Business

కొంతమేర తగ్గిన నిరుద్యోగిత-BusinessNews-May 24 2024

కొంతమేర తగ్గిన నిరుద్యోగిత-BusinessNews-May 24 2024

* టెక్‌ ప్రపంచంలో కృత్రిమ మేధ (Artificial Intelligence – AI ) సరికొత్త విప్లవానికి నాంది పలుకుతోంది. ఆ దిశగా జరుగుతున్న ప్రయోగాలు, పరిశోధనలు ఓ వైపు ఆసక్తి రేకెత్తిస్తూనే.. మరోవైపు ఆందోళనకూ గురిచేస్తున్నాయి. ఉపాధి అవకాశాలు కనుమరుగవుతాయనే వాదన కొన్ని వర్గాల నుంచి బలంగా వినిపిస్తోంది. దీనిపై టెక్‌ నిపుణులు చేస్తున్న వ్యాఖ్యలను నేటి యువతరం నిశితంగా పరిశీలిస్తోంది. ఇటీవల మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల.. ఏఐని మనుషుల్లా చూడడం ఆపాలని గట్టిగానే హెచ్చరించారు. ఈ క్రమంలోనే తాజాగా ప్యారిస్‌ కేంద్రంగా ‘వివా టెక్‌’ పేరిట నిర్వహించిన స్టార్టప్‌ సదస్సులో టెస్లా సీఈవో ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) చేసిన వ్యాఖ్యలు ఆసక్తిగా మారాయి. రాబోయే రోజుల్లో ఉద్యోగం చేయడం ఒక వ్యాపకంగా మారుతుందని ఎలాన్ మస్క్‌ అభిప్రాయపడ్డారు. అన్ని ఉత్పత్తులు, సేవలను ఏఐ ఆధారిత సాధనాలు, రోబోలే అందిస్తాయని అంచనా వేశారు. అదే జరిగితే మనకెవ్వరికీ జాబ్స్‌ ఉండకపోవచ్చునని వివరించారు. అవసరమైతే ఒక వ్యాపకంగా మాత్రమే ఉద్యోగం చేసుకోవాల్సిన పరిస్థితులు రావొచ్చని తెలిపారు. అయితే, ఆ స్థితికి చేరుకోవడానికి ప్రపంచంలో ప్రతిఒక్కరికీ ‘యూనివర్సల్‌ హై ఇన్‌కమ్‌’ ఉండాల్సిన అవసరం ఉందన్నారు. పరోక్షంగా అందరికీ పెద్ద మొత్తంలో ఆదాయం ఉండాలని సూచించారు. దీనిపై ఆయన మరింత లోతుల్లోకి మాత్రం వెళ్లలేదు.

* కెరీర్‌లో సక్సెస్‌ కావాలంటే కష్టపడి పనిచేసే తత్వం, వేగంగా నేర్చుకోవడం, స్మార్ట్‌గా వ్యవహరించడం, మంచి కమ్యూనికేషన్‌.. ఇలా రకరకాల లక్షణాలు అవసరమని చెబుతుంటారు. అమెజాన్‌ సీఈవో ఆండీ జస్సీ (Andy Jassy) మాత్రం ‘సానుకూల దృక్పథం’ వీటన్నింటి కంటే ముఖ్యమని సూచించారు. కెరీర్‌ ప్రారంభించిన మొదట్లో ప్రతిఒక్కరూ పాజిటివ్‌ యాటిట్యూడ్‌తో ఉండాలని.. అదే విజయతీరాలకు చేర్చుతుందని తెలిపారు. లింక్డిన్‌ సీఈవో ర్యాన్ రోస్లాన్‌స్కీకి ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాలు పంచుకున్నారు. సానుకూల దృక్పథం అంటే కేవలం ఉల్లాసంగా ఉండడం మాత్రమే కాదని జస్సీ (Amazon CEO Andy Jassy) అభిప్రాయపడ్డారు. నమ్మకమైన సహచరుడిగా ఉండడం, గడువులోగా లక్ష్యాల్ని చేరుకోవడం, సాధించగలననే స్ఫూర్తి వంటి లక్షణాలన్నీ అందులో భాగమని వివరించారు. సరైన మనస్తత్వాన్ని పెంపొందించుకోవడానికి ప్రతిఒక్కరూ తమకి తాము ఈ కింది ప్రశ్నలు సంధించుకోవాలని సూచించారు.

* మీమ్‌ ప్రపంచంలో సంచలనం సృష్టించిన జపనీస్‌ శునకం కబోసు కన్నుమూసింది. సోషల్‌మీడియాలో ‘వైరల్‌ డాగీ’గా పేరు పొందడమే కాదు, క్రిప్టో కరెన్సీ డాగీకాయిన్‌ లోగోనూ దీని ఫొటో ఉండేది. గత కొన్ని రోజులుగా లుకేమియాతో బాధపడుతున్న కబోసు మరణించినట్లు డాగీ కాయిన్‌ క్రిప్టోకరెన్సీ తన ఎక్స్‌ ఖాతా ద్వారా ప్రకటించింది. ‘మా కమ్యూనిటీ భాగస్వామి, స్నేహితురాలు కబోసు ప్రశాంతంగా కన్నుమూసింది. అపరిమితమైన సంతోషం, ప్రేమకు కబోసు చిరునామా. మీమ్‌ వరల్డ్‌లో తనదైన ముద్రవేసింది. అది ఎప్పుడూ మీ గుండెల్లో నిలిచిపోతుంది’ అని డాగీకాయిన్‌ ఎక్స్‌లో పోస్ట్‌ చేసింది. మీమ్‌ వరల్డ్‌లో భారతీయ నెటిజన్లకు ‘చిమ్‌టూ’గా ఈ శునకం సుపరిచితం. ఈ శునకం థీమ్‌తో రూపొందించిన మీమ్స్‌ విపరీతంగా వైరల్‌ అయ్యాయి. ముఖ్యంగా క్రికెట్‌, సినిమా, రాజకీయాలు, యూత్‌ అంశాలు, భార్యాభర్తలు, ప్రేమికుల జోక్స్‌ను చిమ్‌టూ ఫొటోలతో మీమర్స్‌ రూపొందించేవారు. పలు సామాజిక యాప్‌లు సైతం ప్రత్యేకంగా చిమ్‌టూ స్టిక్కర్లను తీసుకొచ్చాయి. 2010 నుంచి కబోసు చిత్రాలు ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతూ ఉండేవి. 2013లో క్రిప్టోకరెన్సీ డాగీకాయిన్‌ మొదలు పెట్టినప్పుడు కబోసును ప్రొఫైల్‌ పిక్‌గా తీసుకోవడంతో మరింత ప్రాచుర్యంలోకి వచ్చింది. మొదట్లో దీన్నో జోక్‌గా తీసుకున్నారు. అనతికాలంలోనే డాగీకాయిన్‌ క్రిప్టోకరెన్సీ ఇతర డాగ్‌ థీమ్‌ క్రిప్టోలను దాటడం గమనార్హం. గతేడాది ఏప్రిల్‌లో ఎక్స్‌ అధినేత ఎలాన్‌ మస్క్‌ కూడా ట్విటర్‌ లోగోగా కబోసు ఫొటోను కొన్ని రోజుల పాటు ఉంచారు. దీంతో డాగీ కాయిన్‌ క్రిప్టో విలువ మరింత పెరిగింది.

* కాలుష్యానికి తావు లేకుండా (నెట్‌ జీరో కార్బన్‌) సిమెంటు ఉత్పత్తి చేయాలనే లక్ష్యాన్ని సిమెంటు పరిశ్రమ నిర్దేశించుకోవాలని జేకే సిమెంట్‌ లిమిటెడ్‌ సీఈఓ, గ్రీన్‌ సిమెంటెక్‌ 2024 ఛైర్మన్‌ మాధవ్‌ కృష్ణ సింఘానియా సూచించారు. వాతావరణ మార్పులపై పోరాటానికి తమ వంతు కృషి ఈ విధంగా చేయాలని, ఇందువల్ల సిమెంటు కంపెనీలకూ ఆర్థిక ప్రయోజనాలు లభిస్తాయని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్‌లో గురువారం సీఐఐ గ్రీన్‌ సిమెంటెక్‌ 2024 ప్రారంభ సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘ప్రపంచ వ్యాప్తంగా సిమెంటు ఉత్పత్తిలో మనదేశం రెండో స్థానంలో ఉంది. మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, స్థిరాస్తి నిర్మాణాల నుంచి లభించే డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకుని దేశీయ సిమెంటు పరిశ్రమ 2026 వరకూ ఏటా 7% వృద్ధి సాధిస్తుందన్నది అంచనా. తగిన జాగ్రత్తలు తీసుకోని పక్షంలో సిమెంటు ఉత్పత్తి వల్ల ఎంతో కాలుష్యం వెలువడి, పర్యావరణానికి నష్టం చేకూరుతుంది. అందుకే కాలుష్యానికి తావులేని రీతిలో సిమెంటు ఉత్పత్తి చేయడానికి అనువైన వ్యూహాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆవిష్కరించడానికి సీఐఐ గ్రీన్‌ సిమెంటెక్‌ 2024 కృషి చేస్తోంద’ని మాధవ్‌ కృష్ణ సింఘానియా వివరించారు.

* అమెరికాలో గతవారం నిరుద్యోగ భృతి కోసం అప్లయి చేసుకునే వారి సంఖ్య తగ్గినట్లు తెలుస్తోంది. లేబర్ డిపార్ట్‌మెంట్ గణాంకాల ప్రకారం.. మే 18తో ముగిసిన వారానికి స్టేట్‌ అన్‌ఎంప్లాయిమెంట్‌ బెన్ఫిట్స్‌ కోసం అప్లయి చేసుకునే వారి సంఖ్య 8,000 తగ్గి 215,000కి చేరింది. ఆర్థికవేత్తల అంచనా ప్రకారం తాజా వారంలో 220,000మంది నిరుద్యోగ భృతి కోసం అప్లయి చేసుకునే అవకాశం ఉందని అంచనా వేశారని రాయిటర్స్ కథనం వెల్లడించింది. మార్చి 2022 నుండి ఫెడరల్ రిజర్వ్ నుండి 525 బేసిస్ పాయింట్ల విలువైన వడ్డీ రేటు పెంపు నేపథ్యంలో లేబర్ మార్కెట్ స్థిరంగా కొనసాగుతున్నట్లు తేలింది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z