Devotional

తిరుమలలో భారీ రద్దీ-NewsRoundup-May 24 2024

తిరుమలలో భారీ రద్దీ-NewsRoundup-May 24 2024

* నటి శ్రుతిహాసన్‌ తన బాయ్‌ఫ్రెండ్‌తో విడిపోయినట్లు కొంతకాలంగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడిదే విషయంపై ఆమె క్లారిటీ ఇచ్చారు. ఇన్‌స్టా వేదికగా ‘ఆస్క్‌ మీ ఎనిథింగ్‌’ పేరిట ఫాలోవర్స్‌తో ముచ్చటించిన శ్రుతి.. తన రిలేషన్‌ స్టేటస్‌ గురించి మాట్లాడారు. ఇందులో ఓ నెటిజన్‌ ‘మీరు సింగిలా.. రిలేషన్‌లో ఉన్నారా’ అని ప్రశ్నించడంతో స్పందించారు. ‘నాకు ఈ తరహా ప్రశ్నలు నచ్చవు. కానీ, చెబుతున్నాను. ఇప్పుడు నేను సింగిలే. రిలేషన్‌ కోసం ఎదురుచూస్తున్నా. ప్రస్తుతానికి పనిలో మునిగిపోయాను. జీవితాన్ని ఎంజాయ్‌ చేస్తున్నా’ అని తెలిపారు.

* ప్రతిష్ఠాత్మక కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ (Cannes Film Festival) అట్టహాసంగా సాగుతోంది. ఈ వేడుకల్లో దాదాపు మూడు దశాబ్దాల తర్వాత ఓ భారతీయ చిత్రం కాంపిటీషన్‌లో ఉంది. కేన్స్‌ ఉత్సవంలో ప్రధాన విభాగమైన ‘పామ్‌ డి ఓర్‌ (Palme d’Or)’ అవార్డుల కేటగిరీలో.. మలయాళీ చిత్రం ‘ఆల్‌ వి ఇమేజిన్‌ యాజ్‌ లైట్‌’ (All We Imagine as Light) పోటీలో నిలిచింది. మే 23న ఈ సినిమాను ప్రదర్శించారు. ఈ సందర్భంగా చిత్ర బృందం రెడ్‌ కార్పెట్‌పై మెరిసింది.

* దిల్లీ మద్యం కేసులో అరెస్టయిన భారాస ఎమ్మెల్సీ కవిత బెయిల్‌ పిటిషన్లపై దిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది. బెయిల్‌పై మే 27న కౌంటర్ దాఖలు చేస్తామని సీబీఐ తెలిపింది. జూన్ 7న ఛార్జిషీట్‌ దాఖలు చేయనున్నట్లు కోర్టుకు వెల్లడించింది. మరోవైపు కవిత బెయిల్ పిటిషన్‌పై ఈడీ కౌంటర్ దాఖలు చేసింది. ఈ కేసులో వాదనలు వినిపించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు ఈడీ తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు.

* లోక్‌సభ ఎన్నికల వేళ ఓటింగ్‌కు సంబంధించిన తుది సమాచారాన్ని పోలింగ్‌ కేంద్రాల వారీగా వెబ్‌సైట్లో అందుబాటులో ఉంచేలా ఎన్నికల సంఘాన్ని (Election Commission) ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను ప్రస్తుతం పరిగణనలోకి తీసుకునేందుకు భారత సర్వోన్నత న్యాయస్థానం (Supreme Court) నిరాకరించింది. అలా ప్రచురించేందుకు ఈసీ భారీ స్థాయిలో మానవ వనరులను సమకూర్చుకోవాల్సి ఉంటుందని అభిప్రాయపడింది. ఇప్పటికే ఐదు దశల పోలింగ్‌ ముగిసిన నేపథ్యంలో ప్రస్తుతానికి ఈసీని అలా ఆదేశించలేమని తెలిపింది. లోక్‌సభ ఎన్నికలు (Lok Sabha Elections) పూర్తైన తర్వాత ఈ అంశంపై సాధారణ బెంచ్‌ విచారణ చేస్తుందని జస్టిస్‌ దీపాంకర్‌ దత్తా, జస్టిస్‌ సతీశ్‌ చంద్ర శర్మలతో కూడిన వెకేషన్‌ బెంచ్‌ స్పష్టం చేసింది.

* పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరాచకాలు ఒక్కొక్కటిగా ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయని తెదేపా సీనియర్‌ నేత కనకమేడల రవీంద్రకుమార్‌ విమర్శించారు. దీనికి సంబంధించి ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ‘‘మాచర్ల నియోజకవర్గం సమస్యాత్మక ప్రాంతమైనా సరైన బందోబస్తు ఏర్పాటు చేయలేదు. దేశంలో ఎక్కడా లేని రీతిలో హింస చోటు చేసుకున్నా అరెస్టు లేదు. ఈసీ అరెస్టు చేయాలని ఆదేశించినా పోలీసులు జాప్యం చేశారు. హింసాత్మక చర్యలకు సహకరించి ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేశారు. తెదేపా ఏజెంట్‌ నంబూరిపై హత్యాయత్నం చేసినా కేసు లేదు. కౌంటింగ్‌లో నిష్పక్షపాతంగా వ్యవహరిస్తారా అన్న అనుమానం కలుగుతోంది.

* ఆప్‌ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మాలీవాల్‌ (Swati Maliwal) తన పదవికి రాజీనామా చేసేది లేదని స్పష్టం చేశారు. పార్టీ నేతలు మర్యాదపూర్వకంగా అభ్యర్థిస్తే పదవి నుంచి వైదొలగేదాన్నన్నారు. అలా కాకుండా దాడి చేయడంతో.. ఇప్పుడు పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదన్నారు.

* భారాస హత్యా రాజకీయాలు చేయడం దురదృష్టకరమని మంత్రి జూపల్లి కృష్ణారావు విమర్శించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘భారాస కార్యకర్త శ్రీధర్‌రెడ్డి హత్య అంశంపై ఆ పార్టీ నిరాధార ఆరోపణలు చేస్తోంది. మృతుడికి అనేక వివాదాల్లో ప్రమేయం ఉంది. గతంలో మా కార్యకర్తలు మరణించినప్పుడు నేను ఇలా ఆరోపణలు చేయలేదు. హత్యలను రాజకీయాలకు ముడిపెట్టి మాట్లాడటం సరికాదు. శ్రీధర్‌రెడ్డికి ఆయన కుటుంబంలోనే తగాదాలున్నాయి. కేటీఆర్‌, ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ అర్థంపర్థం లేని ఆరోపణలు చేస్తున్నారు. దీనికి వాళ్లు క్షమాపణలు చెప్పాలి’’ అని జూపల్లి డిమాండ్‌ చేశారు.

* కాంగ్రెస్‌కు అనుబంధంగా ఉన్నవారిపై కేసులు ఎందుకు పెట్టట్లేదని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ఎక్స్‌(ట్విటర్‌) వేదికగా ప్రశ్నించారు. డీజీపీ, టీజీఎస్‌ఆర్టీసీ ఎండీకి ఆయన ప్రశ్నలు సంధించారు. ఆర్టీసీ కొత్త లోగో చూపుతున్న వారిపై కేసులు ఎందుకు పెట్టట్లేదని నిలదీశారు. రాజకీయ పెద్దల మాటలు విని వేధిస్తే మిమ్మల్ని కోర్టుకు లాగుతామని హెచ్చరించారు.

* ఇరాన్ దివంగత అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ (Ebrahim Raisi) మరణానికి దారితీసిన హెలికాప్టర్ ప్రమాదంపై (Iran Presidents Helicopter crash) ఆ దేశ సాయుధ దళాల జనరల్ స్టాఫ్ తొలి నివేదికను విడుదల చేశారు. ఘటన తర్వాత వివిధ విభాగాలకు చెందిన నిపుణులతో కూడిన దర్యాప్తు బృందం సోమవారం ఉదయం ప్రమాద స్థలానికి చేరుకున్నట్లు నివేదికను ఉటంకిస్తూ తస్నిమ్ వార్తా సంస్థ తెలిపింది

* టీమ్ఇండియా ప్రధాన కోచ్‌ పదవి కోసం బీసీసీఐ దరఖాస్తులను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. రాహుల్ ద్రవిడ్ పదవీకాలం జూన్ చివరితో ముగియనుంది. టీ20 ప్రపంచ కప్‌ ముగిసిన నాటి నుంచి కొత్త కోచ్‌ బాధ్యతలు చేపడతాడు. తాజాగా భారత కోచ్‌గా తీవ్ర స్థాయిలో ఒత్తిడి, రాజకీయాలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆసీస్‌ మాజీ ఆటగాడు జస్టిన్‌ లాంగర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

* శ్రీవారి దర్శనానికి తిరుమలలో శుక్రవారం రద్దీ నెలకొంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌, నారాయణగిరి షెడ్లు నిండిపోయాయి. రింగు రోడ్డు మీదుగా ఆక్టోపస్ భవనం వరకు సుమారు 3 కిలోమీటర్ల మేర భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. వీరికి శ్రీవారి దర్శనానికి 20 గంటల సమయం పడుతుందని తితిదే ప్రకటించింది. క్యూ లైన్లలో ఉన్న భక్తులకు అధికారులు తాగునీరు, అన్నప్రసాదాలు, పాలు అందిస్తున్నారు. ఈ రద్దీ వారాంతం వరకు కొనసాగే అవకాశం ఉంది. వేసవి సెలవులు, పోలింగ్‌ ప్రక్రియ పూర్తవడం, విద్యార్థుల పరీక్షల ఫలితాలు విడుదలైన నేపథ్యంలో తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య భారీగా పెరిగింది. ముఖ్యంగా శుక్ర, శని, ఆదివారాల్లో సామాన్య భక్తులు స్వామివారిని దర్శించుకోవాలంటే 30-40 గంటల సమయం క్యూలైన్‌లలో వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని, సామాన్యులకు శ్రీవారి దర్శనం కల్పించేందుకు గానూ జూన్‌ 30వ తేదీ వరకు వారాంతాల్లో (శుక్ర, శని, ఆది) వీఐపీ బ్రేక్‌ దర్శనం రద్దు చేస్తున్నట్లు తితిదే ప్రకటించింది.

* తాగునీటి కోసం వైకాపా, తెదేపా నాయకులు ఘర్షణకు దిగారు. ఈ ఘటన అనంతపురం జిల్లా డి.హీరేహాల్‌ మండలం సిద్ధాపురంలో చోటుచేసుకుంది. శుద్ధ జల ప్లాంట్‌ వద్ద తాగునీరు పట్టుకుంటూ మహిళలు గొడవపడ్డారు. ఈ గొడవలో వైకాపా నాయకులు జోక్యం చేసుకోవడంతో.. వారిని అడ్డుకోవడానికి తెదేపా నాయకులు వచ్చారు. వైకాపా వర్గీయులు దాడి చేయడంతో.. ఆరుగురు తెదేపా నేతలకు గాయాలయ్యాయి. వీరిని బళ్లారి విమ్స్‌కు తరలించారు. ఇరు వర్గాలపై పోలీసులు కేసు నమోదు చేశారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z