Politics

ఏపీ పోలీస్ బాస్‌గా హరీశ్‌కుమార్ గుప్తా-NewsRoundup-May 06 2024

ఏపీ పోలీస్ బాస్‌గా హరీశ్‌కుమార్ గుప్తా-NewsRoundup-May 06 2024

* ఆంధ్రప్రదేశ్‌ నూతన డీజీపీగా 1992 ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందిన హరీశ్‌కుమార్‌ గుప్తాను ఎన్నికల సంఘం నియమించింది. తక్షణమే విధుల్లో చేరాలని ఆదేశించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయాల్సిందిగా సీఎస్‌ జవహర్‌రెడ్డికి సమాచారం అందించింది. ఏపీ డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌పై ఆదివారం కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) బదిలీ వేటు వేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నూతన డీజీపీ పోస్టులో నియమించేందుకు ముగ్గురు పేర్లతో కూడిన ప్యానెల్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఈసీకి పంపింది. సీనియార్టీ జాబితాలో ఉన్న ఐపీఎస్‌ అధికారులు ద్వారకా తిరుమలరావు (ఆర్టీసీ ఎండీ ), మాదిరెడ్డి ప్రతాప్‌, హరీశ్‌కుమార్‌ గుప్తా పేర్లను సిఫార్సు చేయగా హరీశ్‌కుమార్‌ గుప్తాను ఈసీ ఎంపిక చేసింది.

* ప్రకాశం జిల్లాలో అధికార వైకాపాకు ఉద్యోగులు షాకిస్తున్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ ఓట్లను కొల్లగొట్టేందుకు ఆ పార్టీ నేతలు, అభ్యర్థులు ప్రలోభాల వల విసురుతున్నారు. గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో వార్డులు, డివిజన్ల వారీగా ఇన్‌ఛార్జిలను నియమించి పోస్టల్‌ బ్యాలట్‌ ఓట్లను కొల్లగొట్టేందుకు వ్యూహం పన్నారు. గత అయిదేళ్లుగా అధికార పార్టీ అరాచకాలతో ఇబ్బందులు పడిన ఉద్యోగులు మాత్రం వారికి ఓటేసేందుకు ససేమిరా అంటున్నారు. ప్రకాశం జిల్లాలోని ఒంగోలు నగరం సహా ఇతర నియోజకవర్గాల్లో వైకాపా నాయకులు పోస్టల్‌ బ్యాలట్‌ పోలింగ్‌ కేంద్రాల వద్ద మోహరించారు. ఓటుకు రూ.5 వేలు ఇస్తామంటూ ప్రలోభాలకు గురిచేస్తున్నారు. అయినా ఉద్యోగ, ఉపాధ్యాయులు తిరస్కరిస్తున్నారు. ఒంగోలు డీఆర్‌ఆర్‌ఎం పాఠశాల వద్ద జరిగిన సంఘటనే ఇందుకు నిదర్శనం. ఒక మహిళా ఉద్యోగిని ఓటు వేసేందుకు వెళ్తుండగా.. సమీపంలో ఉన్న వైకాపా నాయకులు ఆమెను ఓటు అభ్యర్థిస్తూ రూ.5 వేలు ఇవ్వబోయారు. ఆ మొత్తాన్ని తిరస్కరించిన ఆమె నేరుగా తెదేపా శిబిరం వద్దకు వచ్చి రూ.పది వేలు అందజేస్తూ ‘ఈ ఎన్నికల్లో ఖర్చులకు వాడండి.. ఇది మీ పార్టీకి నా విరాళం’ అని చెప్పారు. దీంతో వైకాపా నాయకులు కంగుతిన్నారు. అయిదేళ్లూ ఈ ప్రభుత్వాన్ని భరించాం, మరోసారి వైకాపాకు ఓటు వేస్తే మాపై మేం వేటు వేసుకున్నట్లేనని ఈ సందర్భంగా ఆమె వ్యాఖ్యానించారు.

* సామాజిక సమస్యలు, విప్లవం నేపథ్యంలో సినిమాలు చిత్రీకరించే ఆర్‌.నారాయణమూర్తి నిరాడంబరుడు, సౌమ్యుడు, మంచివాడని సినిమా పరిశ్రమలో పేరుంది. అలాంటి నారాయణమూర్తికే ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ ఝలక్‌ ఇచ్చారు. తాను పుట్టిన ప్రాంతంపై ప్రేమతో సాగునీటి ప్రాజెక్టు కోసం జగన్‌ అధికారంలోకి వచ్చాక నారాయణమూర్తి ఆయన్ను కలిశారు. ఆ ప్రాజెక్టు సాధించడం తన చిరకాల స్వప్నమని వివరించారు. ఆ ప్రాజెక్టుని జగన్‌ మంజూరు చేశారు. అంతటి ముఖ్యమంత్రే మంజూరు చేశాక ఇంకేముంది.. త్వరలోనే ప్రాజెక్టు పూర్తయిపోతుందనుకున్నారు. ఆయనకు చేతులెత్తి మొక్కారు. జగన్‌ దేవుడని, ఆయనకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని కొనియాడారు. కానీ ఆ ప్రాజెక్టు ఇప్పటికీ కాగితాలపైనే ఉంది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని ఏలేరు, ఉమ్మడి విశాఖ జిల్లాలోని తాండవ జలాశయాల కాలువల్ని అనుసంధానిస్తే.. రెండు ఉమ్మడి జిల్లాల్లో కొత్తగా 5,600 ఎకరాల ఆయకట్టు సాగులోకి వస్తుంది. 51,465 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుంది. 2021లో ఆ ప్రాజెక్టుకి ప్రభుత్వం రూ.470 కోట్లు మంజూరు చేసింది. 2021 మార్చి 19న పాలనాపరమైన అనుమతులిచ్చింది. టెండర్లు పిలిచి.. గుత్తేదారుడినీ ఎంపిక చేశారు. ఆ తర్వాత దానికీ రాష్ట్రంలోని మిగతా సాగునీటి ప్రాజెక్టుల గతే పట్టింది. ప్రాజెక్టు మంజూరు చేసి మూడేళ్లవుతున్నా.. అంగుళం కూడా ముందుకి కదల్లేదు.

* మద్యం కేసులో భారాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మళ్లీ చుక్కెదురైంది. బెయిల్‌ ఇచ్చేందుకు రౌస్‌ అవెన్యూ కోర్టు నిరాకరించింది. ప్రస్తుతం తిహాడ్‌ జైలులో ఉన్న కవిత.. ఈడీ, సీబీఐ కేసుల్లో వేర్వేరుగా బెయిల్‌ పిటిషన్లు దాఖలు చేశారు. ఎన్నికల నేపథ్యంలో స్టార్‌ క్యాంపెయినర్‌గా ప్రచారంలో పాల్గొనాల్సి ఉందని ఆమె పేర్కొన్నారు. మహిళగా పీఎంఎల్‌ఏ సెక్షన్‌ 45 ప్రకారం బెయిల్‌కు అర్హత ఉందన్నారు. దీనిపై ఇటీవల విచారణ చేపట్టిన న్యాయస్థానం.. నేడు కవిత పిటిషన్లను తిరస్కరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

* సైకో జగన్‌ను నమ్మి మరోసారి మోసపోవద్దని.. రాష్ట్ర ప్రభుత్వంపై కోపాన్ని, ఆగ్రహాన్ని ఓట్ల రూపంలో చూపించాలని ప్రజలకు తెదేపా (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu) పిలుపునిచ్చారు. ఈనెల 13న జరిగే ఎన్నికల్లో వైకాపాను చిత్తుచిత్తుగా ఓడించాలన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నంద్యాల జిల్లా పాణ్యంలో నిర్వహించిన ‘ప్రజాగళం’ సభలో ఆయన మాట్లాడారు. రైతుల పాసు పుస్తకాలపై జగన్‌ ఫొటో ఎందుకని ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఓ పాసు పుస్తకం ప్రతిని ఆయన చించి తగులబెట్టారు. * సార్వత్రిక ఎన్నికలు జరుగుతోన్న తరుణంలో.. ఝార్ఖండ్‌(Jharkhand)లోని ఓ ఇంట్లో నోట్ల గుట్టలు బయటపడ్డాయి. అదంతా లెక్కల్లోకి రాని సొమ్ము అని, ఇప్పటివరకు స్వాధీనం చేసుకున్న సొమ్ము రూ.20 కోట్లుపైనే ఉంటుందని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ED) వర్గాలు మీడియాకు వెల్లడించాయి. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద రాజధాని నగరం రాంచీలోని పలు ప్రాంతాల్లో సోమవారం ఈడీ సోదాలు నిర్వహించింది. ఆ కేసులో ఝార్ఖండ్ గ్రామీణాభివృద్ధి శాఖలో పనిచేసిన మాజీ చీఫ్ ఇంజినీర్ వీరేంద్ర రామ్‌ 2023లో అరెస్టయ్యారు. దర్యాప్తులో భాగంగా ఆయనకు చెందిన 10కి పైగా ప్రాంతాల్లో ప్రస్తుత సోదాలు జరిగాయి. ఈ క్రమంలోనే గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి అలంఘీర్‌ ఆలం వ్యక్తిగత కార్యదర్శి సంజీవ్‌ లాల్‌కు సహాయకుడికి చెందినదిగా భావిస్తోన్న ఇంట్లో నోట్ల గుట్టలు దర్శనమిచ్చాయి. ఒక గదిలో కరెన్సీ కట్టలు పేర్చి ఉన్న దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. దీనిపై భాజపా స్పందించింది. ‘‘ఝార్ఖండ్‌లో అవినీతి ముగిసిపోలేదు. ప్రస్తుతం జరుగుతోన్న ఎన్నికల్లో భాగంగా సదరు వ్యక్తులు దీనిని ఉపయోగించాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలి’’ అని కోరింది.

* ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి చెందాలంటే డబుల్‌ ఇంజిన్‌ సర్కారు ఉండాలని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ (PM Modi) అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. ‘గోదావరి మాతకు ప్రణామాలు.. ఈ నేల మీదే ఆదికవి నన్నయ్య తొలి కావ్యం రాశారు. ఇక్కడి నుంచే ఇప్పుడు కొత్త చరిత్ర లిఖించబోతున్నాం’ అంటూ మోదీ తెలుగులో తన ప్రసంగం ప్రారంభించారు. దేశంలో, రాష్ట్రంలో ఎన్డీయే కూటమి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ‘‘వైకాపా ప్రభుత్వం అవినీతిని జెట్‌ స్పీడ్‌తో పరిగెత్తించింది. అభివృద్ధి సున్నా.. అవినీతి వందశాతం. ఈ ఎన్నికల్లో ప్రజలు ఆ పార్టీని పూర్తిగా తిరస్కరిస్తారు. రాష్ట్రమైనా, దేశమైనా అభివృద్ధి చెందాలంటే ఎన్డీయే ప్రభుత్వం ఉండాలి. వైకాపా సర్కారు రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టింది. ఈ రాష్ట్రం ప్రతిభావంతులైన యువతకు నెలవు. టెక్నాలజీలో ఏపీ యువత శక్తిని ప్రపంచం గుర్తించింది. దేశం వేగంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో రాష్ట్రం కూడా అంతే స్పీడ్‌తో అభివృద్ధి చెందాలి. కానీ, కేంద్ర ప్రాజెక్టుల అమలును రాష్ట్ర ప్రభుత్వం జాప్యం చేసింది. డబుల్‌ ఇంజిన్‌ సర్కారు ఉంటేనే రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యం. కాంగ్రెస్‌ పార్టీ పట్ల ప్రజలు పూర్తి అప్రమత్తంగా ఉండాలి. పదేళ్ల క్రితం దేశాన్ని కాంగ్రెస్‌ పార్టీ అధోగతి పాలు చేసింది. ఈడీ.. ఈడీ.. అంటూ ఇండియా కూటమి గగ్గోలు పెడుతోంది. కాంగ్రెస్‌ నేతల వద్ద గుట్టల కొద్దీ డబ్బు బయట పడుతోంది. ఆ పార్టీ నేతల డబ్బును మెషీన్లు కూడా లెక్కపెట్టలేకపోతున్నాయి’’

* కత్తి పోట్లకు గురై ఆస్ట్రేలియా (Australia)లో భారత విద్యార్థి నవ్‌జీత్ సంధు మృతి చెందారు. భారత విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణలో అతడు ప్రాణాలు కోల్పోయాడని మృతుడి బంధువు యష్‌వీర్ వెల్లడించారు. మెల్‌బోర్న్‌లో శనివారం రాత్రి జరిగిన ఘటనలో మరో విద్యార్థి గాయాలపాలయ్యారు.

* ఉక్రెయిన్‌పై సుదీర్ఘకాలంగా యుద్ధం కొనసాగిస్తోన్న రష్యా (Russia).. తమ లక్ష్యం నెరవేరేవరకూ దాడులు చేస్తామని చెబుతోంది. ఈ క్రమంలో అణ్వాయుధాల ప్రయోగానికీ వెనకాడబోమని హెచ్చరిస్తోంది. ఈనేపథ్యంలో మరింత దూకుడు పెంచిన అధ్యక్షుడు పుతిన్‌.. ఉక్రెయిన్‌ సమీపంలో అణ్వాయుధాల విన్యాసాలు మొదలుపెట్టాలని తన సైన్యాన్ని ఆదేశించారు.

* సార్వత్రిక ఎన్నికల వేళ రాంచీలో గుట్టలుగా డబ్బులు బయటపడటం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఇప్పటికే లెక్కలో చూపని రూ.25 కోట్లను ఓ హౌస్‌ కీపర్‌ ఇంటి నుంచి స్వాధీనం చేసుకొన్నారు. సదరు వ్యక్తికి ఆ రాష్ట్ర మంత్రి అలంఘీర్‌ ఆలం(Alamgir Alam)తో సంబంధాలున్నట్లు అనుమానిస్తున్నారు.

* దేశంలో రహదారులు రోజురోజుకూ విస్తరిస్తున్నా.. గుంతల సమస్య మాత్రం ఇప్పటికీ వాహనదారులను వేధిస్తూనే ఉంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు గుంతలతో అధ్వానంగా దర్శనమిస్తున్నాయి. దీనికి జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) పరిష్కారం కనుక్కునేందుకు సిద్ధమైంది. రహదారిపై గుంత ఏర్పడినప్పుడు దానంతట అదే పూడుకుపోయే సాంకేతికతతో పని చేస్తోంది.

* దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు (stock market) ఫ్లాట్‌గా ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలతో ఉదయం లాభాల్లో ప్రారంభమైన సూచీలు.. రోజంతా ఒడుదొడుకులు ఎదుర్కొన్నాయి. ముఖ్యంగా ప్రభుత్వరంగ బ్యాంక్‌ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కనిపించింది.

* పోలింగ్ రోజు ఓటరు ఓటేసినట్లు తెలిసేందుకు, అదే ఓటరు మళ్లీ ఓటు వేయకుండా ఉండేందుకు సిబ్బంది ఓటరు ఎడమ చేతి చూపుడు వేలికి సిరా గుర్తు పూస్తారు. ఈ సంగతి అందరికీ తెలిసిందే. కానీ, ఓటరుకు ఎడమ చేతికి చూపుడు వేలు లేకపోతే ఏ వేలికి సిరా గుర్తు వేయాలో కేంద్ర ఎన్నికల సంఘం సూచించింది. మధ్య వేలికి, అదీ లేకపోతే బొటన వేలికి, అసలు ఎడమ చేయే లేకపోతే కుడి చేతి చూపుడు వేలికి, అది లేకపోతే మధ్య వేలికి, ఆ తర్వాత ఉంగరం వేలికి సిరా గుర్తు వేస్తారు. ఒకవేళ ఓటరుకు రెండు చేతులూ లేకపోతే కాలి వేళ్లకు సిరా గుర్తు పూస్తారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z