DailyDose

After9 పబ్‌పై పోలీసు దాడి-CrimeNews-May 05 2024

After9 పబ్‌పై పోలీసు దాడి-CrimeNews-May 05 2024

* దైవ దర్శనం కోసం వెళ్తున్న సమయంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన రాజస్థాన్‌లోని సవాయ్‌ మాధోపూర్‌ జిల్లాలో ఢిల్లీ – ముంబయి ఎక్స్‌ప్రెస్‌ వేపై ఆదివారం ఉదయం జరిగింది. ఈ ఘటనలో మరో ఇద్దరు చిన్నారులు గాయపడ్డారు. బౌన్లీ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని బనాస్‌ వంతెన సమీపంలో ఉదయం 8 గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగింది. రణతంబోర్‌ గణేశ్‌ ఆలయ దర్శనానికి వెళ్తున్న సమయంలో ప్రమాదం చోటు చేసుకున్నది. మృతులను సికార్‌కు చెందిన వ్యక్తులుగా గుర్తించారు. గుర్తు తెలియని వాహనం వేగంగా ఢీకొట్టడంతో అందులో ఉన్న ఆరుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చూరీకి తరలించారు. ఇద్దరు పిల్లలను మొదల బౌన్లీలోని కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌కు తరలించారు. ఆ తర్వాత జైపూర్‌కు రిఫర్‌ చేశారు.

* జస్థాన్‌లోని కోటాలో ఘోరం చోటుచేసుకుంది. ద్విచక్రవాహనం పార్కింగ్‌ విషయంలో సోదరుల మధ్య చెలరేగిన గొడవ తమ్ముడి ప్రాణాన్ని బలితీసుకుంది. కోటాలోని సుకేత్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగిన ఈ ఘటనపై పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. జిరి గ్రామంలో ఇంటి బయట ద్విచక్రవాహనం పార్కింగ్‌ చేయడంపై సన్వార భీల్‌ (38), అతడి తమ్ముడు మనోజ్‌ భీల్‌ (30) మధ్య శుక్రవారం అర్ధరాత్రి వివాదం తలెత్తింది. వారిద్దరి మధ్య మాటామాటా పెరగడంతో సన్వారా భీల్‌ తమ్ముడిపై గొడ్డలితో దాడి చేశాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. మనోజ్‌ను కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు వెల్లడించారు. విషయం తెలుసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. అతడిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

* బంజారాహిల్స్ రోడ్డు నంబర్‌ 14లోని ‘ఆఫ్టర్ నైన్‌’ పబ్‌పై శనివారం అర్ధరాత్రి తర్వాత పశ్చిమ మండల టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దాడులు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా సమయం దాటిన తర్వాత పబ్‌ కొనసాగుతోందని.. అందుకే దాడులు చేసినట్లు వెల్లడించారు. కస్టమర్లను ఆకర్షించేందుకు వివిధ రాష్ట్రాలకు చెందిన 40 మంది యువతులతో నిర్వాహకులు అసభ్యకరమైన నృత్యాలు చేయిస్తున్నారని తెలిపారు. ఈ మేరకు బంజారాహిల్స్ పోలీసులు పబ్‌పై కేసు నమోదు చేశారు. 160 మంది యువతీ యువకులను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. వీరందరికీ 41ఏ సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేసి వివరాలు సేకరించి పంపుతున్నారు. యువతులను మహిళా పునరావాస కేంద్రానికి తరలిస్తామని పోలీసులు చెప్పారు. మరోవైపు పబ్‌లో నిషేధిత మాదక ద్రవ్యాలు వినియోగిస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు.

* ఒక బాలికపై అత్యాచారానికి ఇద్దరు వ్యక్తులు యత్నించారు. ఈ విషయం తెలుసుకున్న జనం వారిద్దరిని నిర్బంధించి కొట్టి చంపారు. గుంపు చెర నుంచి వారిని విడిపించేందుకు పోలీసులు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. (Mob Lynched Two Men) మేఘాలయలోని ఈస్టర్న్ వెస్ట్ ఖాసీ హిల్స్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. శనివారం నోంగ్తిలీవ్‌ గ్రామంలోని ఒక ఇంట్లో ఒంటరిగా ఉన్న 17 ఏళ్ల బాలికపై ఇద్దరు వ్యక్తులు కత్తితో దాడి చేశారు. ఆమెను బెదిరించి లైంగిక దాడికి ప్రయత్నించారు. కాగా, ఆ బాలిక కేకలు వేయగా స్థానికులు అక్కడకు చేరుకున్నారు. బాలికపై అత్యాచారానికి ప్రయత్నించిన ఇద్దరు వ్యక్తులను పట్టుకుని సమీపంలోని కమ్యూనిటీ హాల్‌ వద్దకు తీసుకెళ్లారు. అక్కడ సుమారు 1500 మంది గుమిగూడారు. వారంతా కలిసి ఆ ఇద్దరు వ్యక్తులను కట్టేసి దారుణంగా కొట్టారు. మరోవైపు ఈ విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకున్నారు. జనం చెర నుంచి ఆ ఇద్దరు వ్యక్తులను రక్షించేందుకు ప్రయత్నించారు. అయితే వారిని అక్కడి నుంచి తీసుకెళ్లేందుకు పోలీసులను జనం అనుమతించలేదు. ఇంతలో ఒక గుంపు ఆ ఇద్దరు వ్యక్తులను మరోసారి చావకొట్టారు. చివరకు అచేతనంగా పడి ఉన్న వారిద్దరిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. అయితే వారు అప్పటికే మరణించినట్లు డాక్టర్లు తెలిపారు. మృతులు ఇద్దరూ ఆ గ్రామంలో కార్మికులుగా పని చేస్తున్నారని పోలీసులు తెలిపారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z