Agriculture

తెలంగాణాలో భారీ వర్షాలు-NewsRoundup-May 16 2024

తెలంగాణాలో భారీ వర్షాలు-NewsRoundup-May 16 2024

* సికింద్రాబాద్‌ నుంచి విశాఖపట్నం వెళ్లే వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌(Vande Bharat Express) రైలు (20834) ఐదు గంటల ఆలస్యంగా బయల్దేరనుంది. ఈ మధ్యాహ్నం 3 గంటలకు సికింద్రాబాద్‌లో బయల్దేరాల్సిన ఈ రైలును రాత్రి 8 గంటలకు రీషెడ్యూల్‌ చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. ఈమేరకు ‘ఎక్స్‌’ వేదికగా ప్రకటించారు. మామూలుగా అయితే, ఈ రైలు మధ్యాహ్నం 3 గంటలకే సికింద్రాబాద్‌లో బయల్దేరాల్సి ఉంది. అయితే, విశాఖలో ఈ ఉదయం 5.45 గంటలకు బయల్దేరాల్సిన రైలు (20833) దాదాపు 5 గంటలు ఆలస్యం అయినట్లు సమాచారం. అదే రైలు సికింద్రాబాద్‌కు చేరుకొని తిరిగి విశాఖకు వెళ్లాల్సిఉండటంతో ఈ రైలును అధికారులు సికింద్రాబాద్‌లో రాత్రి 8 గంటలకు రీషెడ్యూల్‌ చేసినట్లు తెలుస్తోంది. దీంతో సకాలంలో గమ్యస్థానాలకు చేరుకోలేక పలువురు ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

* తెలంగాణలోని పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. గురువారం సాయంత్రం హైదరాబాద్‌లో భారీ వర్షంతో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. గచ్చిబౌలి, కూకట్‌పల్లి, నిజాంపేట్‌, హైదర్‌నగర్‌, బాచుపల్లి, బోయిన్‌పల్లి, మారేడుపల్లి, బేగంపేట్‌, ప్యారడైజ్‌, చిలకలగూడ, అల్వాల్‌, జవహర్‌నగర్‌, మల్కాజిగిరి, నేరేడ్‌మెట్‌, నాగారం, కుత్బుల్లాపూర్‌, చింతల్‌, షాపూర్‌నగర్‌, గాజులరామారం, సూరారం, బహదూర్‌పల్లి, షేక్‌పేట, రాయదుర్గం, పంజాగుట్ట, బోరబండ, రెహమత్‌నగర్‌, ఉప్పల్‌ తదితర ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం కురుస్తోంది. రోడ్లపైకి వర్షపు నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.

* టేకాఫ్‌కు సిద్ధంగా ఉన్న ఓ విమానంలో ‘బాంబ్‌’ అని రాసి ఉన్న టిష్యూ పేపర్‌ లభ్యం కావడం కలకలం రేపింది. దీంతో సిబ్బంది, ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. పోలీసుల వివరాల ప్రకారం.. దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (IGIA) నుంచి గుజరాత్‌లోని వడోదరకు వెళ్లేందుకు ఎయిర్‌ ఇండియా (Air India) విమానం సిద్ధమైంది. అంతలోనే అందులోని వాష్‌రూంలో ‘బాంబ్‌’ అని రాసిఉన్న ఓ టిష్యూ పేపర్‌ విమాన సిబ్బంది కంటపడింది. దీంతో అప్రమత్తమైన వెంటనే ప్రయాణికులందరినీ కిందికి దించేశారు. సీఐఎస్‌ఎఫ్‌తోపాటు దిల్లీ పోలీసులకు సమాచారం అందించారు.

* ఒకరు చేసిన పొరబాటు కారణంగా పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీవోకే)పై భారత్‌ తాత్కాలిక నియంత్రణ కోల్పోయిందని విదేశాంగ మంత్రి జై శంకర్‌ (S Jaishankar) పేర్కొన్నారు. ‘విశ్వబంధు భారత్‌’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆ పార్టీ హయాంలో జరిగిన తప్పులను ఎత్తిచూపారు. లక్ష్మణ రేఖను దాటి పీవోకేను భారత్‌ విలీనం చేసుకుంటుందా? అని అడిగిన ప్రశ్నకు.. జై శంకర్‌ స్పందిస్తూ.. ‘‘లక్ష్మణ రేఖ లాంటివి ఉన్నాయంటే నేను నమ్మను. పీవోకేను భారత్‌లో భాగంగానే భావిస్తున్నా. కొందరి బలహీనత వల్ల అది చేజారింది. పీవోకేపై పట్టు కోల్పోయేందుకు వారి పొరబాటే కారణం’’ అని పరోక్షంగా నెహ్రూను ఉద్దేశించి ఆరోపణలు చేశారు. విశ్వవేదికపై మన స్థానాన్ని బలంగా ఉంచుకోవాలని భావిస్తున్నానని.. స్వీయ విశ్వాసాన్ని ఎన్నడూ వీడకూడదని అన్నారు. పదేళ్లక్రితం ఎవరూ ఇలా మాట్లాడి ఉండకపోవచ్చంటూ కాంగ్రెస్‌పై విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు.

* అంతర్జాతీయ సమాజం నుంచి వ్యతిరేకత వస్తున్నప్పటికీ.. గాజాలోని రఫా నగరంలో దాడులు చేస్తోన్న ఇజ్రాయెల్‌ (Israel)కు భారీ షాక్‌ తగిలింది. తన ఆర్మీ చేతిలో సొంత సైనికుల్నే కోల్పోయింది. ఇజ్రాయెల్‌ సైన్యం(IDF) ఉన్న భవనం వైపు ట్యాంకులు పొరపాటున గుండ్లు పేల్చడంతో.. ఐదుగురు మృతి చెందారు. మరికొందరు గాయపడ్డారు. బుధవారం రాత్రి ఈ ఘటన జరిగిందని ఐడీఎఫ్ ఓ ప్రకటనలో తెలిపింది. అయితే.. ఇది గాజాలోని ఉత్తరభాగంలో చోటుచేసుకుంది.

* నగరంలో భారీ వర్షం కురుస్తోంది. వరదలతో హైదరాబాద్‌ రోడ్లు జలమయమయ్యాయి. బంజారాహిల్స్‌ రోడ్‌ నం.9లో నాలాపై రోడ్డు కుంగిపోయింది. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఉదయ్‌నగర్‌లో నాలా పైకప్పు కూలింది. వరద నీటిలో పలు ద్విచక్రవాహనాలు కొట్టుకుపోయాయి. నాలా కూలిన ప్రాంతాల్ని మేయర్‌ విజయలక్ష్మి పరిశీలించారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని అధికారును ఆదేశించారు. మరోవైపు బల్కంపేట రైల్వే అండర్‌పాస్‌ కింద వరదనీటిలో కారు మునిగిపోయింది. రాత్రి వేళ పలు చోట్ల వడగళ్ల వాన పడుతుందని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది.

* కేంద్ర ఎన్నికల సంఘం ఎదుట ఏపీ సీఎస్‌ జవహర్‌రెడ్డి, డీజీపీ హరీశ్‌ కుమార్‌ గుప్తా హాజరయ్యారు. ఎన్నికలు, పోలింగ్‌ అనంతరం రాష్ట్రంలోని పలుచోట్ల చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై ఈసీకి వివరణ ఇచ్చారు. వీరితో పాటు నిఘా విభాగాధిపతి కుమార్‌ విశ్వజిత్‌ సైతం ఉన్నారు. మాచర్ల, నరసరావుపేట, చంద్రగిరి, తాడిపత్రిలలో హింస చెలరేగడంపై ఈసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో విచ్చల విడిగా దాడులు, వాహనాలు తగులబెట్టడం వంటి ఘటనల్ని ఎందుకు అదుపు చేయలేకపోయారని ఈసీ నిలదీసింది. పరిస్థితిని అదుపుచేయకుండా ఏం చేస్తున్నారని ప్రశ్నించిన ఈసీ.. దీనికి బాధ్యులు ఎవరంటూ మండిపడింది. హింసాత్మక ఘటనలు జరిగాక ఏం చర్యలు తీసుకున్నారో తమ ఎదుట హాజరై వివరణ ఇవ్వాలని నిన్న ఆదేశాలు జారీ చేయడంతో గురువారం సీఎస్‌, డీజీపీ దిల్లీలో ఎన్నికల సంఘం అధికారుల ఎదుట హాజరై వివరణ ఇచ్చుకున్నారు. దాదాపు 20 నుంచి 25 నిమిషాల పాటు ఎన్నికల సంఘం అధికారులు వీరి నుంచి వివరణ తీసుకొని పంపించినట్లు తెలుస్తోంది. పల్నాడు, తాడిపత్రిల్లో దాడులు, చంద్రగిరిలో ఏకంగా తెదేపా అభ్యర్థిపైనే దాడిచేయడం, శ్రీకాకుళం నుంచి కర్నూలు వరకు వరుసగా జరిగిన ఘటనలపై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ముందుగానే ఆదేశించినా.. అధికారులు పూర్తిగా నిర్లిప్తంగా వ్యవహరించడంపై మండిపడినట్లు తెలుస్తోంది.

* పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో పెట్రోల్‌ బాంబులు కలకలం రేపుతున్నాయి. తాజాగా మరో వైకాపా నేత ఇంట్లో 29 పెట్రోల్‌ బాంబులు బయటపడ్డాయి. ఎన్నికల అనంతరం పల్నాడులో చెలరేగిన హింసతో పోలీసులు విస్తృతంగా చేపట్టిన తనిఖీల్లో వైకాపా నేతల ఇళ్లలో వరుసగా పెట్రోల్‌ బాంబులు లభ్యమవుతుండటంతో అలజడి నెలకొంది. బుధవారం రాత్రి మాచవరం మండలం పిన్నెళ్లి గ్రామంలో వైకాపాకు చెందిన ఐదుగురి నేతల ఇళ్లలో పెట్రోల్ బాంబులు గుర్తించిన పోలీసులు.. గురువారం ముప్పాళ్ల మండలం మాదలలో తనిఖీలు చేస్తుండగా వైకాపా నేత సైదా ఇంట్లో 29 పెట్రోల్‌ బాంబుల్ని గుర్తించారు.

* చంద్రగిరి నియోజకవర్గ కూటమి అభ్యర్థి పులివర్తి నానిపై హత్యాయత్నం కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసులో ప్రధాన నిందితులు భానుకుమార్‌రెడ్డి, గణపతి రెడ్డితోపాటు మరో 11 మందిని అరెస్ట్‌ చేశారు. మొత్తం 13 మందికి తిరుపతి ఏడీజే కోర్టు 14 రోజులపాటు రిమాండ్‌ విధించింది.

* సీఏఏ అమలు ప్రక్రియను వేగవంతం చేసిన కేంద్ర ప్రభుత్వం తొలి విడతలో 14 మందికి భారత పౌరసత్వం మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఈ చట్టానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు చేస్తున్న వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) స్పందించారు. కాంగ్రెస్‌, సమాజ్‌వాదీ పార్టీలపై ధ్వజమెత్తారు.

* పాకిస్థాన్‌ దయనీయ పరిస్థితిని వివరిస్తూ ఆ దేశ చట్టసభ సభ్యుడు సయ్యద్‌ ముస్తఫా కమల్‌.. భారత్‌ సాధిస్తున్న పురోగతిని ప్రస్తావించారు. భారత్‌ చంద్రుడిపై కాలుమోపుతుంటే.. పాక్‌ (Pakistan) మాత్రం ఇంకా మురుగు కాలువల్లో పిల్లల మరణాలనూ నివారించలేకపోతోందంటూ పార్లమెంటు సాక్షిగా వారి దయనీయ స్థితిపై వాపోయారు. ఆయన ప్రసంగం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ‘‘టీవీలో చంద్రుడిపై భారత్‌ కాలుమోపినట్లు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత రెండు సెకన్లలోనే అదే తెరపై కరాచీలో పిల్లలు మురుగు కాలువల్లో పడి మరణించిన సమాచారం వచ్చింది. పాకిస్థాన్‌కు (Pakistan) కరాచీ ప్రధాన ఆదాయ వనరు. రెండు నౌకాశ్రయాలు ఉన్నాయి. దేశానికి ఈ నగరం ముఖద్వారంలాంటిది. కానీ, 15 ఏళ్ల నుంచి ఈ ప్రాంతంలో తాగునీరు కూడా అందడం లేదు. వచ్చిన కొద్దిపాటి నీటిని కూడా మాఫియా అక్రమంగా విక్రయిస్తోంది. దేశంలో 2.62 కోట్ల మంది పిల్లలు స్కూల్‌కు వెళ్లడం లేదు’’ అంటూ పాక్‌ ఎదుర్కొంటున్న గడ్డు పరిస్థితులను సయ్యద్‌ ముస్తఫా వివరించారు.

* పోలింగ్‌ పూర్తయ్యాక ఈవీఎంలను ఉంచిన స్ట్రాంగ్‌రూంల భద్రతపై ప్రతిపక్షాలు అనుమానాలు వ్యక్తంచేస్తున్నాయి. తిరుపతిలో స్ట్రాంగ్‌రూంను పరిశీలించేందుకు వెళ్లిన చంద్రగిరి తెదేపా అభ్యర్థి పులివర్తి నానిపై వైకాపా నాయకులు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. తాజాగా గుంటూరు జిల్లా నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంలను ఉంచిన ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం(ఏఎన్‌యూ)లోని స్ట్రాంగ్‌రూంకు సమీపంలోనే నిఘా వర్గాల సమావేశం నిర్వహించడంపై ప్రతిపక్షాలు అభ్యంతరం తెలిపాయి. ఏఎన్‌యూలోని డైక్‌మెన్‌ ఆడిటోరియంలో మంగళవారం నిఘా వర్గాల అధికారులు, స్పెషల్‌ సెక్యూరిటీ గ్రూప్‌(ఎస్‌ఎస్‌జీ) సిబ్బంది సమావేశం నిర్వహించడం కలకలం సృష్టించింది. ఇందులో అధికారులు ప్రసంగిస్తున్న సమయంలో వారి వెనుక వైకాపా సిద్ధం పోస్టర్‌ ప్రదర్శితమైంది. దీనిపై ప్రతిపక్షాలు తీవ్ర అనుమానాలు వ్యక్తంచేశాయి. ఇంజినీరింగ్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌రూంకు సమీపంలో సమావేశం ఎందుకు నిర్వహించారు? ఎవరు అనుమతించారంటూ మండిపడ్డాయి. ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్‌కుమార్‌ మీనాకు పొన్నూరు నియోజకవర్గ తెదేపా అభ్యర్థి ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌ లేఖ రాశారు. సమావేశ నిర్వహణపై విచారించి, అనుమతించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

* అంతర్ రాష్ట్ర వ్యభిచార రాకెట్‌తో (Prostitution racket) ప్రమేయం ఉందనే ఆరోపణలపై ప్రభుత్వ అధికారులతో సహా 21 మందిని అరుణాచల్ ప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. 10-15 ఏళ్లలోపు ఐదుగురు మైనర్లను రక్షించినట్లు బుధవారం వెల్లడించారు. అరెస్టయిన ప్రభుత్వ అధికారుల్లో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (DSP), డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ కూడా ఉన్నారని తెలిపారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z