Business

ఒక డాలరుకు ₹83.50 – BusinessNews-May 16 2024

ఒక డాలరుకు ₹83.50 – BusinessNews-May 16 2024

* యాపిల్‌ ఐఫోన్లలో ఎస్‌ఈ (iPhone SE) సిరీస్‌లకు సెపరేట్ ఫ్యాన్‌ బేస్‌ ఉంది. రెగ్యులర్‌ మోడళ్ల కంటే హ్యాండీగా, అందుబాటులో ధర ఉండడంతో ఎస్‌ఈ సిరీస్‌ అంటే ఇష్టపడే వారి సంఖ్య ఎక్కువే. ఇప్పటివరకు మూడు ఎస్‌ఈ సిరీస్‌ ఫోన్లను యాపిల్ తీసుకొచ్చింది. నాలుగో సిరీస్‌ను ఎప్పుడు తీసుకొచ్చేదీ మాత్రం వెల్లడించలేదు. అయితే, ఎస్‌ఈ 4తో పాటు, మరికొన్ని ఉత్పత్తుల రిలీజ్‌ వివరాలు తాజాగా ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. ప్రముఖ టిప్‌స్టర్‌ ఒకరు యాపిల్‌ ప్రొడక్టులకు సంబంధించిన రోడ్‌మ్యాప్‌ను ఎక్స్‌ వేదికగా పోస్ట్‌ చేయడంతో ఈ వివరాలు బహిర్గతం అయ్యాయి. ఈ లీకుల్లో 2023-27 మధ్య యాపిల్‌ విడుదల చేయాలనుకున్న ప్రోడక్టుల లిస్ట్‌ ఉంది. ఇందులో విజన్‌ ప్రో, ఓఎల్‌ఈడీ డిస్‌ప్లేతో కూడిన ఐప్యాడ్‌ మోడళ్లు ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యాయి. ఐఫోన్‌ 16, 16 ప్లస్‌ మోడళ్లు 8జీబీ ర్యామ్‌తో రాబోతున్నాయని లీకుల బట్టి తెలుస్తోంది. వీటితో పాటు ఎస్‌ఈ4కు సంబంధించిన సమాచారం కూడా ఉంది. దీనిప్రకారం.. 2025లో కొత్త ఎస్‌ఈ4 రాబోతోందని తెలుస్తోంది. 6.1 అంగుళాల ఓఎల్‌ఈడీ డిస్‌ప్లే, 48 ఎంపీ కెమెరా ఈ ఫోన్‌లో ఉండబోతోందట.

* దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు (Stock market) భారీ లాభాల్లో ముగిశాయి. రోజంతా ఒడుదొడుకులు ఎదుర్కొన్న సూచీలు.. ఆఖర్లో కొనుగోళ్ల మద్దతుతో రాణించాయి. ముఖ్యంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఇన్ఫోసిస్, భారతీ ఎయిర్‌టెల్‌లో కొనుగోళ్ల మద్దతు సూచీలకు కలిసొచ్చింది. సెన్సెక్స్‌ ఓ దశలో 700 పాయింట్ల వరకు లాభపడగా.. నిఫ్టీ 22,400 స్థాయిని చేరుకుంది. సెన్సెక్స్‌ ఉదయం 73,338.24 (క్రితం ముగింపు 72,987.03) వద్ద లాభాల్లో ప్రారంభమైంది. తర్వాత తీవ్ర ఒడుదొడుకులు ఎదుర్కొంది. ఆఖరి అరగంటలో కొనుగోళ్ల కారణంగా దూసుకెళ్లింది. ఇంట్రాడేలో 73,749.47 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని తాకింది. చివరికి 676.69 పాయింట్ల లాభంతో 73,663.72 వద్ద స్థిరపడింది. నిఫ్టీ సైతం 203.30 పాయింట్ల లాభంతో 22,403.85 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 83.50గా ఉంది. సెన్సెక్స్ 30 సూచీలో మహీంద్రా అండ్‌ మహీంద్రా, భారతీ ఎయిర్‌టెల్‌, టెక్‌ మహీంద్రా, ఇన్ఫోసిస్‌, టైటాన్‌ షేర్లు లాభపడ్డాయి. మారుతీ, టాటా మోటార్స్, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ షేర్లు నష్టపోయాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్‌ బ్యారెల్‌ చమురు ధర 82.51 డాలర్లుగా ఉంది.

* గూగుల్‌ I/O 2024 సదస్సు రెండో రోజు ఆండ్రాయిడ్‌ 15 బీటా 2ను (Android 15 Beta 2) కంపెనీ ప్రకటించింది. ఈ అప్‌డేట్‌ ఇప్పటికే పిక్సెల్‌ యూజర్లకు అందుబాటులో ఉంది. హానర్‌, ఐకూ, లెనొవో, నథింగ్‌, వన్‌ప్లస్‌, ఒప్పో, రియల్‌మీ, షార్ప్‌, టెక్నో, వివో, షావోమి కంపెనీ డివైజ్‌లలోనూ దీన్ని ప్రవేశపెట్టనుంది. డెవలపర్‌ ప్రివ్యూ లేదా బీటా వెర్షన్లలో పాల్గొంటున్న వారికి ఆటోమేటిక్‌గా బీటా 2 అప్‌డేట్‌ ‘ఓవర్‌ ది ఎయిర్‌’ ద్వారా లభిస్తుంది. కొత్తవారు ఎలా పొందాలో ఆండ్రాయిడ్‌ సైట్‌లో ‘గెట్‌ ఆండ్రాయిడ్‌ 15’ పేరిట సూచనలు చేసింది.

* యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌ (UPI) లావాదేవీ సంస్థ ఫోన్‌పే శ్రీలంక‌లో సేవలను ప్రారంభించింది. లంకాపేతో క‌లిసి సేవలను అందించనున్నట్లు ఫోన్‌పే ప్రకటించింది. ఇకపై భారతీయులు ఫోన్‌ పే యాప్‌తో లంకా పే క్యూ ఆర్‌ కోడ్‌ని స్కాన్‌ పే చేసి పే చేయచ్చని పేర్కొంది. శ్రీలంక అంతటా యూపీఐ సేవలను వినియోగించువకోచ్చని పేర్కొంది. శ్రీలంక పర్యటనకు వెళ్లే భారతీయ పర్యటాకులు నగదును తీసుకు వెళ్లనవసరం లేదని చెప్పింది. కరెన్సీ మారకం రేటును చూపుతూ.. మొత్తం భారత రూపాయిలో డెబిట్ అవుతుందని పేర్కొంది. శ్రీలంక వెళ్లే భారతీయ పర్యాటకులకు సురక్షితమైన చెల్లింపు పద్ధతిని ఉపయోగించి లావాదేవీలు జరపవచ్చని ఫోన్‌పే ఇంటర్‌నేషనల్‌ పేమెంట్స్‌ సీఈవో రితేష్‌ పాయ్‌ పేర్కొన్నారు.

* ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇటీవలే నెక్ట్స్ జనరేషన్ ‘స్విఫ్ట్’ కారును భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. తాజాగా ఫ్రాంక్స్ (Fronx) కారులో న్యూ డెల్టా ప్లస్ (ఓ) (Delta Plus (O) వేరియంట్‌ను తీసుకొచ్చింది. ఫ్రాంక్స్ న్యూ డెల్టా ప్లస్ (ఓ) వేరియంట్ 1.2 లీటర్ల నేచురల్లీ ఆస్పిరేటెడ్ (ఎన్ఏ) పెట్రోల్ ఇంజిన్ తో నడుస్తుంది. ఈ కారు ధర రూ.8.93 లక్షల నుంచి రూ.9.44 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య పలుకుతుంది. డెల్లా +, జెటా వేరియంట్ల మధ్య న్యూ డెల్టా + (ఓ) నిలుస్తుంది. న్యూ డెల్టా + (ఓ) వేరియంట్ ఫ్రాంక్స్ కారులో సేఫ్టీ కోసం 6-ఎయిర్ బ్యాగ్స్ జత చేశారు. ఇంతకుముందు ఫ్రాంక్స్ జెటా, ఆల్ఫా వేరియంట్లలో మాత్రమే 6-ఎయిర్ బ్యాగ్స్ ఫీచర్ ఉండేది. డెల్టా + వేరియంట్‌తో పోలిస్తే డెల్టా + (ఓ) వేరియంట్ కార్లు డ్యుయల్ ఎయిర్ బ్యాగ్స్ జత చేయడంతో రూ.15 వేలు ఎక్కువ ధర పలుకుతాయి.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z