Business

కిలో ఉల్లి ₹45. కుదేలవుతున్న చైనా GDP-వాణిజ్యం

కిలో ఉల్లి ₹45. కుదేలవుతున్న చైనా GDP-వాణిజ్యం

* రాష్ట్రంలో ఉల్లి ధరలు రోజురోజుకు ఆకాశాన్నంటుతున్నాయి. నిన్న మొన్నటి వరకు రూ. 20–25 గా ఉన్న ఉల్లి ధరలు ఇప్పుడు సగానికిపైగా పెరిగి సామాన్యుడి చేత కంటతడి పెట్టిస్తున్నాయి. ఇటీవలి వర్షాలకు దిగుబడి తగ్గడంతో పాటు వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్‌లో ఉల్లి కొరత ఏర్పడటమే ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలుగా తెలుస్తోంది. ఇటీవలి వరకు రూ. 20–25 లకే కేజీ ఉల్లిని విక్రయించిన వ్యాపారులు ఇప్పుడు ఏకంగా రూ. 40–45 కు విక్రయిస్తున్నారు. ఇంకొందరు వ్యాపారులు ఉల్లి నాణ్యతను బట్టి మరింత ఎక్కువ ధరకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు.

* దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు సోమవారం భారీ లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాలు ఉన్నప్పటికీ.. దేశీయ సానుకూలతలు సూచీలను ముందుకు నడిపించాయి. ద్రవ్యోల్బణం తగ్గడం, వృద్ధిరేటు, త్రైమాసిక ఫలితాలు, పండగ సీజన్ విక్రయాలు సహా వ్యాక్సినేషన్‌, కరోనా అదుపులో ఉండడం వంటి సానుకూల వాతావరణం సూచీలను ముందుకు నడిపిస్తోంది. అలాగే కీలక రంగాల్లో కొనుగోళ్లు సూచీల పరుగుకు దోహదం చేస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో నేడు సూచీలు జీవితకాల గరిష్ఠాల్ని నమోదు చేశాయి. చైనా ఆర్థిక వ్యవస్థ మందగించిందన్న వార్తల నేపథ్యంలో నేడు ఆసియా-పసిఫిక్‌ సూచీలు మిశ్రమంగా కదలాడుతున్నాయి. ఐరోపా మార్కెట్లు ప్రతికూలంగా ప్రారంభమయ్యాయి.

* కరోనా సంక్షోభం నేపథ్యంలో భారత ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు ప్రకటించిన పలు ఉద్దీపన పథకాలను ఉపసంహరించేందుకు తొందరేమీ లేదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. అంటే మరికొంత కాలం ఉపశమన చర్యలు కొనసాగే అవకాశం ఉందని చెప్పకనే చెప్పారు. అయితే, అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగడంపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్థిక వ్యవస్థను త్వరితగతిన గాడిన పెట్టాలన్న తమ లక్ష్యంలో కొంత అస్థిరత తలెత్తే అవకాశం ఉందని పేర్కొన్నారు. అయితే, ప్రభుత్వం ఇప్పటికే మౌలిక వసతుల ప్రాజెక్టుల కోసం భారీ ఎత్తున ఖర్చు చేసేందుకు సిద్ధమైందని తెలిపారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న ఆమె.. ‘న్యూయార్క్‌ సండే’కు ఇచ్చిన ముఖాముఖిలో ఈ వ్యాఖ్యలు చేశారు.

* దేశీయ కార్ల తయారీ దిగ్గజం టాటామోటార్స్‌ సరికొత్త మైక్రో ఎస్‌యూవీ ‘పంచ్‌’ను నేడు మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ఎక్స్‌షోరూం ప్రారంభ ధర రూ.5.49లక్షలుగా నిర్ణయించారు. ఇక అత్యున్నత శ్రేణి క్రియేటివ్‌ ఏఎంటీ ట్రిమ్‌ ధర రూ.9.09లక్షలుగా ఉంది. సరికొత్తగా మార్కెట్లోకి వచ్చిన సందర్భంగా ఇచ్చిన ఈ ఆఫర్‌ ధరలు కేవలం డిసెంబర్‌ 31వరకు అమల్లో ఉంటాయి. 2022 జనవరి నుంచి ధరల్లో మార్పులుంటాయని కంపెనీ పేర్కొంది. ఈ కారును ప్యూర్‌, అడ్వెంచర్‌, అకంప్లీష్డ్‌, క్రియేటివ్‌ అనే నాలుగు వేరియంట్లలో అందుబాటులోకి తెచ్చారు. సరికొత్త మైక్రో ఎస్‌యూవీ సెగ్మెంట్లో టాటామోటార్స్‌ నిలదొక్కుకోవడానికి పంచ్‌ను విడుదల చేసింది. మారుతీ సుజుకీ ఎస్‌ప్రెస్సో, వేగన్‌ ఆర్‌, రేనాల్ట్‌ క్విడ్‌ వంటి వాహనాలు ఇప్పటికే ఈసెగ్మెంట్లో ఉన్నాయి. కొత్త పంచ్‌ .. మారుతీ సుజుకీ ఇగ్నీస్‌, స్విఫ్ట్‌, హ్యూందాయ్‌ ఐ10 నియోస్‌కు కూడా బలమైన పోటీ ఇస్తుందని భావిస్తున్నారు. ఈ కారు భద్రతలో గ్లోబల్‌ ఎన్‌సీఏపీ 5స్టార్‌ రేటింగ్‌ను సాధించింది.

* మూడో త్రైమాసికంలో చైనా వృద్ధి రేటు మందగించింది. రెండో త్రైమాసికంలో 7.9 శాతంగా నమోదైన జీడీపీ రెండో త్రైమాసికానికి 4.9 శాతానికి పడిపోయింది. తొలి త్రైమాసికంలో ఇది 18.3 శాతంగా నమోదు కావడం గమనార్హం. తొలి మూడు త్రైమాసికాల జీడీపీలో 64.8 శాతం వాటా వివియోగానిదేనని అక్కడి ‘నేషనల్‌ బ్యూరో ఆఫ్‌ స్టాటిస్టిక్స్’ వెల్లడించింది.