జాతీయస్థాయిలో ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా కథల్ని తయారుచేయడంలో దక్షిణాది చిత్రసీమ ముందున్నదని చెప్పింది మృణాల్ ఠాకూర్. భాష ఏదైనా వినూత్న కథలకే తాను ప్రాధాన్యతనిస్తానని, తెలుగులో బెస్ట్ స్క్రిప్ట్స్ కోసం ఎదురుచూస్తున్నానని పేర్కొంది. ‘సీతారామం’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు చేరువైందీ భామ. ప్రస్తుతం తాను దక్షిణాది చిత్రాల మీద దృష్టిపెట్టానని, మంచి కథాంశాల అన్వేషణలో ఉన్నానని చెప్పింది. ఆమె మాట్లాడుతూ ‘నటిగా ఎదగాలంటే మన పరిధుల్ని విస్తరించుకోవాలి.ఏదో ఒక భాషకే పరిమితమైపోతామంటే అక్కడే ఆగిపోతాం. హిందీ, మరాఠీలో కెరీర్‌లో ఆరంభించిన నాకు ‘సీతారామం’ రూపంలో తెలుగు ఇండస్ట్రీ గొప్ప బ్రేక్ నిచ్చింది. ఇక్కడి సీనియర్ దర్శకులతో పనిచేయాలనుకుంటున్నా. ‘సీతారామం’ స్థాయి కథ కోసం ఎదురుచూస్తున్నా. ప్రయోగాత్మక ఇతివృత్తాల్లో నటించి తెలుగులో నాకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవాలనుంది’ అని చెప్పింది. కథ నచ్చితే ఓటీటీ చిత్రాల్లో కూడా నటించేందుకు సిద్ధమని మృణాల్ ఠాకూర్ స్పష్టం చేసింది.