Politics

లండన్ న్యూయార్క్ లో కరెంటు పోయిన తెలంగాణలో పవర్ కట్ ఉండదు

లండన్ న్యూయార్క్ లో కరెంటు పోయిన తెలంగాణలో పవర్ కట్ ఉండదు

లండన్‌, న్యూయార్క్‌ వంటి అభివృద్ది చెందిన నగరాల్లో అయినా కరెంట్‌ పోతుందేమో కానీ.. హైదరాబాద్‌లో మాత్రం పవర్‌ కట్‌ ఉండదన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు. ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన నగరం హైదరాబాద్‌ అని.. శుక్రవారం అప్పా పోలీస్‌ అకాడమీలో ఏర్పాటు చేసిన మెట్రో సభలో కేసీఆర్‌ స్పష్టం చేశారు. అలానే హైదరాబాద్‌ మెట్రోను ఎయిర్ పోర్టు వరకూ విస్తరించడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. హైదరాబాద్ నగరం ఢిల్లీ వైశాల్యం కంటే పెద్దదని అన్నారు.
ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ.. ‘‘హైదరాబాద్‌ నగరాన్ని పవర్ ఐల్యాండ్‌గా మార్చాం. దేశవ్యాప్త ఎలక్ట్రిక్ గ్రిడ్‌తో హైదరాబాద్ అనుసంధానం అయింది. లండన్‌, న్యూయార్క్ లాంటి పెద్ద నగరంలో కూడా కరెంటు పోవచ్చేమో కానీ.. హైదరాబాద్‌లో మాత్రం ఒక్క నిమిషం కూడా కరెంటు పోయే పరిస్థితి లేదు. ఆఫీస్ స్పేస్, రియల్ ఎస్టేట్ రంగంలో కూడా హైదరాబాద్ నగరం ఎంతగానో అభివృద్ధి చెందుతోంది. ఇక శంషాబాద్‌ ఎయిర్ పోర్టులో పెరిగిన విమానాల ట్రాఫిక్‌కు అనుగుణంగా రెండో రన్ వేకూడా త్వరలోనే అందుబాటులోకి రాబోతోంది’’ అని తెలిపారు.అంతేకాక ‘‘దేశంలో ఎక్కడా లేని సమశోతోష్ణస్థితి వాతావరణం ఉండేది హైదరాబాద్ నగరంలోనే. పైగా ఇది భూకంపాల భయం లేని నగరం. దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి.. ఎంతో మంది హైదరాబాద్‌ వచ్చి ఇక్కడి స్థిరపడ్డారు. అయితే ఉమ్మడి రాష్ట్రంలో ఈ ప్రాంతానికి సరైన ప్రాధాన్యం ఇవ్వకపోవడం వల్ల ఎన్నో ఇబ్బందులు పడ్డాం. గతంలో కరెంటు లేక.. పారిశ్రామికవేత్తలు హైదరాబాద్ ఇందిరా పార్కు వద్ద ధర్నాలు చేసిన ఘటనలు అనేకం మనం చూశాం. అంతేకాక ఏళ్ల పాటు.. ఎన్నో చోట్ల తాగునీటి సమస్యలు కూడా ఉండేవి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నాక అన్ని సమస్యలు పరిష్కరించుకొని.. నగరాన్ని విశ్వనగరంగా మార్చాం’’ అన్నారు కేసీఆర్‌