Business

ఇండియాలో రేంజ్ రోవర్ కార్ల తయారీ-BusinessNews-May 25 2024

ఇండియాలో రేంజ్ రోవర్ కార్ల తయారీ-BusinessNews-May 25 2024

* రిలయన్స్‌కు చెందిన స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫామ్‌ జియో సినిమా (Jio Cinema) ప్రీమియం కొత్త వార్షిక సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌ను తీసుకొచ్చింది. కొన్నాళ్ల క్రితం నెలవారీ ప్లాన్‌ తీసుకొచ్చిన ఈ సంస్థ.. తాజాగా అందుబాటు ధరలో దీన్ని ప్రవేశపెట్టింది. ఈ సబ్‌స్క్రిప్షన్‌ కింద ఎలాంటి ప్రకటనలూ లేకుండా 4కె రిజల్యూషన్‌తో స్ట్రీమింగ్‌ వీడియోలను చూడొచ్చు. జియో తీసుకొచ్చిన వార్షిక ప్లాన్‌ ధర రూ.599. ప్రారంభ ఆఫర్‌ కింద వార్షిక సబ్‌స్క్రిప్షన్‌ ధరపై 50శాతం తగ్గింపును అందిస్తోంది. అంటే కేవలం రూ.299కే ప్లాన్‌ లభించనుంది. మొదటి 12 నెలల బిల్లింగ్‌ సైకిల్‌ ముగిశాక సబ్‌స్క్రిప్షన్‌ కావాలంటే పూర్తి మొత్తంలో రీఛార్జి చేసుకోవాల్సి ఉంటుంది. ఏడాది పొడవునా ఒక డివైజ్‌లో ఎలాంటి వాణిజ్య ప్రకటనలు లేకుండా కంటెంట్‌ను వీక్షించొచ్చు. అదీ 4కే వీడియో క్వాలిటీతో. డౌన్‌లోడ్‌ చేసుకొని ఆఫ్‌లైన్‌లోనూ కంటెంట్‌ను ఎంజాయ్‌ చేయొచ్చు. అయితే ప్రస్తుతం జరుగుతున్న ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (IPL) టోర్నమెంట్‌, ఇతర క్రీడలు, ప్రత్యక్ష ప్రసార ఈవెంట్‌లు మాత్రం యాడ్స్‌తో వస్తాయి. జియో మునుపటి వార్షిక ప్లాన్‌ రూ.999తో పోలిస్తే ఇది చాలా తక్కువ.

* రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు కొందరు రైలు ప్రయాణికులు (Train passengers) జనరల్‌ బోగీల్లోకి వెళ్లలేక.. రిజర్వేషన్‌ కంపార్ట్‌మెంట్‌లోకి వెళ్లిపోతుంటారు. ఎంతో కొంత ఫైన్‌ కట్టి గమ్యం చేరుకునేందుకు ప్రయత్నిస్తారు. కొన్నిసార్లు టీసీలు కూడా చూసీచూడనట్లు వదిలేస్తారు. ఏసీ కంపార్ట్‌మెంట్‌లో మాత్రం కచ్చితంగా నిబంధనలు పాటిస్తారు. రిజర్వేషన్‌ కన్ఫర్మ్‌ కాని వారిని, టికెట్‌ లేనివారిని ఆర్‌పీఎఫ్‌ (RPF) సిబ్బంది బయటకు పంపేస్తారు. కానీ, బ్రహ్మపుత్ర ఎక్స్‌ప్రెస్‌లో (Brahmaputra Express) ఓ కుటుంబానికి ఎదురైన అనుభవం సామాజిక మాద్యమాల్లో వైరల్‌ అవుతోంది. ఏసీ కంపార్ట్‌మెంట్‌, జనరల్‌ బోగీ కంటే దారుణంగా నిండిపోయింది. రిజర్వేషన్‌ కన్ఫర్మ్‌ కానివారు, అసలు టికెట్‌ తీసుకోనివారు కూడా అందులోకి వచ్చేయడంతో థర్డ్‌ ఏసీ బోగీ కాస్తా చేపల మార్కెట్‌లా తయారైంది.

* మీడియా వ్యాపారాలైన వయాకామ్‌ 18, స్టార్ ఇండియా విలీనానికి ముందడుగు పడింది. ప్రతిపాదిత విలీనానికి సంబంధించి ముకేశ్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (CCI) అనుమతి కోరింది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు చెందిన వయాకామ్‌ 18, ది వాల్ట్‌ డిస్నీ కంపెనీకి చెందిన స్టార్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌కు చెందిన వినోద వ్యాపారాలను విలీనం చేయనున్నామని, తద్వారా జాయింట్‌ వెంచర్‌ ఏర్పాటుకానుందని సీసీఐకు సమర్పించిన నోటీసులో పేర్కొంది. ఈ లావాదేవీల వల్ల దేశంలోని పోటీ వ్యాపారాలపై ఎలాంటి ప్రభావం పడబోదని రిలయన్స్‌ పేర్కొంది.

* టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ మరోసారి వార్తల్లో నిలిచారు. గూగుల్‌ సహ వ్యవస్థాపకుడు సెర్గీ బ్రిన్‌ (Google co-founder Sergey Brin) భార్య నికోల్‌ షానన్‌తో ఆయన వివాహేతర బంధం (Affair) సాగించారని, అందువల్లే సెర్గీ దంపతులు విడిపోయారని న్యూయార్క్‌ టైమ్స్‌ ఓ కథనం ప్రచురించింది. 2021లో నికోల్ (Nicole Shanahan) న్యూయార్క్‌లో తన పుట్టినరోజు వేడుకలు ఏర్పాటుచేశారు. ఆ పార్టీకి సెర్గీ స్నేహితుడైన ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) కూడా హాజరయ్యారు. ఆ సమయంలోనే వీరి మధ్య ప్రేమ బంధం మొదలైనట్లు సదరు కథనం పేర్కొంది. అదే ఏడాది డిసెంబరులో మియామీలో మస్క్‌ సోదరుడు ఇచ్చిన విందులో నికోల్‌ పాల్గొన్నారు. అక్కడ వీరిద్దరూ కెటమిన్‌ డ్రగ్స్‌ తీసుకున్నారని, కొన్ని గంటల పాటు కన్పించకుండా పోయారని ఆ పార్టీకి వచ్చిన నలుగురు ధ్రువీకరించినట్లు న్యూయార్క్‌ టైమ్స్‌ కథనం వెల్లడించింది. మస్క్‌తో తాను శారీరక సంబంధం కొనసాగిస్తున్నట్లు నికోల్‌ తన భర్త సెర్గీ బ్రిన్‌, ఇతర కుటుంబసభ్యుల ముందు అంగీకరించారట. ఈ విషయాన్ని మరో ముగ్గురు విశ్వసనీయ వర్గాలు చెప్పినట్లు ఆ కథనం పేర్కొంది. ఈ పార్టీ జరిగిన రెండు వారాల తర్వాత నుంచి విడివిడిగా ఉన్న సెర్గీ, నికోల్‌ 2022లో విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. దాదాపు 18 నెలల తర్వాత గతేడాది వీరికి విడాకులు మంజూరయ్యాయి. ప్రస్తుతం నికోల్‌ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి రాబర్ట్‌ ఎఫ్‌ కెన్నడీ జూనియర్‌కు రన్నింగ్‌ మేట్‌గా పోటీ చేస్తున్నారు.

* టాటా మోటార్స్‌కు చెందిన జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌ తన రేంజ్‌ రోవర్, రేంజ్‌ రోవర్‌ స్పోర్ట్‌ కార్లను భారత్‌లోనే తయారు చేయనుంది. సంస్థ 54 ఏళ్ల సుదీర్ఘ చరిత్రలో, బ్రిటన్‌ వెలుపల తొలిసారిగా ఈ మోడళ్లను తయారు చేయనుండడం విశేషం. ఇప్పటిదాకా ఈ రెండు మోడళ్లు బ్రిటన్‌లోని సొలిహల్‌ ప్లాంటులోనే తయారవుతున్నాయి. అక్కడి నుంచే భారత్‌ సహా 121 దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. మనదేశంలోనూ ఈ కార్లకు గిరాకీ పెరుగుతున్న నేపథ్యంలో, వినియోగదార్లకు కాస్త తక్కువ ధరలో అందుబాటులోకి తీసుకురావడం కోసం, ఇక్కడ తయారీకి ఉపక్రమించింది. దేశీయంగా విడిభాగాలు సమీకరిస్తున్నందున, స్థానికంగా ఉత్పత్తి అవుతున్న కారణంగా ఈ మోడళ్ల ధరలు 18-22% వరకు తగ్గే అవకాశం ఉంది. 15 ఏళ్ల కిందట టాటా గ్రూప్‌లోకి జేఎల్‌ఆర్‌ను రతన్‌ టాటా తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z