిలయన్స్‌, ఇన్ఫోసిస్‌, ఏషియన్‌ పెయింట్స్‌, ఐటీసీ షేర్లు లాభపడ్డాయి. ఎస్‌బీఐ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, టాటా స్టీల్‌ షేర్లు నష్టపోయాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్‌ బ్యారెల్‌ ధర 82.89 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z