Agriculture

హైదరాబాద్ నకిలీ విత్తనాల ముఠా పట్టివేత

హైదరాబాద్ నకిలీ విత్తనాల ముఠా పట్టివేత

హైదరాబాద్‌ వనస్థలిపురం కేంద్రంగా నకిలీ విత్తనాల అక్రమ వ్యాపారం గుట్టు రట్టు చేసిన రెండు రోజుల వ్యధిలోనే మరో ముఠాను రాచకొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో వ్యవసాయ అధికారులు, ఎస్ఓటీ, స్థానిక పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో రూ. 1.15 కోట్లు విలువైన నకిలీ పత్తి, మిర్చి, వరి విత్తనాలు సహా వివిధ రకాల పరికరాలను స్వాధీనం చేసుకొని సీజ్‌ చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను రాచకొండ సీపీ మహేశ్ భగవత్‌ మీడియాకు వెల్లడించారు. ముందస్తు సమాచారం మేరకు శుక్రవారం సాయంత్రం హయత్‌గర్, వనస్థలిపురంలో ఉన్న మూడు ప్రాంతాల్లో దాడులు చేసినట్లు సీపీ తెలిపారు. హయత్‌నగర్‌ పరిధిలోని శాంతినగర్‌లో చేసిన దాడుల్లో రూ. 50 లక్షలు విలువైన నకిలీ విత్తనాలు, సామగ్రి స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. మరో చోట రూ.60 లక్షలు విలువైన విత్తనాలతో పాటు ప్యాకింగ్‌ యంత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఈ దాడుల్లో నకిలీ విత్తనాల అక్రమ నిల్వ, గడువు ముగిసిన, నిషేధించిన విత్తనాలను విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న ముగ్గురు వ్యాపారులను అరెస్టు చేసి కేసు నమోదు చేసినట్లు తెలిపారు. నకిలీ విత్తనాల విక్రయం చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని, పీడీ యాక్ట్ ఉపయోగిస్తామని సీపీ హెచ్చరించారు. గత నాలుగేళ్లలో నకిలీ విత్తనాలకకు సంబంధించి 10 కేసులు నమోదు చేసినట్లు వివరించారు. వాటికి సంబంధించిన విచారణ కొనసాగుతుందని తెలిపారు.