Business

మూడు కొత్త IPOలు-BusinessNews-May 05 2024

మూడు కొత్త IPOలు-BusinessNews-May 05 2024

* వచ్చే వారం రోజుల్లో ప్రైమరీ మార్కెట్‌లో మళ్లీ సందడి నెలకొననుంది. మొత్తం మూడు కంపెనీలు ఐపీఓకి (IPO) రానున్నాయి. బ్లాక్‌స్టోన్‌ మద్దతున్న ఆధార్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌, ఆరోగ్య సంరక్షణ కంపెనీ ఇండెజీన్‌, ట్రావెల్‌ డిస్ట్రిబ్యూషన్‌ సంస్థ టీబీఓ టెక్‌ పబ్లిక్‌ ఇష్యూకు వస్తున్నాయి. 2004 నుంచి మొదలుకొని గత నాలుగు సాధారణ ఎన్నికల సమయంలో మే నెలలో ఒక్క ఐపీఓ (IPO) కూడా రాలేదు. ఎన్నికల హడావుడి వల్ల ఏప్రిల్‌ – జూన్‌లో పబ్లిక్‌ ఇష్యూలు చాలా తక్కువగా ఉండేవి. ఈసారి మాత్రం ట్రెండ్‌ మారింది. వచ్చేవారం మూడు మెయిన్‌బోర్డు ఐపీఓలు రూ.6,400 కోట్ల సమీకరణకు సిద్ధమవడం విశేషం. భారత క్యాపిటల్‌ మార్కెట్లు, దేశ దీర్ఘకాల వృద్ధిపై పెరుగుతున్న విశ్వాసానికి ఇది నిదర్శనమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

* నూతన ఆవిష్కరణలకు కేంద్రంగా భావించే అమెరికాలోని సిలికాన్‌ వ్యాలీలో జరిగే అత్యధిక ఇన్నోవేషన్లకు భారతీయులే నాయకులని ‘సిలికాన్‌ వ్యాలీ సెంట్రల్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌’ సీఈఓ హర్బీర్‌ కె భాటియా తెలిపారు. ఇండియన్స్‌ లేకుండా అగ్రరాజ్య టెక్‌ పరిశ్రమ మనుగడ సాగించలేదని పేర్కొన్నారు. గతంలో సేకరించిన సమాచారం ప్రకారం.. సిలికాన్‌ వ్యాలీలోని 40 శాతం సీఈఓలు/వ్యవస్థాపకులు దక్షిణాసియా లేదా ఇండియా నుంచి వచ్చినవారేనని భాటియా తెలిపారు. గూగుల్, యూట్యూబ్, మైక్రోసాఫ్ట్‌ వంటి ప్రధాన కంపెనీలన్నింటికీ భారతీయులే నేతృత్వం వహిస్తున్నారని గుర్తుచేశారు. కష్టపడేతత్వం, మెరుగైన ఉత్పాదకత వంటి విలువలే మనల్ని ఉన్నతస్థానాలకు చేర్చుతున్నాయని అభిప్రాయపడ్డారు. ‘‘మనం స్కూళ్లో ఉన్నప్పుడు 98 శాతం మార్కులు సాధిస్తే 100 శాతం ఎందుకు రాలేదని తల్లిదండ్రులు ప్రశ్నిస్తారు. ఈ సంస్కృతే మనల్ని ఇతరుల నుంచి భిన్నంగా ఉంచుతోంది. మనం ఎప్పటికీ సంతృప్తి చెందబోం. ఆ తహతహే మరింత ముందుకు తీసుకెళ్తోంది’’ అని భాటియా వివరించారు. సమస్యలను పరిష్కరించడంలో భారతీయులది చాలా ప్రత్యేకమైన మార్గమని కొనియాడారు. సిలికాన్‌ వ్యాలీ విజయంలో మనది చాలా కీలక పాత్ర అని తెలిపారు. అమెరికా టెక్‌ పరిశ్రమ కార్యకలాపాలన్నీ భారతీయులే నిర్వహిస్తున్నారని భాటియా తెలిపారు. ఒక ఉద్యోగి అమెరికన్‌ అయితే.. ముగ్గురు భారత్‌ నుంచి పనిచేస్తుంటారని పేర్కొన్నారు. ప్రతి టెక్‌ కంపెనీ ఆదాయానికి భారతీయులే మూలమని తెలిపారు. టెక్‌, సాగు, ఆరోగ్య సంరక్షణ ఇలా ఏ రంగంలోనైనా పనిచేయగల సామర్థ్యం ఇండియన్స్‌లో ఉందని తెలిపారు. అందుకే వీసాలపై అమెరికా పరిమితి విధిస్తోందని చెప్పారు. లేదంటే ఉద్యోగాలన్నింటినీ మనవాళ్లే సొంతం చేసుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు.

* యాపిల్‌ వాచ్‌ (Apple watch) ఓ మహిళ జీవితాన్ని కాపాడింది. అందులోని పల్స్‌ రేట్‌ ఫీచర్‌ ఆధారంగా అలర్ట్‌ అయిన ఆమె సరైన సమయంలో ఆసుపత్రికి వెళ్లి ప్రాణాలు దక్కించుకుంది. దీనికి సంబంధించిన వివరాలను ఓ ఆంగ్ల మీడియాతో పంచుకున్నారు. దీనిపై యాపిల్‌ సీఈఓ కూడా స్పందించడం విశేషం. దిల్లీలో పాలసీ పరిశోధకురాలిగా స్నేహ సిన్హా పనిచేస్తున్నారు. ‘‘నాకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవు. ఎక్కువగా ప్రయాణాలు చేస్తుంటా. 15,000-16,000 అడుగుల ఎత్తైన పర్వత ప్రాంతాల్లోనూ ట్రెక్కింగ్ చేస్తా. అలాంటి ప్రదేశాల్లో ఆక్సిజన్‌ తక్కువగా ఉంటుంది. అయితే.. ఒక రోజు ఎప్పటిలానే పని ముగించుకొని ఇంటికి వచ్చాను. ఎందుకో గుండెలో దడగా అనిపించింది. నా చేతిలోని యాపిల్‌ వాచ్‌ను చూస్తే హార్ట్‌రేట్‌ ఎక్కువగా చూపిస్తోంది. గట్టిగా శ్వాస తీసుకోవడానికి ప్రయత్నించాను. కొద్దిసేపటికి సర్దుకుంటుందిలే అనుకున్నా. పెద్దగా పట్టించుకోలేదు. అయితే 1.5 గంటలు దాటినా హార్ట్‌రేట్‌ ఎక్కువగా చూపిస్తోంది. అసాధారణ హృదయ స్పందన అంటూ హెచ్చరించింది. వైద్య సహాయం తీసుకోవాలని అప్పుడే నిర్ణయించుకున్నా. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లమని స్నేహితుడికి ఫోన్‌ చేశా. అక్కడకు చేరే వరకూ వాచ్‌లోని పల్స్‌ రేటును గమనిస్తూనే ఉన్నా. సరైన సమయానికి ఆసుపత్రికి వెళ్లి ప్రాణాలు దక్కించుకున్నా’’ అని స్నేహ సిన్హా తెలిపారు.

* విద్యుత్‌ సరఫరాలో తరచూ ఏర్పడుతున్న అంతరాయాల వల్ల పరిశ్రమలకు తీవ్ర నష్టం వాటిల్లుతున్నది. ముఖ్యంగా నిరంతరం ప్రాసెసింగ్‌ ఉండే ప్లాస్టిక్‌, అల్యూమినియం ఉత్పత్తులకు సంబంధించిన పరిశ్రమల్లో స్క్రాప్‌ అంతకంతకు పెరిగిపోతున్నది. అకస్మాత్తుగా కరెంటు పోతుండటం వల్ల ఎంసీబీలు, ఇతర ఎలక్ట్రానిక్‌ వస్తువులు పాడవుతున్నాయి. కరెంటు ఎప్పుడు పోతుందో, ఎంతసేపు పోతుందో తెలియక వ్యాపారవేత్తల ఆందోళనకు గురవుతున్నాయి. ఇప్పటికే ఒకవైపు ఖర్చులు పెరిగి ఇబ్బందులు ఎదుర్కొంటున్న పారిశ్రామికవేత్తలపై కరెంట్‌ రూపంలో షాక్‌ తగులుతున్నది. రాష్ట్రంలో అధికారికంగా విద్యుత్‌ కోతలు లేకపోయినప్పటికీ పలు కారణాలతో తరుచూ విద్యుత్‌ సరఫరాలో అంతరాయాలు ఏర్పడుతున్నాయి. సహజంగా ఉత్పత్తి పూర్తయ్యేవరకు విద్యుత్‌ నిరంతరంగా సరఫరా అయితే ఉత్పత్తులు నాణ్యమైనవి కాకుండా ఖర్చులు కూడా కలిసిరానున్నాయి. అనధికార కోతలతో తరుచుగా చిన్న స్థాయి పరిశ్రమల యంత్రాలు నిలిచిపోతుండటంతో నాణ్యత దెబ్బతినడంతోపాటు స్క్రాప్‌ పెరిగిపోయింది. ముఖ్యంగా చర్లపల్లి, బాలానగర్‌, జీడిమెట్ల, నాచారం, మల్లాపూర్‌ తదితర పారిశ్రామికవాడల్లో రోజూ నాలుగైదుసార్లు విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడుతున్నది. దీనివల్ల ముఖ్యంగా నిరంతరం ప్రాసెసింగ్‌ ఉండే పరిశ్రమలపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతున్నది. ప్లాస్టిక్‌, అల్యూమినియం పరిశ్రమల్లో నిరంతరం ప్రాసెసింగ్‌ ఉంటుంది.

* బోగస్‌ కంపెనీలకు రూ.45.81 కోట్ల వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) రిఫండ్స్‌కు సహకరించిన ఐదుగురు అధికారులను నగర నేర పరిశోధన విభాగం పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకెళ్తే.. వేమిరెడ్డి రాజా రమేష్‌రెడ్డి, నీరజ్‌ సఖుజ, ఇందర్‌ కుమార్‌, ఎం గిరిధర్‌రెడ్డి, వినీల్‌ చౌదరి, సుప్రియ పాండె, గౌరవ్‌లు కలిసి వేర్వేరుగా ఎలక్ట్రికల్‌ బైక్స్‌ తయారీ యూనిట్లకు సంబంధించి ఏడు బోగస్‌ సంస్థలను స్థాపించారు. అందుకోసం నగరంలోని పలువురు ఇండ్ల యజమానుల వద్ద నుంచి ఎలక్ట్రిసిటీ బిల్లులు సేకరించి వాటితో నకిలీ రెంటల్‌ అగ్రిమెంట్లు సృష్టించారు. అనంతరం జీఎస్టీ పోర్టల్‌లో ఈ నకిలీ పత్రాలతో కూడిన ఏడు బోగస్‌ సంస్థలను నమోదు చేశారు. ఆపై వారి ట్యాక్స్‌ కన్సల్టెంట్‌ చిరాగ్‌ శర్మ సహాయంతో నకిలీ ఇన్వాయిస్‌, నకిలీ ఈ-వే బిల్స్‌, పార్ట్‌-ఏ, పార్ట్‌-బీ, ఇన్‌వార్డ్‌ సైప్లె బిల్స్‌ను ఆయా బోగస్‌ కంపెనీల పేరుమీద సృష్టించారు. ఈ క్రమంలో లేని కంపెనీలను ఉన్నట్టుగా చూపించి, జీఎస్టీ రిఫండ్స్‌కు దరఖాస్తు చేశారు. అయితే జీఎస్టీ రిఫండ్స్‌ రావడం కోసం నల్గొండ డివిజన్‌ జీఎస్టీ డిప్యూటీ కమిషనర్‌ పీతల స్వర్ణ కుమార్‌, అబిడ్స్‌ సర్కిల్‌ స్టేట్‌ ట్యాక్స్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ కే వేణుగోపాల్‌, మాదాపూర్‌-1 సర్కిల్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ పొదిల విశ్వకిరణ్‌, మాదాపూర్‌ సర్కిల్‌-2 డిప్యూటీ స్టేట్‌ జీఎస్టీ ఆఫీసర్‌ వేమవరపు వెంకట రమణ, మాదాపూర్‌ సర్కిల్‌-3 అసిస్టెంట్‌ కమిషనర్‌ మర్రి మహితలను నిందితులు సంప్రదించారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z