NRI-NRT

ఆస్ట్రేలియాలో షాద్‌నగర్ యువకుడు మృతి-CrimeNews-May 24 2024

ఆస్ట్రేలియాలో షాద్‌నగర్ యువకుడు మృతి-CrimeNews-May 24 2024

* చికిత్స కోసం పశ్చిమ బెంగాల్‌కు వచ్చి హత్యకు గురైన బంగ్లాదేశ్‌ ఎంపీ మహమ్మద్‌ అన్వర్‌ ఉల్‌ అనర్‌ (Anwarul Azim Anar) కేసులో మరిన్ని దారుణాలు వెలుగులోకి వస్తున్నాయి. ఓ మహిళతో ఆయనను వలపు వలలోకి లాగి హత్య చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసులో బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ఓ అక్రమ వలసదారుడిని కోల్‌కతా పోలీసులు అరెస్టు చేశారు. హత్య (Bangladesh MP Murder) అనంతరం మృతదేహాన్ని అదృశ్యం చేసేందుకు నిందితులు దారుణంగా ప్రవర్తించారని తెలుస్తోంది. దానిపై చర్మాన్ని ఒలిచి.. ముక్కలుగా నరికినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అన్వర్‌ హత్య కేసులో సీసీటీవీ దృశ్యాలను పోలీసులు పరిశీలించారు. అమెరికాలో నివసించే ఓ మిత్రుడు అద్దెకు తీసుకున్న టౌన్‌హాల్‌ ప్రాంతంలోని అపార్ట్‌మెంట్‌లోకి ఇద్దరు పురుషులు, ఒక మహిళతో కలిసి వెళ్లిన ఆయన.. ఆ తర్వాత తిరిగిరాలేదని గుర్తించారు. ‘‘బంగ్లా ఎంపీని ఓ మహిళతో హనీట్రాప్‌ చేయించి ఆ అపార్ట్‌మెంట్‌లోకి రప్పించి ఉంటారని ప్రాథమికంగా తెలుస్తోంది. మృతుడి స్నేహితుడికి ఆ మహిళ సన్నిహితురాలే. ఫ్లాట్‌లోకి వెళ్లగానే ఆయనను హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నాం’’ అని బెంగాల్‌ సీఐడీ (West Bengal CID) అధికారి ఒకరు వెల్లడించారు.

* నర్సింగ్‌ విద్యార్థిని అనుమానాస్పద మృతికి నిరసనగా భద్రాచలం పారా మెడికల్ కళాశాల వద్ద విద్యార్థులు, బంధువులు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. దీంతో ఇక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. నర్సింగ్‌ విద్యార్థిని కారుణ్య గురువారం ఉదయం అపస్మారక స్థితిలోకి వెళ్లారు. కళాశాల ప్రాంగణంలో గాయాలతో పడి ఉన్న ఆమెను.. యాజమాన్యం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించింది. అక్కడ చికిత్స పొందుతూ గురువారం సాయంత్రం మృతి చెందింది. విద్యార్థిని మృతితో పారా మెడికల్‌ కళాశాల వద్ద శుక్రవారం బంధువులు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వాసుపత్రి నుంచి ర్యాలీగా కళాశాల వద్దకు వచ్చారు. కారుణ్య కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. కళాశాలకు వచ్చిన ఛైర్మన్‌పై దాడికి విద్యార్థులు, బంధువులు యత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు.

* రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ వాసి అరటి అరవింద్ యాదవ్ (30) ఆస్ట్రేలియాలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. షాద్‌నగర్‌ భాజపా నేత అరటి కృష్ణ ఏకైక కుమారుడు అరవింద్.. ఉద్యోగరీత్యా సిడ్నీలో స్థిరపడ్డాడు. ఐదు రోజుల క్రితం నుంచి కనిపించకుండా పోగా కుటుంబ సభ్యులు అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత సోమవారం స్వదేశానికి వచ్చేందుకు కుటుంబ సభ్యులతో అరవింద్ ఏర్పాట్లు చేసుకున్నారని బంధువులు తెలిపారు. ఆస్ట్రేలియాలో వాతావరణం పడకపోవడంతో వారం రోజుల క్రితం తల్లి ఉషారాణి షాద్‌నగర్‌ వచ్చింది. సోమవారం అరవింద్ కుటుంబంతో కలిసి స్వగ్రామానికి వచ్చేందుకు విమాన టికెట్లు బుక్ చేసుకున్నాడు. అతడి భార్య గర్భిణి. కారు వాష్ చేయించుకుని వస్తానని చెప్పిన అరవింద్‌ తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో సముద్రంలో ఓ యువకుడి శవం లభ్యమైనట్టు స్థానిక పోలీసులు గుర్తించారు. డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించి ఆ శవం అరవింద్‌దేనని ధ్రువీకరించారు. అతడిది హత్యా ? లేక ఆత్మహత్యా ?అన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.

* హరియాణాలోని అంబాలాలో దిల్లీ-జమ్మూ జాతీయ రహదారిపై తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మినీ బస్సును ట్రక్కు ఢీకొన్న ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారు. మరో 20 మందికి పైగా గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారిగా గుర్తించారు. యూపీ నుంచి జమ్ములోని వైష్ణోదేవి తీర్థయాత్రకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z