Politics

ఏపీ ప్రభుత్వంతో సత్సంబంధాలు కోరుతున్నాను-NewsRoundup-May 22 2024

ఏపీ ప్రభుత్వంతో సత్సంబంధాలు కోరుతున్నాను-NewsRoundup-May 22 2024

* రోజు వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి.. ప్రజాప్రతినిధిలా కాకుండా వీధి రౌడీలా ప్రవర్తించి ఈవీఎం ధ్వంసం చేశారని తెలుగుదేశం ఏజెంట్ నంబూరి శేషగిరిరావు తెలిపారు. పాల్వాయి గేటు పోలింగ్ బూత్‌లో ఏజెంట్‌గా ఉన్న తరుణంలో ఎమ్మెల్యే పిన్నెల్లి తన అనుచరులతో దూసుకు వచ్చి స్వయంగా ఈవీఎంను పగలగొట్టారని తెలిపారు. ఈవీఎంను ధ్వంసం చేసిన ఎమ్మెల్యేను అడ్డుకునే ప్రయత్నం చేసిన తనపై దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు, తన కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే నుంచి ప్రాణహాని ఉందని నంబూరి శేషగిరిరావు ఆందోళన వ్యక్తం చేశారు.

* తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి కుటుంబసభ్యులతో కలిసి బుధవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తితిదే ఈవో ఏవీ ధర్మారెడ్డి వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. రేవంత్‌ రెడ్డి ఉదయం శ్రీవారికి తన మనవడి పుట్టువెంట్రుకల మొక్కు చెల్లించారు. అనంతరం ఉదయం 8.30 గంటలకు వీఐపీ బ్రేక్‌ దర్శన సమయంలో కుటుంబసభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘‘కాంగ్రెస్‌ పాలనలో తెలంగాణ రాష్ట్ర రైతులు సంతోషంగా ఉన్నారు. రాష్ట్రంలో నీటి సమస్యలు తీరి సకాలంలో వర్షాలు కురిశాయి. ఏపీలో ఏర్పడే ప్రభుత్వంతో సత్సంబంధాలు ఉండాలని కోరుకుంటున్నా. తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థించా. స్వామి వారి ఆశీస్సులతో తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలి’’ అని రేవంత్‌రెడ్డి ఆకాంక్షించారు.

* మాచర్ల ఘటనపై కేంద్ర ఎన్నికల సంఘానికి ‘ఎలక్షన్‌ వాచ్‌’ కన్వీనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌ ఫిర్యాదు చేశారు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి ఈవీఎంలను ధ్వంసం చేసిన వీడియో దృశ్యాలను ఈసీకి అందించారు. ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇలాంటి పనులు ఇతరులెవరూ చేసేందుకు సాహసించని రీతిలో చర్యలు ఉండాలని విజ్ఞప్తి చేశారు.

* ఎన్నికల అనంతరం అధికార పార్టీ అభ్యర్థుల ఒత్తిళ్లు తట్టుకోలేక పలువురు రిటర్నింగ్‌ అధికారులు ఈసీని సెలవులు అడుగుతున్నారు. ఈ విషయమై కొన్ని జిల్లాల నుంచి ఈసీకి విజ్ఞప్తులు అందుతున్నాయి. పోలింగ్ సమయం నుంచే ఈసీకి విజ్ఞప్తులు వెల్లువెత్తుతున్నాయి. అధికార పార్టీకి చెందిన అభ్యర్థుల అసభ్యకరమైన మాటలు వినలేకపోతున్నామని కొందరు అధికారులు ఈసీకి ఫిర్యాదు చేశారు. కౌంటింగ్ వరకు విధులు నిర్వహించే పరిస్థితి లేదంటూ ఈసీకి మొరపెట్టుకున్నారు. ఆర్వో బాధ్యతల నుంచి తమను తప్పించాలంటూ వేడుకున్నారు. ప్రత్యేకించి రాయలసీమ జిల్లాల నుంచి ఆర్వోలపై అధికార పార్టీకి చెందిన నేతల ఒత్తిళ్లు ఎక్కువయ్యాయి. వారి బెదిరింపులతో భయంభయంగానే విధులకు హాజరవుతున్నారు. ఆ స్థాయి ఒత్తిడిని తట్టుకోవడం మా వల్ల కాదని చేతులెత్తేస్తున్నారు. కేవలం ఐఏఎస్‌ స్థాయి అధికారులు మాత్రమే ఆ ఒత్తిడి తట్టుకోగలరని ఈసీకి నివేదిస్తున్నారు.

* సినీ నిర్మాతలు పర్సంటేజీ చెల్లించకపోతే సింగిల్ స్క్రీన్ థియేటర్ల మూసివేత తప్పదని తెలంగాణ ఫిల్మ్‌ ఎగ్జిబిటర్లు (telangana film exhibitors) హెచ్చరించారు. గత పదేళ్లలో 2 వేల సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూతపడ్డాయని గుర్తు చేశారు. పలు కారణాల వల్ల థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గుతుండడంతో సినిమా ప్రదర్శనలు నిలిపివేసిన సంగతి తెలిసిందే. బుధవారం హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎగ్జిబిటర్లు తమ డిమాండ్లను వెల్లడించారు.

* లోక్‌సభ ఎన్నికల వేళ పశ్చిమబెంగాల్‌లో మమతా బెనర్జీ (West Bengal CM) నేతృత్వంలోని తృణమూల్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవల ఉపాధ్యాయ నియామక కుంభకోణం కేసులో 26వేల మంది టీచర్ల ఉద్యోగాలు రద్దు చేసిన కలకత్తా హైకోర్టు (Calcutta High Court).. బుధవారం మరో సంచలన తీర్పు వెలువరించింది. ఓబీసీలో పలు క్లాసులను కొట్టివేసింది. 2010 తర్వాత నుంచి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన అన్ని ఓబీసీ ధ్రువపత్రాల (OBC Certificates)ను రద్దు చేస్తూ ఉత్తర్వులిచ్చింది.

* సికింద్రాబాద్‌ బోయిన్‌పల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని డైరీ ఫార్మ్‌ ప్రధాన రహదారిపై బుధవారం సాయంత్రం లిక్కర్‌ లోడుతో వెళ్తోన్న వాహనం బోల్తా పడింది. టైర్‌ పంక్చర్‌ కావడంతో అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి పల్టీ కొట్టింది. ఈ ఘటనలో దాదాపు రూ.3లక్షల విలువైన మద్యం సీసాలు ధ్వంస మయ్యాయి. మద్యం బాటిళ్లు రోడ్డుపై పడటంతో ట్రాఫిక్‌కు అంతరాయమేర్పడింది. ఇదే అదునుగా కొందరు వాహనదారులు మద్యం సీసాలు తీసుకునేందుకు పోటీ పడ్డారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని అదుపు చేశారు.

* దేశ రాజధానిలో బాంబు బెదిరింపు ఈ-మెయిల్స్‌ కలకలం రేపుతూనే ఉన్నాయి. తాజాగా నార్త్‌ బ్లాక్‌కు బెదిరింపు మెయిల్‌ వచ్చింది. కేంద్ర హోంశాఖ కార్యాలయం ఇందులోనే ఉంది. సమాచారం అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన భద్రతా బలగాలు ముమ్మర తనిఖీలు చేపట్టాయి. సమీప ప్రాంతాల్లో భారీ స్థాయిలో పోలీసులను మోహరించారు.

* లోక్‌సభ ఎన్నికల్లో (Lok Sabha elections) విపక్ష ‘ఇండియా’ కూటమికి ప్రధాని అభ్యర్థే లేరంటూ భాజపా నేతలు విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. వారు అధికారంలోకి వస్తే ఏడాదికి ఒకరు చొప్పున ప్రధాని పదవిని పంచుకుంటారంటూ ప్రధాని మోదీ (PM Narendra Modi) కూడా దుయ్యబట్టారు. ఈ విమర్శలపై తాజాగా కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ (Congress Leader Jairam Ramesh) స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇదేం అందాల పోటీ కాదంటూ కౌంటర్‌ ఇచ్చారు. ‘‘ఎన్నికలంటే వ్యక్తుల మధ్య జరిగే అందాల పోటీ కాదు. అందుకే నరేంద్రమోదీకి వ్యతిరేకంగా ఇండియా కూటమి ప్రధాని (Prime Minister) అభ్యర్థిని ప్రకటించలేదు’’ అని అన్నారు. అంతేగాక, తాము అధికారంలోకి వస్తే కేవలం కొన్ని గంటల్లోనే ప్రధాని పేరును ఖరారు చేస్తామని వెల్లడించారు.

* పాకిస్థాన్‌ వద్ద అణుబాంబులు ఉన్నాయంటూ దేశ ప్రజలను భయపెట్టేందుకు కాంగ్రెస్‌, సమాజ్‌వాదీ పార్టీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) ఆరోపించారు. ఆ రెండు పార్టీలు పాక్‌కు సానుభూతిపరులు అంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌లో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో పాల్గొన్న మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. 2017లో యూపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి ప్రచారం చేసిన ఈ రెండు పార్టీలు (కాంగ్రెస్‌, ఎస్పీ) ఓటమి చవిచూశాయని.. ప్రస్తుతం మళ్లీ అవి కలిసి ప్రచారం చేయడం తనకు ఆశ్చర్యం కలిగిస్తోందని ప్రధాని ఎద్దేవా చేశారు. ‘‘ఒకప్పుడు ఉగ్రవాదం పేరుతో మనల్ని బెదిరించినవారు ప్రస్తుతం ఆహార ధాన్యాల కోసం అల్లాడుతున్నారు. పాకిస్థాన్‌ పని అయిపోయింది. కానీ, ఆ దేశ సానుభూతిపరులైన ఎస్పీ, కాంగ్రెస్‌లు మాత్రం దేశాన్ని భయపెట్టే పనిలో బిజీగా ఉన్నాయి’’ అని మోదీ ఆరోపించారు.

* మాచర్ల నియోజకవర్గం పరిధిలోని పాల్వాయిగేటు పోలింగ్‌ కేంద్రం ఘటనలో బాధితుడు నంబూరి శేషగిరిరావుతో తెలుగుదేశం అధినేత చంద్రబాబు మాట్లాడారు. శేషగిరిరావు ఆరోగ్య పరిస్థితిపై ఆరాతీశారు. ధైర్యంగా ఉండాలని, పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. పోలింగ్‌ రోజు పాల్వాయిగేటు పోలింగ్‌ బూత్‌లో ఈవీఎంను ధ్వంసం చేసిన వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లిని శేషగిరిరావు ధైర్యంగా ప్రశ్నించారు. ఈవీఎం ధ్వంసాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసిన అతనిపై ఎమ్మెల్యే అనుచరులు మారణాయుధాలతో దాడి చేశారు. తాజాగా ఈవీఎం ధ్వంసం ఘటనలో ఎమ్మెల్యేపై కేసు నమోదు కావడంతో శేషగిరిరావు అజ్ఞాతం వీడి బయటకు వచ్చారు. ఎమ్మెల్యే అక్రమాలను ధైర్యంగా ప్రశ్నించిన శేషగిరిరావుపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఫోన్‌లో మాట్లాడి అభినందించారు.

* యుద్ధ నేరాల కింద ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు (Benjamin Netanyahu)కు అరెస్టు వారెంట్‌ ఇవ్వాలని అంతర్జాతీయ నేర న్యాయస్థానం(ICC)లో ప్రధాన ప్రాసిక్యూటర్ అభ్యర్థన చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రధాని మండిపడ్డారు. ‘అబద్ధాల మూట’ ఆధారంగానే తనపై ఆ వారెంట్‌ కోరుతున్నారని అంతర్జాతీయ మీడియాతో మాట్లాడుతూ దుయ్యబట్టారు. అలాగే ఆ ప్రధాన ప్రాసిక్యూటర్ కరీంఖాన్‌ను తీవ్రంగా విమర్శించారు. గాజాలో ఆకలి కేకల్ని ఇజ్రాయెల్‌ యుద్ధతంత్రంగా వాడుతుందోన్న విమర్శలను ఖండించారు.

* మాచర్లలో చాలా చోట్ల టీడీపీ నేతలు రిగ్గింగ్‌ చేశారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియా సమావశంలో మాట్లాడుతూ, పిన్నెల్లి గెలుపును ఎవరూ ఆపలేరని.. దీనిపై ఎంతవరకైనా పోరాటం చేస్తామన్నారు. మొత్తం వీడియో బయటపెడితే అసలు వాస్తవాలు బయటకు వస్తాయి. ఒక్కటే వీడియో ఎందుకు రిలీజ్‌ చేశారు. రిగ్గింగ్‌ జరిగిందని చెప్పుంటే.. ఎందుకు వీడియో రిలీజ్‌ చేయడం లేదు?’’ అంటూ కాసు మహేష్‌రెడ్డి ప్రశ్నించారు.

* ఎన్నికల అనంతర ఘర్షణలపై సిట్ ప్రాధమిక నివేదిక.. ఇపుడు పోలీసుల మెడకు చుట్టుకోబోతోంది. పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాలలో జరిగిన హింసాత్మక ఘటనలపై ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సిట్ రెండు రోజుల పాటు విచారణ జరిపి డీజీపీ ద్వారా కేంద్ర ఎన్నికల సంఘానికి ప్రాధమిక నివేదిక పంపారు. ఈ మూడు జిల్లాలలో 33 ప్రధాన సంఘటనలపై క్షేత్రస్ధాయిలో విచారణ జరిపారు. పల్నాడు జిల్లాలోని గురజాల, నరసారావుపేట, మాచర్ల నియోజకవర్గాలలో జరిగిన హింసాత్మక ఘటనల వెనుక పోలీసు అధికారుల వైఫల్యాన్ని సిట్ గుర్తించింది. ముఖ్యంగా నరసారావుపేట, మాచర్ల నియోజకవర్గాలలోని 18 కేసులలో 474 మంది నిందితులుంటే ఒక్కరిని కూడా అరెస్ట్ చేయకపోవడాన్ని సిట్ తీవ్రంగా పరిగణించింది. ఇందులో 307 మంది నిందితులను గుర్తించాల్సి ఉందని ఈ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసు అధికారుల స్టేట్ మెంట్ ని కూడా సిట్ సీరియస్ గా తీసుకుంది. ఇక తాడిపత్రిలో ఏకంగా పోలీసులు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి పెద్దారెడ్డి ఇంటిపై దాడి చేసి సీసీ కెమెరాలను ద్వంసం చేయడం వెనుక కారణాలను సిట్ విశ్లేసించింది. ఈ మూడు జిల్లాలలో జరిగిన 33 హింసాత్మక ఘటనల్లో దాదాపు 1370 మంది నిందితులుంటే కేవలం 124 మందినే అరెస్ట్ చేయడంపై పోలీసులు పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించారని సిట్ అభిప్రాయపడింది. ఇదే సమయంలో పల్నాడు లాంటి జిల్లాలలో కొందరు పోలీసు అధికారులు టీడీపీ నేతల దగ్గర లంచాలు తీసుకుని తెలుగుదేశం పార్టీకి కొమ్ముకాశారని.. కొన్ని చోట్ల పోలింగ్ బూత్ లలో ఓటర్లని రానివ్వకుండా టీడీపీ రిగ్గింగ్‌కు పాల్పడిందని వైఎస్సార్సీపీ ఇప్పటికే ఈసీకి, డీజీపీ, సిట్ కు కూడా ఫిర్యాదులు చేసింది. పల్నాడు జిల్లాలోని మాచవరం మండలం కొత్తగణేషునిపాడులో ఎస్సీ, ఎస్టీలపై ఎన్నికల తర్వాత టీడీపీ నేతలు దాడులు చేయడంతో వారంతా ఊళ్లు వదిలి వెళ్లిపోయారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z