DailyDose

కర్ణాటకలో కారు ఫైట్-CrimeNews-May 25 204

కర్ణాటకలో కారు ఫైట్-CrimeNews-May 25 204

* కర్ణాటకలో కొందరు యువకులు రాత్రివేళ రోడ్డుపై హల్‌చల్‌ చేశారు. కార్లతో పరస్పరం ఢీకొట్టుకున్నారు. కర్రలతో దాడులు చేసుకున్నారు. మే 18న ఉడుపి ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ ఘటన (Group Fight in Karnataka)కు సంబంధించిన దృశ్యాలు తాజాగా సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ (Viral Video)గా మారాయి. ఉడుపి (Udupi)- మణిపాల్‌ హైవేపై ఈ ఘటన చోటుచేసుకుంది. రెండు కార్లలో వచ్చిన ఆరుగురు యువకులు వీరంగం సృష్టించారు. మొదట ఓ కారు వేగంగా వెనక్కి వచ్చి మరో వాహనాన్ని ఢీకొట్టింది. అందులో నుంచి యువకులు దిగి కర్రలతో కొట్టుకున్నారు. ఈ క్రమంలోనే కర్ర పట్టుకున్న ఓ యువకుడిని మరో గ్రూప్‌నకు చెందిన కారు ఢీకొనడటంతో తీవ్రంగా గాయపడ్డాడు.

* ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం మూలగుంట పాలెంలో తెదేపా నాయకుడి కారును గుర్తుతెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి తగలబెట్టారు. చిగురుపాటి శేషగిరి తన ఇంటి వద్ద పార్క్ చేసిన కారును శుక్రవారం అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తి వచ్చి పెట్రోల్ పోసి తగులబెట్టాడ్డు. తెదేపా నేత అయిన శేషగిరి.. లారీ యజమానుల సంఘానికి అధ్యక్షుడిగా పని చేస్తున్నారు. ఆయనకున్న ఖాళీ ప్రదేశంలో ఇటీవల ఎన్నికల సందర్భంగా పార్టీ కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేశారు. వ్యాపార లావాదేవీల కారణంగా ఎవరైనా కక్షకట్టి కారు దహనం చేశారా? లేదా దీని వెనుక రాజకీయ కారణాలేమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై కొండపి ఎమ్మెల్యే డోల వీరాంజనేయ స్వామి ఎస్పీకి ఫోన్ చేసి రాజకీయ కోణంలో కూడా దర్యాప్తు నిర్వహించాలని కోరారు.

* ఛత్తీస్‌గఢ్‌ (Chhattisgarh)లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బెమెతరా జిల్లాలో గన్‌పౌడర్‌ తయారీ పరిశ్రమ (Gun Powder manufacturing factory)లో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 17 మంది మృతి చెందగా.. పలువురు గాయపడినట్లు సమాచారం. రోజూ మాదిరిగానే ఈ ఉదయం పరిశ్రమకు వచ్చిన కూలీలు తయారీ పనులు మొదలుపెట్టిన కాసేపటికే ఈ ప్రమాదం (Blast) చోటుచేసుకుంది. సమాచారమందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు పేలుడు ధాటికి నేలపై 20 అడుగుల బిలం ఏర్పడింది. అందులో పలువురు చిక్కుకుని ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. ప్రమాదం కారణంగా పరిశ్రమ వద్ద దట్టమైన పొగ అలుముకుంది. బెమెతరా జిల్లా కలెక్టర్‌ రణ్‌బీర్‌ శర్మ ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలను పరిశీలిస్తున్నారు. మృతుల సంఖ్యపై ఇంకా స్పష్టత లేదు. అయితే పదుల సంఖ్యలోనే ఉండొచ్చని తెలుస్తోంది.

* సందర్భం ఏదైనా మత్తులో మునిగి తేలాలి. కిక్‌ ఎక్కించే డ్రగ్స్‌ను ఆస్వాదించాలి. కొత్త ఆనందాలను జుర్రుకోవాలి. వేలంవెర్రిగా మారిన ఈ పార్టీ సంస్కృతి వయో బేధం లేకుండా మాదకద్రవ్యాలను దగ్గర చేస్తోంది. ఇటీవల బెంగళూరులో రేవ్‌పార్టీ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తించింది. సినీ, వ్యాపార, రాజకీయ వర్గాలకు చెందిన ఎంతోమంది ఆ వేడుకలో పాల్గొన్నట్టు పోలీసులు నిర్దారించారు. ఖరీదైన డ్రగ్స్‌ తీసుకున్నట్టు వైద్యపరీక్షల్లోనూ గుర్తించారు. దీంతో ఒకప్పుడు హైదరాబాద్, శివారు ప్రాంతాల్లోని రిసార్ట్స్, ఫామ్‌హౌస్‌ల్లో సాగిన రేవ్, ముజరారే పార్టీలకు బెంగళూరు వేదికగా మారటం చర్చనీయాంశంగా మారింది. కొద్దిసమయంలో భారీఎత్తున డబ్బు సంపాదించేందుకు కొన్ని ఈవెంట్‌ సంస్థలు, కొందరు డీజేలు ఆ ప్రాంతాన్ని అడ్డాగా మలచుకున్నట్టు నగర పోలీసులు అంచనాకు వచ్చారు. గోవా, హైదరాబాద్‌ల్లో టీఎస్‌ న్యాబ్‌ నిఘా పెరగటంతో రూటు మార్చారు. తాజాగా వెలుగుచూసిన ఘటనతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. వేడుకల ముసుగులో డ్రగ్స్‌ దందాకు పాల్పడుతున్న ఈవెంట్స్‌ నిర్వాహకులపై కన్నేశారు. ఇప్పటికే ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నట్టు సమాచారం. వీరిచ్చే సమాచారంతో మరో డ్రగ్‌ డాన్‌ ఆట కట్టించేందుకు నగర పోలీసులు సిద్ధమైనట్టు తెలుస్తోంది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z