WorldWonders

హరికథకు తొలి పద్మశ్రీ//-

హరికథకు తొలి పద్మశ్రీ//-

సంప్రదాయ కళాస్వరూపంగా వికాసం చెందిన కళలలో ‘హరికథ’
స్థానం విశిష్టమైనది.మన దక్షిణాది రాష్ట్రాలలోనూ,మహారాష్ట్రలోనూ ఈ కళారూపానికి ఎంతో ఆకర్షణ,ఖ్యాతి ఉన్నాయి.
తమిళ,కన్నడ,మలయాళ ప్రాంతాలలో దీనిని
‘కథా కాలక్షేపం’గా పిలుస్తారు.
మరాఠాసీమలో ‘అభంగ్’ గా చూస్తారని చెబుతారు.
మన తెలుగునేలపై మాత్రం ‘హరికథ’గా పిలుచుకుంటాం.
వేదకాలం నుంచి ఈ కళారూపం ఉందని అంటారు.తొలి కథకుడు
నారదుడని పౌరాణిక ప్రాముఖ్యతను వివరిస్తుంటారు.
కుశలవులు చెప్పింది కూడా
‘హరికథ’ అని చెబుతూ ఉంటారు.
ఆధునిక కాలంలో,ముఖ్యంగా
తెలుగునాట హరికథకు పర్యాయపదంగా విభ్రాజమానమైన మహాపురుషుడు
ఆదిభట్ల నారాయణదాసు.
ఈ కళకు మహాస్వరూపాన్ని,
గొప్ప ఆకర్షణను
తెచ్చిపెట్టిన మొట్టమొదటి వ్యక్తి నూటికి నూరుపాళ్ళు ఆయనే.
ఆ తర్వాత ఎందరెందరో దశాబ్దాలుగా హరికథా సరస్వతిని
భుజంపై ఎక్కించుకొని మోస్తూ
భుజకీర్తులు తెచ్చారు.
ఆదిభట్ల నారాయణదాసు,
పరిమి సుబ్రహ్మణ్య భాగవతార్,
పెద్దింటి సూర్యనారాయణ
ఈ ముగ్గురిని ‘హరికథక త్రయం’గా
కొందరు అభివర్ణిస్తారు.వీరి పేరున
హరికథా ఉత్సవాలు నిర్వహిస్తూ,
హరికథా ప్రదర్శనలు చేయించి
రుషిరుణం తీర్చుకొనే
గొప్ప యజ్ఞాన్ని దశాబ్దాల పాటు నిర్వహించిన ఘనులు
కోట సచ్చిదానందశాస్త్రి.
‘హరికథా చక్రవర్తి’,
‘హరికథా సమ్రాట్’గా బిరుదభూషణుడైన కోటవారిని ఇటీవలే ‘పద్మశ్రీ’ వరించింది.
మొన్ననే ఢిల్లీలో రాష్ట్రపతి
చేతుల మీదుగా ఈ గౌరవాన్ని
అందుకున్నారు.ఆ సందర్భంలో అక్కడే ఉన్న భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీకి పాద నమస్కారం చేయడానికి సిద్ధమైన కోటవారిని మోదీ వారించి,నిలిచి వినయపూర్వకంగా కైమోడ్పులు అందించిన సన్నివేశం
లక్షల కళ్ళ నుంచి ఆనందభాష్పాలు కురిపించింది.దేశంలోనే ముఖ్యంగా, తెలుగునాట ప్రధానంగా
‘హరికథ’కు ‘పద్మశ్రీ’
సాధించి పెట్టిన ఘనత
కోట సచ్చిదానందశాస్త్రికే చెందుతుంది.
అప్పుడెప్పుడో
నాజర్ మహనీయుడు ‘బుర్రకథ’కు
తొలి ‘పద్మశ్రీ’ తెచ్చిపెట్టాడు.
ఇదుగో ఇప్పుడు కోటవారు హరికథా వనంలో తొలి ‘పద్మం’
పూయించి పునీతుడయ్యాడు.
కోటవారి జీవిత ప్రస్థానాన్ని
ఒక సినిమాగా తీయవచ్చు.
అతని నిజజీవితంలో అంతటి
కథావస్తువు ఉంది.కటికి పేదరికం,
పన్నెండేళ్ల ప్రాయంలోనే తండ్రిని కోల్పోవడం,పాఠశాల కూడా దాటని చదువు.పెద్ద కుటుంబాన్ని తానే పోషించాల్సిన బరువైన బాధ్యతలు.వీటన్నిని అధిగమించి,
సంసార సాగరాన్ని దాటుతూ
హరికథా రంగస్థలంలో మార్తాండగా
విరాడ్రూపం ఎత్తిన విశిష్ట కళాకీర్తి
కోట సచ్చిదానందశాస్త్రి.
అద్దంకి నుంచి పొట్ట చేత్తో పట్టుకొని తెనాలి చేరి,అక్కడ నుంచి ఎక్కడెక్కడో తిరిగి,బిచ్చమెత్తి,
అక్షరబిక్ష పొంది
హరికథా స్వరూపంగా అవతారమెత్తాడు.
పసివయసులోనే హరికథా ప్రదర్శనలు చేసి జేజేలు కొట్టించుకున్న చిచ్చరపిడుగు.
ఎ ఆర్ కృష్ణమూర్తి ,ముసునూరి
సూర్యనారాయణ భాగవతార్, అన్నపూర్ణయ్య దగ్గర కోటవారు
హరికథలోని మేళకువలు నేర్చుకున్నారు.
వారినే తన విద్యా గురువులుగా స్తుతిస్తూ మదిలోనిలుపుకున్నారు.
కోటవారికి ఇప్పుడు 90ఏళ్ళు.
దాదాపు ఎనిమిది దశాబ్దాల పాటు హరికథా ప్రస్థానంలోనే జీవించిన విశిష్టుడు,వరిష్టుడు,లబ్ధప్రతిష్ఠుడు.
కుగ్రామాల నుంచి
దేశ,విదేశ రాజధానుల వరకూ కాలికి గజ్జెకట్టి,చేత చిరుతలు పట్టి వేలాది ప్రదర్శనలు ఇచ్చి జయజయ ధ్వానాలు మిన్నుముట్టించాడు.
ఆకాశవాణి
టాప్ గ్రేడ్ ఆర్టిస్ట్ గానూ రాణకెక్కాడు.
కోట సచ్చిదానందశాస్త్రి హరికథ చెబుతున్నాడంటే వేలమంది మూగిపోయేవారు.ఎద్దుల బండ్లల్లో వాలిపోయేవారు.పట్టణాల్లో హరికథలు చెబుతూ వుంటే
ఆ ప్రాంతానికి దగ్గరలో వున్న
సినిమా థియేటర్లు ఖాళీ అయిపోయి,ప్రేక్షకులు లేక ఉసూరుమనేవి.సినిమాల ఆకర్షణలను కూడా తొక్కిపడేసిన ఆకర్షణాశక్తి కోటవారి హరికథలకు ఉండేది.ఎన్నో తరాల వారికి,
ఎన్నెన్నో ప్రాంతాల వారికి,
విభిన్న సామాజిక స్థాయిల వారందరికీ ఆయన,
ఆయన హరికథ బహుపరిచయం.
ఘంటసాల,మంగళంపల్లి,
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, భానుమతి వంటి అగ్రశ్రేణి కళాకారులు,విశ్వనాథ,కరుణశ్రీ వంటి మహాకవులు, ఎన్టీఆర్,అక్కినేని వంటి మహానటులు కోటవారి హరికథకు వీరాభిమానులు.
సర్వకళా స్వరూపంగా అభివర్ణించే
‘హరికథ’కు అంతటి ప్రాచుర్యం తెచ్చినవారిలో ఈ అర్ధశతాబ్దిలో
కోటవారిదే అగ్రస్థానం.రామాయణ,
భారత,భాగవత,పౌరాణిక కథలు, గాథలను తన హరికథలో అద్భుతంగా ప్రదర్శించి రంజింపజేసిన రసావతారుడు.
సినిమాపాటలు,వాగ్గేయకార కీర్తనలు,పద్యాలు,శ్లోకాలు, దండకాలు ఒకటేమిటి?
కోట పలికించని,రసమొలికించని
చరణమే లేదు.అద్భుతంగా గానం చేస్తూ,నాట్యమాడుతూ, ధ్వన్యనుకరణ చేస్తూ,ఆర్యోక్తులు చెబుతూ,పిట్టకథలు,సామెతలు,
జాతీయాలు వల్లెవేస్తూ ఆయన
హరికథలు చెబుతూ ఉంటే
విని కని తీరాల్సిందే.
ఆ రసానుభూతిని పొందిన లక్షల హృదయాలు కోటవారికి పద్మశ్రీ ప్రకటించగానే పులకించిపోయాయి.
ఈ మహాకారుడిని ఇప్పటి వరకూ ఎన్నో గౌరవశ్రీలు వరించాయి.
అందులో కేంద్ర సంగీత నాటక అకాడెమి వంటి పురస్కారాలు,
‘హంస’ వంటి రాష్ట్ర ప్రభుత్వ పురస్కారాలు ఉన్నాయి.
ఈ శుభవేళ
ఆంధ్ర విశ్వవిద్యాలయం ‘కళాప్రపూర్ణ’తో గౌరవిస్తే,
మిగిలిన విశ్వవిద్యాలయాలు
గౌరవ డాక్టరేట్లు బహూకరిస్తే హరికథా కళామతల్లిని గౌరవించిన వారమవుతాం.
తెలుగులో మాత్రమే అవధానాలు, హరికథలు అందరి కంటే మహోన్నతంగా నిలిచాయి.
దానికి ప్రధాన కారణం మనదైన పద్యం వాటికి తోడుగా నిలవడమే.
ఇంతటి మహోత్కృష్ట
హరికథా ప్రక్రియ కలకాలం కళకళలాడేలా చేసే బాధ్యత మనందరిదీ.-