Politics

మా పార్టీ పొత్తులపై వైసీపీకెందుకు .. – TNI రాజకీయ వార్తలు

మా పార్టీ పొత్తులపై వైసీపీకెందుకు .. – TNI రాజకీయ వార్తలు

* వైసీపీ నాయకులు అక్రమ మద్యం వ్యాపారం నడుపుతున్నారని టీడీపీ నేత బోండా ఉమ అన్నారు. నాటు సారా, గంజాయి గత మూడు సంవత్సరాలుగా వ్యాపారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. వేలకోట్లు దోచుకుంటున్న వైనాన్ని టీడీపీ బయటపెట్టిందన్నారు. జంగారెడ్డిగూడెం ఘటన‌లో మరణించిన వారి చావును అసెంబ్లీ సాక్షిగా సీఎం జగన్ హేళన చేశాడని బోండా ఉమ అన్నారు. ‘‘వైసీపీ నాయకులమ్మిన సారా ప్యాకెట్లు బాధితులు చూపించారు. వాస్తవాలు చంద్రబాబు వెలికి తీశాక పది కేసులు బుక్ చేశారు. సహజ మరణాలు అని చెప్పిన వారు.. నేడు కేసులెలా పెట్టారు. నగరాల్లో కూడా గంజాయి తోటలు పెంచుతున్నారు. గంజాయి, చీప్ లిక్కర్, దొంగసారా లను వైసీపీ అధికారికం చేసేసింది. సంపాదనే లక్ష్యంగా వైసీపీ ప్రభుత్వం పనిచేస్తోంది. పవన్ సభకు టీడీపీ మద్దతు అని ఆరోపణలు చేశారు. వైసీపీ అవినీతి అరాచక పాలన తేటతెల్లమైంది. రాబోయే రోజుల్లో మా అధిష్టానం పవన్‌తో పొత్తుపై నిర్ణయం తీసుకుంటుంది. మా పొత్తులపై వైసీపీకెందుకు ఉలికిపాటు. సంవత్సరంలోనే ఎన్నికలకు రావాలనే యోచనలో జగన్ ఉన్నారు. వైసీఎల్పీ‌లో అదే నిర్ణయిస్తారు. జంగారెడ్డిగూడెం మరణాలకు ఒకొక్కరికి కోటి రూపాయలివ్వాలిశవాలకు రీపోస్టుమార్టుం జరగాలి.. కేంద్ర దర్యాప్తు సంస్ధలతో విచారణ చేయించాలి. మాకు జనసేనతో పొత్తేమి కొత్తకాదు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలే ప్రసక్తి రాకూడదు. 2019లో జనసేన పొత్తు కోసం వైసీపీ పవన్ కాళ్ళు పట్టుకుంది. రాబోయే రోజుల్లో పొత్తులపై రెండు పార్టీల అధిష్టానాలు నిర్ణయిస్తాం.’’ అని బోండా ఉమ అన్నారు.

*ఉగాది నుంచి వలంటీర్లకు సన్మానం: జగన్‌
ఉగాది నుంచి వలంటీర్లకు సన్మానం చేస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. అసెంబ్లీ కమిటీ హాలులో జగన్‌ అధ్యక్షతన వైసీపీ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యేలు అంతా కూడా ప్రజల్లోకి వెళ్లాల్సిన బాధ్యత ఉందన్నారు. అందుకే ఎల్పీ సమావేశం ఏర్పాటు చేశామన్నారు. మన ఇళ్లదగ్గర మనం కూర్చోవడం, ప్రజలు మనల్ని కలవడం అన్నదానికి ఇకపై పుల్‌స్టాప్‌ పెట్టాలని ఆయన సూచించారు. గ్రామాల్లోకి వెళ్లాల్సిన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని ఆయన నిర్దేశించారు. ఉగాది నుంచి వలంటీర్లకు సన్మానం చేస్తున్నామన్నారు. వారి సేవలకు అవార్డులు ఇస్తున్నామని ఆయన తెలిపారు. వారు బాగా చేసిన మంచి పనులకు చాలామంది వలంటీర్లకు మనం పారితోషికం, మెడల్‌ ఇవ్వడం చేస్తున్నామన్నారు. సేవా మిత్ర, సేవా రత్న, సేవా వజ్రాల కింద అవార్డులు ఇస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఏప్రిల్‌ 2నుంచి ఉగాది రోజున జరిగే ఈ కార్యక్రమం నెలరోజుల పాటు సాగుతుందన్నారు. ప్రతి ఊరికీ వెళ్లి ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పాల్గొనాలని ఆయన ఆదేశించారు. గత ఏడాది కూడా వలంటీర్లను సన్మానించామన్నారు. ఈసారి ప్రతి రోజూ 3, 4 గ్రామాలు వెళ్లి వాలంటీర్లను గౌరవించే కార్యక్రమంలో పాల్గొనాలని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు జగన్ సూచించారు

*పవన్ ఆ పార్టీతో కలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి: ఎంపీ రఘురామ
పవన్ ఉద్దేశం చూస్తుంటే తెలుగుదేశం పార్టీతో కలిసే అవకాశాలు కనిపిస్తున్నాయని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోకుండా చూస్తామన్న పవన్ వ్యాఖ్యలను చూస్తే బాధ అనిపించినా.. నిజం చెప్పినందుకు సంతోషించాలన్నారు.పవన్ ఆ పార్టీతో కలిసే అవకాశాలు కనిపిస్తున్నాయిప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోకుండా చూస్తామన్న పవన్ వ్యాఖ్యలను చూస్తే బాధ అనిపించినా.. నిజం చెప్పినందుకు సంతోషించాలని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. పవన్ ఉద్దేశం చూస్తుంటే తెలుగుదేశం పార్టీతో కలిసే అవకాశాలు కనిపిస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. జనసేన, భాజపా, తెలుగుదేశం కలిస్తే ప్రజలకు మంచి జరుగుతుందన్న ఉద్దేశంతోనే పవన్ ఆవిధంగా వ్యాఖ్యలు చేసినట్లు అనిపిస్తోందని రఘురామ తెలిపారు.
“వ్యతిరేక ఓట్లు చీల్చనని పవన్‌ చెప్పారు. బలమైన ప్రతిపక్షాలు కలవాలి. ఇప్పటికే భాజపాతో కలిసి ఉన్నారు. పవన్‌ ఉద్దేశం ప్రకారం తెదేపాతో కలవచ్చు. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం. మూడు పార్టీలు కలిస్తే ప్రజలకు మంచి జరుగుతుందని పవన్‌ ఉద్దేశం

*ఏపీలో ప్రత్యామ్నాయం మేమే: సోము వీర్రాజు
ఏపీలో ప్రత్యామ్నాయం ఏర్పడాలంటే భాజపాతోనే సాధ్యమని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. జగన్ ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారని మండిపడ్డారు. సాగునీటి సమస్యల పరిష్కారానికి ఈనెల 19న ‘చలో కడప’కు పిలుపునిచ్చారు.ఏపీలో ప్రత్యామ్నాయం భాజపాతోనే సాధ్యమని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్పష్టం చేశారు. భాజపా గెలుపునకు పేజ్‌ ప్రముఖ్‌ వ్యవస్థ కీలకమైందని తెలిపారు. కోడికత్తి పీకే తమ పేజ్‌ ప్రముఖ్‌ వ్యవస్థను కాపీ కొట్టారన్నారు. మరోవైపు జగన్ ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వాన్ని గద్దెదించాకే దశదిశా ఉన్న ప్రభుత్వం వస్తుందన్నారు.పెండింగ్‌ ప్రాజెక్టులు ఎందుకు పూర్తి చేయలేకపోతున్నారో వైకాపా ప్రభుత్వం చెప్పాలని ప్రశ్నించారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాజెక్టులను పట్టించుకోలేదని విమర్శించారు. ఉత్తరాంధ్ర పెండింగ్ ప్రాజెక్టులపై త్వరలో పోరాటం చేస్తామన్నారు. సాగునీటి సమస్యల పరిష్కారానికి ఈనెల 19న ‘చలో కడప’ కార్యక్రమం చేపటనున్నట్లు ప్రకటించారు. జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఒక్క ఉద్యోగం ఇవ్వలేదని ఆరోపించారు. నిరుద్యోగులకు నిరీక్షణ తప్ప ఫలితం లేకుండా పోయిందని మండిపడ్డారు.పేజ్ ప్రముఖ్ అంటే..క్షేత్రస్థాయి నుంచి.. సాధారణంగా లోక్సభ ఎన్నికను.. నియోజకవర్గం, వార్డులు లేదా డివిజన్లు, పోలింగ్ బూత్లు ఇలా విభజించుకుని పార్టీలన్నీ ఎన్నికలకు సిద్ధమవుతాయి. కానీ పేజ్ ప్రముఖ్ వ్యవస్థ.. మరింత క్షేత్రస్థాయి నుంచి పని చేస్తుంది. ప్రచారంలో అన్ని ప్రాంతాలను కవర్ చేయలేని పరిస్థితులు ఉంటాయి. ఇలాంటి ఇబ్బందులను అధిగమించేందుకు క్షేత్రస్థాయి సమన్వయం కోసం.. పేజ్ ప్రముఖ్ వ్యవస్థను భాజపా రూపొందించింది. పోలింగ్‌బూత్‌లో ప్రతీ పేజ్‌కు పార్టీకి అనుకూలంగా ఉండే వ్యక్తిని గుర్తిస్తారు. ఇతడే పేజ్ ప్రముఖ్. వారికి పార్టీ విధివిధానాలు, మ్యానిఫెస్టో, చేసిన అభివృద్ధి, చేస్తామని చెబుతున్న హామీలు ఇలా ప్రతీ అంశంలోనూ.. ఆ పేజ్ ప్రముఖ్‌కు శిక్షణ ఇస్తారు. వారికి ఆ పేజ్‌లోని మిగిలిన ఓటర్లను పార్టీకి అనుకూలంగా మార్చి ఓటు వేయించేలా బాధ్యత అప్పగిస్తారు. అలా ఒక్క పోలింగ్ బూత్ కే సుమారు 10-15మంది పేజ్ ప్రముఖ్ లను ఏర్పాటు చేసుకుని వ్యూహాన్ని అమలు చేస్తారు. ఈ వ్యూహం ద్వారానే ఉత్తరాది రాష్ట్రాల్లో విజయవంతమైన కమళదళం..ఇప్పుడు మన రాష్ట్రంలోనూ ప్రవేశపెట్టాలని ప్రణాళికలు రచిస్తోంది.

*దేశ తలసారి ఆదాయంలో మనమే నంబర్‌ వన్‌ : కేసీఆర్‌
దేశ తలసరి ఆదాయంలో తెలంగాణే నంబర్‌ వన్‌ స్థానంలో ఉందని సీఎం కేసీఆర్‌ అన్నారు. మంగళవారం శాసన సభలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు సీఎం కేసీఆర్‌ సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘దేశ తలసరి ఆదాయంలో మనమే నెంబర్‌ వన్‌గా ఉన్నాం. సిక్కీం రాష్ట్రం మనకంటే చిన్నది. సిక్కీం జనాభే 6.60లక్షలు. జస్ట్‌ 0.1 శాతం మనకంటే ముందున్నది. ఇవన్నీ ఊరికే రాలే. నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఓ సందర్భంలో మాట్లాడుతుంటే హెల్త్‌ విషయంలో మనం జాగ్రత్తలు తీసుకోవాలని ఉంటే.. ఏ స్టేట్లలో బాగుండి ఇండియాలో.. బయట దేశాల్లో ఎక్కడ బాగుంది.. అంటే తమిళనాడుకు టీమ్‌ను పంపించాన.సెక్రెటరీ స్మితా సబర్వాల్‌, ఆమె ఆధ్వర్యంలో నలుగురు ఐఏఎస్‌లను నలుగురిని పంపిస్తే స్టడీ చేసి వచ్చి చెప్పారు. తమిళనాడుకు పోయిన సమయంలో ఐఎంఆర్‌, ఎంఎంఆర్‌లో తమిళనాడు బాగుందంటే వెళ్లాం. తాము గర్వానికి పోలేదు. ఎక్కడ బాగుంటే అక్కడ నేర్చుకునే ప్రయత్నం చేశాం. అక్కడి నుంచి తెచ్చుకొని అనేక పద్ధతుల్లో అమలు చేశాం. కేసీఆర్‌ కిట్‌ను ప్రారంభించాం. ఇనిస్టిట్యూషనల్‌ డెలివరీలు పెంచాం. న్యూటిషన్‌ పెంచాం. వీటన్నింటి ఫలితంగా మూడు నాలుగు రోజుల కిందట నీతి ఆయోగ్‌ వెలువరించిన నివేదికలో మాతా మరణాల సంఖ్యలో తమిళనాడును మనం మించిపోయాం. తమిళనాడుకు వెళ్లిన సమయంలో మాతా మరణాల రేటు 92, తమిళనాడులో 79.. తాజాగా తమిళనాడులో 58 ఉంటే.. తెలంగాణలో 56 ఉంది’ అంటూ ఆరోగ్యశాఖను మంత్రి కేసీఆర్‌ అభినందించారు.ఇంకా ఆయన మాట్లాడుతూ.. ఇవాళ మూడు మెడికల్‌ కాలేజీలు ఉంటే.. ఆ సంఖ్యను 33కు తీసుకెళ్తున్నామన్నారు. దాంతో పాటు మెడికల్‌ కాలేజీతో పాటు నర్సింగ్‌ కాలేజీలను ప్రతిచోట సైతం ఏర్పాటు చేయబోతున్నాం. విశ్వవిద్యాలయాలు అంతకు ముందు 13 ఉంటే.. ప్రైవేటు, ప్రభుత్వం కలిసి మరో 11 విశ్వవిద్యాలయాలను నెలకొల్పాం. ఆ విధంగా తెచ్చిన అప్పులను జాగ్రత్తగా.. ఒక్క రోజు డిపాల్ట్‌ లేకుండా రాష్ట్రం తెలంగాణ. తెలంగాణ భాషలో చెప్పాలంటే పతార. పతార మంచిగుంటనే మనదిక్కు చూస్తరు. 40 సంవత్సరాల బాండ్లు కూడా అమ్ముడుపోయే ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ’ అన్నారు.

* ఇది ‘చెంచాల యుగం..’ అయినా.. అంబేద్క‌ర్ మిష‌న్‌ను ముందుకే తీసుకెళ్తాం : మాయావ‌తి
ఇప్ప‌టి యుగమంతా భ‌జ‌ర‌ప‌రుల యుగ‌మేన‌ని బీఎస్పీ అధినేత్రి మాయావ‌తి ఎద్దేవా చేశారు. ఇంత‌టి భ‌జ‌న‌ప‌రులు, చెంచాల యుగంలో బాబా సాహెబ్ అంబేద్‌‌ర్ మిష‌న్‌ను, క‌ల‌ల‌ను ముందుకు తీసుకెళ్ల‌డం క‌ష్ట‌మైన ప‌నేన‌ని అన్నారు. అయినా… తాము అంబేద్క‌ర్ మిష‌న్‌ను ముందుకు తీసుకెళ్తూనే వుంటామ‌ని ఆమె స్ప‌ష్టం చేశారు. బీఎస్పీ సిద్ధాంత‌క‌ర్త‌, వ్య‌వస్థాప‌కులు కాన్షీరాం జ‌యంతిని పుర‌స్క‌రించుకొని మాయావ‌తి ఈ వ్యాఖ్య‌లు చేశారు.ద‌ళితులు, వెనుక‌బ‌డిన వ‌ర్గాల అభ్యున్న‌తి కోసం బీఎస్పీ ఉద్య‌మం చేస్తోంద‌ని, వీరంద‌రూ వారి వారి కాళ్ల మీద నిల‌బ‌డే వ‌ర‌కూ ఈ ఉద్య‌మం కొన‌సాగుతూనే వుంటుంద‌న్నారు. ఇప్పుడు అంతా చెంచాల యుగ‌మే. ఈ యుగంలో అంబేద్క‌ర్ మిష‌న్‌కు క‌ట్టుబ‌డి ఉండ‌టం క‌ష్ట‌మే. బ‌హుజ‌న ఉద్య‌మం కార‌ణంగానే బీఎస్పీ యూపీలో ఘ‌న విజ‌యం సాధించింది. ఇక‌పై కూడా ఇలాగే పోరాటాలు చేస్తాం. మా సిద్ధాంత పునాదుల‌పైనే పోరాటం చేస్తాం. ఇదే కాన్సీరాంకు ఇచ్చే నిజ‌మైన నివాళి అని మాయావ‌తి పేర్కొన్నారు.

*టీడీపీ నేతలు శవాలపై చిల్లర రాజకీయాలు చేస్తున్నారు: కొడాలి నాని
జంగారెడ్డి గూడెం మరణాలపై టీడీపీ నేతలు దుష్ర్పచారం చేస్తున్నారని పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. మంగళవారం అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద మాట్లాడుతూ.. సహజ మరణాలను మద్యం మరణాలుగా దుష్రచారం చేయడం తగదని, ప్రభుత్వాన్ని అల్లరి చేయాలనే ఉద్దేశ్యంతోనే ఇలా చేస్తున్నారని ఫైర్‌ అయ్యారు. మూడో తేది చనిపోతే ఇప్పుడు రాద్దాంతాం చేస్తున్నారని, ఇదంతా టీడీపీ నాయకులు శవాలపై చిల్లర ఏరుకునే నీచ రాజకీయాలేనని ధ్వజమెత్తారు. నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకోమని, ఘాటుగా బదులిస్తామని ఆయన అన్నారు.

*175 సీట్లలో వైసీపీ పోటీ: కొడాలి నాని
రాష్ట్రంలోని 175 సీట్లలో ఒకేసారి పోటీ చేయగల సత్తా వైసీపీకి మాత్రమే ఉందని మంత్రి కొడాలి నాని అన్నారు. రాష్ట్రంలో ఒకేసారి 160 సీట్లు పోటీ చేసే సత్తా ఏ ప్రతిపక్ష పార్టీకి లేదని ఆయన ఎద్దేవా చేశారు. గుంపులుగా పందుల తరహాలో ప్రతిపక్షాలన్నీ కలిసి 175 సీట్లు పంచుకోవాల్సిందేనని ఆయన పేర్కొన్నారు. జగన్ అనే సింహం సింగిల్‌గానే పోటీ చేస్తుందని ఆయన అన్నారు. చావులను రాజకీయాలకు వాడుకుని రాష్ట్ర ప్రజలకు తప్పుడు సంకేతాలు ఇస్తున్నారని ప్రతిపక్షాలపై ఆయన మండిపడ్డారు. 60 వేల జనాభా ఉన్న మున్సిపాలిటీలో సహజ మరణాలను కల్తీ సారా మరణాలుగా చిత్రీకరించే ప్రయత్నం జరిగిందన్నారు. కుటుంబ సభ్యుల్లో ఎవరైనా మృతి చెంది బాధల్లో ఉంటే ఎవరైనా ఆవేదనలోనే సమాధానం చెబుతారని ఆయన పేర్కొన్నారు. మూడో తేదీ నుంచి మృతి చెందినా, ఎవరూ ఫిర్యాదు చేయక పోయినా, మృతదేహాలను దహనం చేసేసిన తర్వాత ఈ తరహా ఆరోపణలను లేవదీశారని ఆయన అన్నారు. ప్రజా సమస్యలు దొరక్క కట్టుకథలు సృష్ఠించి ప్రభుత్వంపై ఆరోపణలు చేయిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. భార్యను అవమానించారని శాసనసభకు చంద్రబాబు రాలేదని, కానీ ఆయన కుమారుడు లోకేష్ మాత్రం హాజరయ్యారని ఇదెక్కడి ద్వంద్వ విధానమని ఆయన ప్రశ్నించారు. గతంలో వైసీపీ ఛాలెంజ్ చేసి ప్రతిపక్ష పార్టీగా సభకు హాజరు కాలేదని ఆయన పేర్కొన్నారు.

*జనసేన ఓ చలనం లేని పార్టీ: మంత్రి కన్నబాబు
సీఎం జగన్‌పై జనసేన పార్టీ ఆవిర్భావ సభలో ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ చేసిన ఆరోపణలపై మంత్రి కన్నబాబు తీవ్రస్థాయిలో స్పందించారు. జనసేన పార్టీని ఓ చలనం లేని పార్టీగా అభివర్ణించారు. ఓ చలనం లేని పార్టీ ఏదో సంచలనం ప్రకటించినట్టు తాము చూడడం లేదని ఆయన ఎద్దేవా చేశారు. జనసేన పార్టీకి అధికారంలోకి రావాలనే లక్ష్యం లేదన్నారు. తాను జగన్‌ను అధికారంలోకి రానివ్వబోమని అంటున్నాడని, పవన్ లక్ష్యం చంద్రబాబును సీఎంను చేయడమేనని ఆయన పేర్కొన్నారు. మీటింగ్‌కు, టీజర్‌కు ఉన్నత హడావుడి సినిమాకు లేదన్నారు. టీడీపీకి అనుబంధంగా జనసేన పనిచేస్తుందని ఆయన ఆరోపించారు. బీజేపీ రోడ్ మాప్ ఇవ్వాలి అని ఆయన ఎదురుచూస్తున్నారన్నారు. కానీ మీకు ఏ రోడ్ మ్యాప్ లేదు, రోడ్ లేదని ఆయన విమర్శించారు. బీజేపీని కూడా టీడీపీతో కలిసి పనిచేయ్యాలంటున్నారా అని ఆయన ప్రశ్నించారు. ఎవరో వస్తారు అని జగన్ ఎదురు చూడడం లేదన్నారు.

*సీఎం కేసీఆర్ అవ‌స‌రం ఈ రాష్ట్రానికి ఎంతో ఉంది : అక్బ‌రుద్దీన్ ఓవైసీ
ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు ఆరోగ్యంగా ఉండాల‌ని కోరుకుంటున్న‌ట్టు ఎంఐఎం ఎమ్మెల్యే అక్బ‌రుద్దీన్ ఓవైసీ తెలిపారు. శాస‌న‌స‌భ‌లో ద్ర‌వ్య వినిమ‌య బిల్లును సీఎం కేసీఆర్ ప్ర‌వేశ‌పెట్టిన అనంత‌రం అక్బ‌రుద్దీన్ ఓవైసీ చ‌ర్చ ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఓవైసీ మాట్లాడుతూ.. ప్ర‌జ‌ల‌కు కేసీఆర్ మ‌రింత సేవ చేయాల‌న్నారు. ప్ర‌జ‌ల ఆకాంక్షలు నెర‌వేరాలంటే సీఎం కేసీఆర్ అవ‌స‌రం ఈ రాష్ట్రానికి ఎంతో ఉంద‌న్నారు.పోలీస్, మెడిక‌ల్, ఎడ్యుకేష‌న్ విభాగాల్లో ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేస్తున్న‌ట్లు కేసీఆర్ ప్ర‌క‌టించ‌డం సంతోషంగా ఉంద‌న్నారు. ఉద్యోగాల‌కు ప్రిపేర్ అయ్యే అభ్య‌ర్థుల‌కు ఉచితంగా కోచింగ్ సెంట‌ర్ల‌ను ఏర్పాటు చేయాల‌ని ప్ర‌భుత్వానికి ఓవైసీ సూచించారు. అదే విధంగా ఉద్యోగాల కోసం పోటీ ప‌డుతున్న ఉర్దూ మీడియం విద్యార్థుల కోసం ఉర్దూ స్ట‌డీ సెంట‌ర్లు ఏర్పాటు చేయాల‌న్నారు. పాత‌బ‌స్తీలో స్ట‌డీ సెంట‌ర్‌ను ఏర్పాటు చేయాల‌ని కోరారు.తెలంగాణ ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ ప‌థ‌కాలను ఇతర రాష్ట్రాలు ఆద‌ర్శంగా తీసుకుని అమ‌లు చేస్తున్నాయ‌న్నారు. అంద‌ర‌మూ క‌లిసి బంగారు తెలంగాణ క‌ల సాకారం చేద్దామ‌ని ఓవైసీ పిలుపునిచ్చారు. స‌భ స‌జావుగా న‌డిపిన స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి, శాస‌న‌స‌భా వ్య‌వ‌హారాల శాఖ మంత్రి ప్ర‌శాంత్ రెడ్డికి ఓవైసీ అభినంద‌న‌లు తెలిపారు

*బ‌డ్జెట్‌పై ఆ విమ‌ర్శ‌లు స‌హ‌జం : సీఎం కేసీఆర్
బ‌డ్జెట్ అనేది నిధుల యొక్క కూర్పు అని రాష్ట్ర ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు స్ప‌ష్టం చేశారు. బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్టిన త‌ర్వాత అద్భుతంగా ఉంద‌ని అధికార స‌భ్యులు ప్ర‌శంసిస్తారు. ప‌స‌లేని, ప‌నికిమాలిన బ‌డ్జెట్ అని విప‌క్షాలు విమ‌ర్శిస్తాయి.. ఈ విమ‌ర్శ‌లు స‌హ‌జ‌మ‌ని కేసీఆర్ అన్నారు. శాస‌న‌స‌భ‌లో ద్ర‌వ్య వినిమ‌య బిల్లుపై చ‌ర్చ అనంత‌రం కేసీఆర్ స‌మాధానం ఇచ్చారు. ఈ సంద‌ర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. త‌న ఆరోగ్యం మంచిగా ఉండాల‌ని కోరుకున్న స‌భ్యుల‌కు వ్య‌క్తిగ‌తంగా ధ‌న్య‌వాదాలు తెలియ‌జేస్తున్నాను. ప్ర‌జాస్వామ్యం ప‌రిణితి చెందే క్ర‌మంలో చ‌ట్ట‌స‌భ‌ల్లో జ‌ర‌గ‌వ‌ల‌సిన చ‌ర్చ‌ల స‌ర‌ళి ఇంప్రూవ్ కావాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. యువ నాయ‌క‌త్వానికి ఇది ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుంద‌న్నారు. స‌క్ర‌మైన చ‌ర్చ‌లు జ‌రిగితే మంచి ఫ‌లితాలు వ‌స్తాయ‌న్నారు. బ‌డ్జెట్ అంటే బ్ర‌హ్మ‌ప‌దార్థం అన్న‌ట్టు, అంకెలు మాత్ర‌మే చెప్త‌రు అన్న‌ట్టు మ‌న దేశంలో ప్ర‌బ‌లి ఉంద‌న్నారు. పార్ల‌మెంట్‌లో కానీ, వివిధ రాష్ట్రాల బ‌డ్జెట్‌ల్లో కానీ రెండు విష‌యాలు గ‌మ‌నిస్తాం. ఆర్థిక మంత్రి బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెడుతారు. అద్భుత‌మైన బ‌డ్జెట్ అని అధికార స‌భ్యులు, ప‌స‌లేని, ప‌నికిమాలిన బ‌డ్జెట్ అని విప‌క్ష స‌భ్యులు అంటారు. ఈ అభిప్రాయంలో మార్పు లేదు. సీట్లు మారినా కూడా ఇదే ధోర‌ణి కొన‌సాగుతోంది. బ‌డ్జెట్ అనేది నిధుల యొక్క కూర్పు. ఈ స‌మ‌కూర్చ‌బ‌డ్డ నిధుల‌ను ఎలా ఉప‌యోగించాల‌నేది కూడా ప్ర‌ధానం అని పేర్కొన్నారు. ప్ర‌స్తుతం ప్ర‌పంచ ఆర్థిక వ్య‌వ‌స్థ‌, దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ కొత్తపుంత‌లు తొక్కుతోంది. మొట్ట‌మొద‌టి దేశ‌ బ‌డ్జెట్ 190 కోట్లు.. దాంట్లో 91 కోట్లు ర‌క్ష‌ణ రంగానికే. ఎంఏ పొలిటిక‌ల్ సైన్స్ చ‌దివేట‌ప్పుడు చెన్నారెడ్డి బ‌డ్జెట్ ను ప్ర‌వేశ‌పెట్టారు. అప్పుడు ఏపీ బ‌డ్జెట్ 680 కోట్లు. ఇప్పుడేమో ల‌క్ష‌ల కోట్‌ిలో మాట్లాడుతున్నామ‌ని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. అలా స‌మ‌కూర్చుకున్న నిధులపై అభివృద్ధి ఆధార‌ప‌డి ఉంటుంద‌ని కేసీఆర్ స్ప‌ష్టం చేశారు

*బీజేపీ చేతిలో పవన్ కీలుబొమ్మ: Tulasireddy
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రసంగం పిట్టల దొర ప్రసంగం లా ఉందని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి విమర్శలు గుప్పించారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ…. బీజేపీ చేతిలో పవన్ కళ్యాణ్ కీలుబొమ్మ అని అన్నారు. రాష్ట్రానికి బీజేపీ ఒక శని గ్రహంలాంటిదని… రాష్ట్రానికి నెంబర్ ఓన్ ద్రోహి బీజేపీ అని వ్యాఖ్యలు చేశారు. అటువంటి బీజేపీ ఇచ్చే రోడ్డు మ్యాప్‌తో ముందుకు పోతానని పవన్ చెప్పడం హాస్యాస్పదమన్నారు. కుక్క తోక పట్టుకొని గోదావరి ఈదుతా అన్నట్టు ఉంది పవన్ తీరు అని ఆయన దుయ్యబట్టారు. సభా ప్రాంగణానికి కాంగ్రెస్ నాయకులు దామోదరం సంజీవయ్య పేరు పెట్టుకుని అదే సభా ప్రాంగణం నుంచి కాంగ్రెస్ హటావో అనడం, రాహుల్ గాంధీని విమర్శించడం అవివేకమన్నారు. చేస్తే స్వశక్తి రాజకీయాలు చేయాలని, లేకుంటే జనసేన పార్టీనీ బీజేపీలో విలీనం చేయాలన్నారు. అంతే తప్ప డొంక తిరుగుడు రాజకీయాలు, బ్రోకర్ రాజకీయాలు వద్దని తులసిరెడ్డి వ్యాఖ్యానించారు

*బిజేపీతో పొత్తు పెట్టుకున్న పవన్.. ఏమైనా సాధించారా?: అవంతి
జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌పై మంత్రి అవంతి శ్రీనివాస్ మండిపడ్డారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ జనసేన ఆవిర్భావ సభలో పవన్ అసత్యాలు మాట్లాడారని విమర్శించారు. బీజేపీతో పొత్తు ఏపీలోనా.. తెలంగాణలో కూడానా? అని ప్రశ్నించారు. పవన్‌కు ఆవేశం ఎక్కువ.. ఆలోచన తక్కువన్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకొని ఏమైనా సాధించారా? అని మంత్రి ప్రశ్నించారు. చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసేందుకే పవన్ కల్యాణ్ పార్టీ పెట్టారని మంత్రి అవంతి ఆరోపించారు. అవకాశం వస్తే చంద్రబాబు పవన్‌ను సీఎం చేస్తారా? లోకేష్‌ను చేస్తారా? అని ప్రశ్నించారు. తమపై వ్యక్తిగత విమర్శలకు దిగితే ఊరుకోమన్నారు. ‘‘నేను దేవుడిని నమ్మే వ్యక్తిని దయ చేసి నా జోలికి రావద్దు.. నాకు నేనే సినిమా హీరో నాకు ఎవ్వరి అండ అవసరం లేదు..’’ అని మంత్రి అవంతి వ్యాఖ్యానించారు

*తెలంగాణస్పీకర్ నిర్ణయంపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాం: Etela
తెలంగాణ అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేలను అనుమతించేందుకు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి నిరాకరించడంపై ఆ పార్టీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. మంగళవారం ఏబీఎన్‌తో మాట్లాడుతూ… స్పీకర్ నిర్ణయంపై సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు తెలిపారు. అసెంబ్లీలో తమకు కేటాయించిన సీట్లలో నిలబడితే సస్పెండ్ చేయటం అనైతికమని మండిపడ్డారు. సభా సంప్రదాయాలను మంటగలిపే విధంగా స్పీకర్ వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఉద్యమాన్ని తూలనాడిన మంత్రితో ఉద్యమకారులను సస్పెండ్ చేయించటం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను తరిమి తరిమి కొడతామన్న వ్యాఖ్యలను సీఎం మర్చిపోయినట్లున్నారని తెలిపారు. తెలంగాణలో చంద్రశేఖర్రావు రాజ్యాంగాన్ని అమలు చేసుకుంటున్నారని విమర్శలు గుప్పించారు. రాజ్యాంగాన్ని కాపాడాల్సిన వారే బాధ్యత మర్చిపోయి ప్రవర్తిస్తున్నారన్నారు. కేసీఆర్ అహంకారాన్ని బొందపెట్టే అతింత నిర్ణేతలు ప్రజలే అని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్పష్టం చేశారు.

*ముగ్గురమే కావొచ్చు… మందబలంతో శాసించలేరు: రఘునందనరావు
భవిష్యత్తులో సీఎం కేసీఆర్‌ను చూసి ప్రజలు నవ్వుకునే రోజు వస్తుందని బీజేపీ ఎమ్మెల్యే రఘనందనరావు అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ… ‘‘మేము ముగ్గురమే కావొచ్చు.. మంద బలంతో మమల్ని శాసించలేరు’’ అని హెచ్చరించారు. స్పీకర్ కుర్చీని కేసీఆర్ రాజకీయాలకు వాడుకోవటం దుర్మార్గమన్నారు. శాసనసభలో అవమానాలకు భవిష్యత్‌లో టీఆర్ఎస్ సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. హైకోర్టు ఉత్తర్వులపై స్పీకర్ తిరస్కరించటాన్ని చీకటి రోజుగా భావిస్తున్నామని అన్నారు. కేసీఆర్ ఆదేశాల మేరకే స్పీకర్ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. హక్కులను కాపాడాల్సిన వారే కాలరాయటం బాధాకరమన్నారు. ‘‘మా మా సీట్లలో కూర్చుంటే ఎలా సస్పెండ్ చేస్తారు. హైకోర్టు ఉత్తర్వులపై మా వాదనలతో స్పీకర్ ఏకీభవించలేదు. గతంలో నల్ల, ఆకుపచ్చ కండువాలు వేసుకుని వచ్చిన విషయాన్ని స్పీకర్‌కు గుర్తుచేశాం’’ అని తెలిపారు. స్పీకర్ నిర్ణయంపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని ఎమ్మెల్యే రఘునందనరావు వెల్లడించారు

*వైఎస్సార్‌ పాలనను తిరిగి తెస్తాం: షర్మిల
వైఎస్సార్‌ కాలం నాటి సంక్షేమ పాలనను తిరిగి తీసుకురావడమే వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ లక్ష్యమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల చెప్పారు. షర్మిల చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్ర సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం సిరిపురం, వెల్లంకి, గొల్నేపల్లి గ్రామాల మీదుగా 10 కి.మీ. సాగింది. ఆయా గ్రామాల ప్రధాన కూడళ్లలో జరిగిన సభల్లో ఆమె ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ప్రజలు ఆశీర్వదించి అధికారమిస్తే రాజన్నబిడ్డగా చివరిక్షణం వరకు తెలంగాణ ప్రజల బాగు కోసం పాటుపడతానని హామీ ఇచ్చారు. వైఎస్‌ తన ఐదేళ్ల పాలనలో ఎలాంటి పన్నులు విధించకుండా అన్నివర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందించి మోడల్‌ సీఎంగా నిలిచారని అన్నారు. పారదర్శక పాలన అందించాలనే పరితపించి ప్రజలవద్దకు వెళ్తుంటే ప్రాణాలు వదిలాడని భావోద్వేగంతో చెప్పారు. రాష్ట్రంలో రైతులు, చేనేత కార్మికులు, యువకుల ఆత్మహత్యలు సీఎం కేసీఆర్‌కు పట్టడం లేదని విమర్శించారు. ఆమె వెంట పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిట్ట రాంరెడ్డి, జిల్లా కో–ఆర్డినేటర్‌ మహ్మద్‌అత్తార్‌ తదితరులు ఉన్నారు

*సహజ మరణాలపైనా రాజకీయం: బొత్స
ప్రతిదీ రాజకీయం చేద్దామంటే కుదరదని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రతిపక్షంపై మండిపడ్డారు. సహజ మరణాలను కూడా రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘సారా మరణాలపై టీడీపీ ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్తుంటే.. వాస్తవాలు ప్రజలకు తెలిసిపోతాయనే దురుద్ధేశంతో సభలో గందరగోళం చేయడం దుర్మార్గం. ప్రభుత్వంపై టీడీపీ, పత్రికలు, చానల్స్‌ చేస్తున్న ప్రచారం అవాస్తం. సానుభూతి కోసం చీప్‌ ట్రిక్స్‌ ప్రదర్శించడం సరికాదు. జంగారెడ్డిగూడెంలో క్రమేణ రెండు నెలలుగా మరణాలు జరిగాయి. పైగా ప్రతిపక్షం అన్నట్లు బాధితుల నుంచి ఫిర్యాదులుండాలి కదా? పోస్టుమార్టం చేయాలి కదా?’ అన్నారు. పోస్టుమార్టం చేయాల్సింది ప్రభుత్వమే కదా? అని ‘ఏబీఎన్‌’ ప్రశ్నించగా.. ఏబీఎన్‌వాళ్లే సీబీఐ అంటూ చమత్కరించారు. అలాగే, పలువురు వైసీపీ సభ్యులు సచివాలయం మీడియా పాయింట్‌ వద్ద మాట్లాడారు. సహజ మరణాలను ప్రభుత్వ హత్యలుగా దుష్ప్రచారం చేస్తున్న చంద్రబాబును ప్రజలు ఛీ కొడుతున్నారని ప్రభుత్వ విప్‌ కోరముట్ల శ్రీనివాసులు వ్యాఖ్యానించారు.

*శవ రాజకీయాలకు జగన్‌రెడ్డి బ్రాండ్‌ అంబాసిడర్‌: లోకేశ్‌
శవ రాజకీయాలకు జగన్‌రెడ్డి బ్రాండ్‌ అంబాసిడర్‌ అని టీడీపీ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి లోకేశ్‌ ధ్వజమెత్తారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘శవ రాజకీయాలకు ట్రేడ్‌ మార్క్‌ జగన్‌రెడ్డి. వాటిపై ఆయనకు పేటెంట్‌ ఉంది. గొడ్డలి పోటును గుండె పోటని మభ్య పెట్టినట్లు సారా మరణాలను ఇప్పుడు సహజ మరణాలని చూపిస్తున్నారు. జంగారెడ్డి గూడెంలో 25 మంది చనిపోతే ప్రతిపక్షంగా మేం చర్చ కావాలని అడగకూడదా? అదేమైనా నేరమా? ప్రభుత్వం ప్రకటన చేస్తే మేం ఏ ప్రశ్నా వేయకుండా విని ఊరుకోవాలట. చర్చకు ప్రభుత్వానికి ఎం దుకు భయం?’’ అని లోకేశ్‌ ప్రశ్నించారు. ‘‘నాటు సారా పల్లెల్లో ఏరులై పారుతోందని అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం గతంలో స్వయంగా చెప్పారు.అదే విషయంపై చర్చ అడిగితే ముందుకు రాలేక ప్రభుత్వం పారిపోయింది’’ అని ఎమ్మెల్సీ దీపక్‌ రెడ్డి ఆరోపించారు. మృతుల ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలని ఎమ్మెల్సీ బీటీ నాయుడు డిమాండ్‌ చేశారు. ‘‘కల్తీ సారా పాత్రను ప్రభుత్వం అంగీకరించి దిద్దుబాటు చేస్తే తల దించుకోవాల్సిన అవసరం తప్పుతుంది’’ అని బీటెక్‌ రవి అన్నారు. కాగా.. సీఎం జగన్‌రెడ్డి లెక్కలను పరిగణలోకి తీసుకొంటే… 610 రోజుల్లో జంగారెడ్డి గూడెంలో ప్రజలంతా చనిపోతారని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అన్నారు.

*మంత్రి గౌతమ్‌ శాఖలు బుగ్గనకు
ఆకస్మికంగా మృతిచెందిన మేకపాటి గౌతమ్‌ రెడ్డి చేపట్టిన మంత్రిత్వ శాఖలను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డికి అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గవర్నర్‌ విశ్వభూషణ్‌ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. బుగ్గన ఇకపై పరిశ్రమలు-ఐటీ, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల కల్పన శాఖల బాధ్యతలు కూడా నిర్వహిస్తారని పేర్కొన్నారు

*హైకోర్టు తీర్పును సీఎం గౌరవించాలి: కొలికపూడి
హైకోర్టు తీర్పును సీఎం జగన్‌మోహన్‌రెడ్డి గౌరవించి అమరావతినే రాజధానిగా కొనసాగించాలని ఏపీ పరిరక్షణ సమితి అధ్యక్షులు కొలికపూడి శ్రీనివాసరావు పేర్కొన్నారు. తుళ్లూరు నుంచి తిరుమల దేవస్థానం వరకు కొనసాగుతున్న అమరావతి రైతుల కృతజ్ఞత పాదయాత్ర సోమవారం గుంటూరు జిల్లా నుంచి ప్రకాశం జిల్లా పర్చూరు మండలం చిననందిపాడుకు చేరింది. గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం అబ్బినేనిగుంటపాలెం అడ్డరోడ్డు నుంచి మూడో రోజు ప్రారంభమైన పాదయాత్రకు అడుగడుగునా మహిళలు హారతులిచ్చి ఘనస్వాగతాలు పలికారు. ఎక్కడికక్కడ ప్రజలు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికారు. చిననందిపాడు నుంచి పర్చూరు వరకు పాదయాత్ర సాగింది.