Business

విశాఖ ఉక్కుపై టాటాల కన్ను-వాణిజ్యం

విశాఖ ఉక్కుపై టాటాల కన్ను-వాణిజ్యం

* ఇంధన ధరలు రోజురోజుకూ పెరిగిపోతున్న నేపథ్యంలో, సుంకాలను తగ్గించడం ద్వారా పెట్రోల్‌, డీజిల్‌లపై ధరల్ని అదుపులోకి తీసుకొస్తారన్న సామాన్యుల ఆశలపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ నీళ్లు చల్లారు. సుంకాలను తగ్గించే అవకాశమే లేదని ఆమె తేల్చి చెప్పారు. ‘యూపీఏ ప్రభుత్వ హయాంలో రాయితీపై ఇంధనం సరఫరా చేయడానికి ప్రభుత్వ రంగ రిటైలర్లకు రూ.1.34 లక్షల కోట్ల చమురు బాండ్లను జారీ చేశారు. దీనిపై గత ఏడేళ్లుగా మా ప్రభుత్వం రూ.70,196 కోట్ల వడ్డీ చెల్లించింది. అసలు కింద రూ.3,500 కోట్లే చెల్లించాం. మిగిలిన మొత్తాన్ని 2025-26 ఆర్థిక సంవత్సరంలోగా చెల్లించాలనుకుంటున్నాం. ఈ నేపథ్యంలో ఎక్సైజ్‌ సుంకం తగ్గించే అవకాశం లేదు’ అని కేంద్ర మంత్రి వివరించారు.

* విశాఖ ఉక్కు ఆంధ్రుల హ‌క్కు అని నిన‌దించారు తెలుగువారు.. ఉద్య‌మించి.. ఉక్కు సంక‌ల్పంతో సాధించుకున్నారు. కానీ కేంద్ర ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న సంస్క‌ర‌ణ‌ల్లో భాగంగా ప్రైవేటీక‌ర‌ణ దిశ‌గా.. కార్పొరేట్ సంస్థ‌ల హ‌క్కుభుక్తం కాబోతున్న‌ది విశాఖ ఉక్కు ఫ్యాక్ట‌రీగా పేరొందిన రాష్ట్రీయ ఇస్పాత్ నిగం లిమిటెడ్ (ఆర్ఐఎన్ఎల్‌). ప్ర‌స్తుతం ఉక్కు మంత్రిత్వ‌శాఖ ప‌రిధిలో ఉన్న విశాఖ ఉక్కు ఫ్యాక్ట‌రీ 7.3 మిలియ‌న్ ట‌న్నుల ఉక్కు ఉత్ప‌త్తి సామ‌ర్థ్యం క‌లిగి ఉంది.

* హైదరాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ యూజర్‌ డెవలప్‌మెంట్‌ ఛార్జీలను (యూడీఎఫ్‌) పెంచాలని జీఎమ్మార్‌ గ్రూప్‌ ప్రతిపాదించింది. ఈ మేరకు జీఎమ్మార్‌ హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌.. ఎయిర్‌పోర్ట్స్‌ ఎకనామిక్‌ రెగ్యులేటరీ అథారిటీ (ఏఈఆర్‌ఏ)కి ఒక ప్రతిపాదనను సమర్పించింది. దేశీ విమానాల్లో ప్రయాణించేవారి నుంచి వసూలుచేసే యూడీఎఫ్‌ను ప్రస్తుత రూ.281 నుంచి రూ.608కి, అంతర్జాతీయ ప్రయాణీకుల యూడీఎఫ్‌ను రూ.393 నుంచి రూ.1,300కు పెంచాలన్న ప్రతిపాదనపై భాగస్వాముల స్పందనను జీఎమ్మార్‌ కోరింది. 2025-26 సంవత్సరానికల్లా దేశీ యూజర్‌ ఛార్జీలను రూ.728కి, అంతర్జాతీయ ఛార్జీలను రూ.2,200కు క్రమేపీ పెంచాలన్న ప్రతిపాదనను జీఎమ్మార్‌ చేసింది. కాగా, కొవిడ్‌ కారణంగా విమానయాన కంపెనీల ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్నందున, యూజర్‌ ఛార్జీల పెంపును అనుమతించవద్దంటూ ఏఈఆర్‌ఏను ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌ కోరింది.

* స్టీల్‌, పెయింట్స్‌ తయారీ సంస్థ కామధేను లిమిటెడ్‌..తెలంగాణలో ఉన్న ప్లాంట్ల సామర్థ్యాన్ని పెంచుకుంటున్నది. దక్షిణాదిలో కంపెనీకి చెందిన ఉత్పత్తులకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని రాష్ట్రంలో షాద్‌నగర్‌, వికారాబాద్‌ వద్ద ఉన్న స్టీల్‌ ప్లాంట్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని మరో 25 శాతం పెంచనున్నట్లు ప్రకటించింది. దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి సామర్థ్యం 1.9 లక్షల మెట్రిక్‌ టన్నుల నుంచి 2.4 లక్షల మెట్రిక్‌ టన్నులకు చేరుకోనున్నది. ‘తెలంగాణ మార్కెట్‌ మాకు చాలా కీలకం. ఇక్కడ మౌలిక, నిర్మాణ రంగాలు భారీ వృద్ధిని నమోదు చేసుకుంటున్నాయి. దీంతో స్టీల్‌కు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని సామర్థ్యాన్ని మరింతా పెంచాలని నిర్ణయించాం’ కంపెనీ డైరెక్టర్‌ సునీల్‌ అగర్వాల్‌ తెలిపారు.

* కార్ల మాన్యుఫాక్చ‌రింగ్ హ‌బ్‌గా భార‌త్‌కు పెట్టింది పేరు.. సూప‌ర్ కార్ల నిర్మాణం జోలికెళ్లలేదు. కాని కొన్ని భార‌త్ స్టార్ట‌ప్ సంస్థ‌లు ఆ అభిప్రాయాన్ని తిర‌గ‌రాయాల‌ని భావిస్తున్నాయి. బెంగ‌ళూర్ కేంద్రంగా ప‌ని చేస్తున్న ఎల‌క్ట్రిక్ వెహిక‌ల్ స్టార్ట‌ప్.. మీన్ మెట‌ల్ మోటార్స్ (ఎంఎంఎం) అధికారికంగా ప్రొటోటైఫ్ హైప‌ర్ కారు అజానీని ఆవిష్క‌రించింది. ఈ కారు 354 కి.మీ. వేగంతో ప్ర‌యాణిస్తుంద‌ని అంచ‌నా. అదే జ‌రిగితే శ‌ర‌వేగంగా దూసుకెళ్లే ఎల‌క్ట్రిక్ హైప‌ర్ కారు కూడా ఇదే కానుంది. దీని ధ‌ర కూడా కాస్త కాస్ట్‌లీ. సుమారు రూ.89 ల‌క్ష‌లు (1.20 ల‌క్ష‌ల డాల‌ర్లు)గా నిర్ణ‌యించాల‌ని ఎంఎంఎం ల‌క్ష్యంగా పెట్టుకున్న‌ట్లు స‌మాచారం.